నిరసనల నడుమ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల వార్డు సభలు

ABN , First Publish Date - 2023-03-19T00:19:08+05:30 IST

నిరసనలు, ఆందోళనలు, అరెస్టుల నడుమ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల వార్డు సభలు శనివారం భువనగిరిలో కొనసాగాయి.

నిరసనల నడుమ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల వార్డు సభలు
రాస్తారోకో చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

3593 దరఖాస్తులకు 1605 మందే అర్హులు

లెక్క తేల్చిన అధికారులు

జాబితాలపై 520 అభ్యంతరాలు

వార్డు సభల్లో నిరసనలు, వాగ్వాదాలు

భువనగిరి టౌన్‌, మార్చి 18: నిరసనలు, ఆందోళనలు, అరెస్టుల నడుమ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల వార్డు సభలు శనివారం భువనగిరిలో కొనసాగాయి. స్థానిక సింగన్నగూడెంలో నిర్మించిన 444 డుబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు 3593 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ఆధారంగా 12 బృందాలు జరిపిన క్షేత్రస్థాయి సర్వేతో పాటు దరఖాస్తుదారుల ఆధార్‌ నెంబర్‌తో అఽధికారులు తెలంగాణ స్టేట్‌ ఆన్‌లైన్‌ సర్వీస్‌ ద్వారా 360 డిగ్రీల విధానంలో దర్యాప్తు చేసి1605 మందిని అర్హులుగా, 1988 మంది అనర్హులుగా గుర్తించారు. ఈ మేరకు వార్డు సభలు ప్రారంభం అయిన వెంటనే సంబంధిత వార్డుల అర్హుల, అనర్హుల జాబితాలను సభా వేదిక వద్ద ప్రదర్శించారు. దీంతో అప్పటి వరకు సొంతింటిపై ఆశలు పెంచుకొని అనర్హుల జాబితాలో చేరిన ఆశావహులందరూ ఒక్కసారిగా అధికారులతో వాదనలకు దిగుతూ నిరసనలు తెలిపారు. జీవనోపాధి కోసం సొంత ఆటోను నడుపుకుంటున్న వారిని, గతంలోనే ఆర్థిక ఇబ్బందులతో ఇళ్లను, కార్లు తదితర నాలుగు చక్రాల వాహనాలను అమ్ముకున్నప్పటికీ సాంకేతిక కారణాలతో రికార్డుల్లో కొనసాగుతుండడాన్ని సాకుగా చూపుతూ అనర్హుల జాబితాలో చేర్చడంపై పలువురు అధికారులపై భగ్గుమన్నారు. ఈ తరహా ఘటనలు అన్నీ వార్డు సభల్లో నెలకొని స్వల్ప ఉద్రిక్తతలకు దారి తీసింది. అలాగే అర్హులను గుర్తించడంలో అధికారుల వైఖరిని నిరసిస్తూ రాస్తారోకోకు దిగిన కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే విపక్షాలతో పాటు బీఆర్‌ఎస్‌ నాయకులు కూడా అర్హులకు అన్యాయం జరిగిందంటూ అధికారులతో వాదనలకు దిగారు. జాబితాలపై 520 అభ్యంతరాలు వచ్చాయి.

444 ఇళ్లకు మిగిలిన దరఖాస్తులు 1605

444 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు గాను 3593 మంది ఆశావాహులు దరఖాస్తులు చేసుకోగా పలు వడపోతల అనంతరం అధికారులు 1605 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించి మిగతా 1988 మందిని అనర్హుల జాబితాలో చేర్చారు. దీంతో అర్హుల జాబితాలో ఉన్న పలువురికి సొంత ఇళ్లు, ఇంటి స్థలాలు ఉన్నాయని, మరికొందరు రైతు బంధును కూడా పొందుతున్నారని పేర్కొంటూ అనర్హుల జాబితాలో ఉన్నవారు నిరసనకు దిగారు. నిబంధనల ప్రకారం తాము డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు అర్హులైనప్పటికీ ఉద్దేశపూర్వకంగా అర్హుల జాబితా నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అర్హులు, అనర్హుల జాబితాలపై వచ్చిన 520 అభ్యంతరాలపై రెండు రోజుల్లో సమగ్ర విచారణ జరిపి, తుది జాబితాను రూపొందించి 4, 5 రోజుల్లో లబ్ధిదారుల ఎంపికకు డ్రా నిర్వహిస్తామని తహసీల్దార్‌ కె.వెంకట్‌రెడ్డి తెలిపారు.

అనర్హులుగా ఎవరిని పరిగణిస్తారు?

సొంత ఇళ్లు కలిగినవారు, 60 గజముల పై బడి ఇంటి స్థలం కలిగిన వారు, 3 లేదా 4 చక్రాల వాహనదారులు, ట్రాక్టర్‌, కలిగి ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగి, సంవత్సర ఆదాయం ఉన్నవారు, ఆదాయ పన్ను చెల్లించే వారు, పక్కా గృహములు కలిగి ఉన్నవారిని అనర్హులుగా గుర్తించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

టౌన్‌ యూనిట్‌గా డ్రా

తుది జాబితా ఆధారంగా లబ్ధిదారుల ఎంపికకు టౌన్‌ యూనిట్‌గా డ్రా నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేశారు. 444 ఇళ్లకు గాను 17శాతం ఎస్సీ, 12శాతం మైనార్టీ, 07శాతం ఎస్టీ, 5శాతం దివ్యాంగులు, 2శాతం మాజీ సైనిక ఉద్యోగులకు కేటాయిస్తూ మిగిలిన ఇళ్లకు బీసీ, జనరల్‌ కేటగిరీలో డ్రా తీస్తారు. రిజర్వేషన్‌ రోస్టర్‌లో కూడా సంఖ్యకు మంచి దరఖాస్తులు ఉంటే డ్రా ద్వారానే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.

Updated Date - 2023-03-19T00:19:08+05:30 IST