ఈవీఎంలపై ఓటర్లకు అవగాహన కల్పించాలి
ABN , First Publish Date - 2023-07-21T01:19:20+05:30 IST
ఓటర్లందరికీ ఈవీఎంలపై అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. గురువారం ఈవీఎం, వీవీప్యాట్లపై అవగాహన కల్పించేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఈవీఎంల ప్రదర్శన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
బీఎల్‌వోలు వారికి కేటాయించిన ప్రాంతాలపై పూర్తి పట్టు సాధించాలి
18 ఏళ్లు నిండిన యువతీ యువకులను ఓటర్లుగా నమోదు చేయాలి
అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్
నల్లగొండ టౌన్, జూలై 20: ఓటర్లందరికీ ఈవీఎంలపై అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. గురువారం ఈవీఎం, వీవీప్యాట్లపై అవగాహన కల్పించేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఈవీఎంల ప్రదర్శన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈవీఎం, వీవీప్యాట్లపై అవగాహన ఎంతో అవసరం అన్నారు. అనంతరం డెమో ఈవీఎం యంత్రంపై ఓటు వేసే విధానాన్ని ఆయన వేసి చూపించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో మోతీలాల్, సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, ఎన్నికల డీటీ విజయ్, తదితరులు పాల్గొన్నారు.
ఓటర్లుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలి
జిల్లాలో 18 ఏళ్లు నిండిన యువతీ యువకులను ఓటర్లుగా నమోదు చేసుకునేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన తన ఛాంబర్‌లో పలు రాజకీయ పార్టీల ప్రతినిఽధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రతీ గ్రామంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటర్ నమోదుపై అవగాహన కలిగించాలన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని కోరారు. సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, డీటీ విజయ్, పలు రాజకీయ పార్టీల ప్రతినిఽధులు బక్క పిచ్చయ్య, పోతెపాక లింగస్వామి, నర్సిరెడ్డి, వి.యాదగిరి, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో రాణించాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. 2023-24 విద్యాసంవత్సరానికి బెస్ట్‌అవైలబుల్ పథకం కింద ఒకటి, ఐదో తరగతుల్లో ప్రవేశాలకు దరఖాసుల్తు చేసుకున్న విద్యార్థులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. రెండు తరగతులకు మొత్తం 271 ఖాళీలు ఉండగా, 800 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో మొదటి తరగతిలో 134 సీట్లకు 339 దరఖాస్తులు, ఐదోతరగతికి 137సీట్లకు 461 దరఖాస్తులు వచ్చాయి. కాగా, విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, బీఏఎస్ పథకం కింద ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తోందన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్, సూపరింటెండెంట్ గోపాలకృష్ణయాదవ్, హెచ్‌డబ్లూవో స్వామి, తదితరులు పాల్గొన్నారు.
తప్పులు లేకుండా ఓటర్ జాబితా
నిడమనూరు: ఓటరు జాబితాను బీఎల్‌వోలు తప్పులు లేకుండా నిర్వహించాలని అదనపు కలెక్టర్, సాగర్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ అన్నారు. గురువారం స్థానిక మోడల్ స్కూల్‌లో బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీఎల్‌వోలు వారికి కేటాయించిన ప్రాంతాలకు సంబంధించిన విషయాలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎలకో్ట్రరల్ రిజిస్ట్రేషన్ అధికారి లీల, తహసీల్దార్ ప్రమీల, డీటీ హరికృష్ణ, రషీద్, తదితరులు పాల్గొన్నారు.