Share News

ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులు

ABN , First Publish Date - 2023-12-08T18:52:34+05:30 IST

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. తాజా ఎన్నికల్లో 12 స్థానాలకు 11 స్థానాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరడం, బలమైన సామాజికవర్గానికి జిల్లా ప్రాతినిధ్యం, కాంగ్రెస్‌ దిగ్గజాలకు ఉమ్మడి జిల్లా నెలవు కావడంతో కొత్త ప్రభుత్వంలో తొలిరోజే 12 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయగా, అందులో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు నేతలు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.

ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులు

మంత్రులుగా ఉత్తమ్‌, వెంకటరెడ్డి ప్రమాణస్వీకారం

రెండు కీలక శాఖలు దక్కే అవకాశం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ): కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. తాజా ఎన్నికల్లో 12 స్థానాలకు 11 స్థానాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరడం, బలమైన సామాజికవర్గానికి జిల్లా ప్రాతినిధ్యం, కాంగ్రెస్‌ దిగ్గజాలకు ఉమ్మడి జిల్లా నెలవు కావడంతో కొత్త ప్రభుత్వంలో తొలిరోజే 12 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయగా, అందులో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు నేతలు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా, వీరికి సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి వర్గంలో కీలక శాఖలు దక్కే అవకాశం ఉంది.

గాంధీ కుటుంబానికి విధేయుడిగా కెప్టెన్‌

గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న కెప్టెన్‌ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2009, 2014, 2018లో కోదాడ, హుజూర్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నల్లగొండ ఎంపీగా ఎన్నికయ్యారు. హుజూర్‌నగర్‌ నుంచి హ్యాట్రిక్‌ సాధించిన ఉత్తమ్‌ ప్రస్తుత ఎన్నికల్లో మరోసారి ఎన్నికై కీలకమైన హోంశాఖ పదవిని దక్కించుకున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డిపై 44,888 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వైయస్‌ హయాంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పబ్లిక్‌ అండర్‌ టేకింగ్‌ కమిటీ చైర్మన్‌గా, 610జీవో కమిటీ చైర్మన్‌గా, శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. సీఎం కిరణ్‌రెడ్డి మంత్రివర్గంలో గృహనిర్మాణశాఖ మంత్రిగా పనిచేశారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఐఏఎ్‌ఫ-యు మిగ్‌-21, 23 యుద్ధవిమానాల పైలట్‌గా పనిచేసిన ఉత్తమ్‌, ఆ తరువాత రాష్ట్రపతులు ఆర్‌.వెంకట్రామన్‌, శంకర్‌దయాళ్‌శర్మకు ఏడీసీగా పనిచేసి ఉన్నత ఉద్యోగాన్ని వదిలి 1994లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మొట్టమొదటిసారిగా కోదాడ బరిలో నిలిచి ఓటమి చెందారు. ఆ తరువాత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమిలో బీఎస్సీ చేసిన ఉత్తమ్‌ సియాచిన్‌, ఇతర ఆపరేషన్ల కోసం నిర్దేశించిన ఐఎఎఫ్‌ ఫ్ల్యూవ్‌-మిగ్‌21, 23 యుద్ధ విమానాల్లో ఫ్రంట్‌లైన్‌ ఫైటర్‌ స్క్వాడ్రన్‌లో పైలట్‌గా సేవలందించారు. పాకిస్తాన్‌, చైనా సరిహద్దు ప్రాంతాల్లో వాయుసేనలో పనిచేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తండ్రి పురుషోత్తమ్‌రెడ్డి బీహెచ్‌ఈఎల్‌లో ఉన్నత ఉద్యోగిగా పనిచేశారు. ఆయన తల్లి ఉషాదేవి గృహిణి. ఆయన సతీమణి పద్మావతి సైతం ప్రస్తుత ఎన్నికల్లో కోదాడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి వర్గంలో ఉత్తమ్‌ మంత్రిగా పదవి దక్కించుకున్నారు.

నాడు తెలంగాణ సాధనకు కోమటిరెడ్డి రాజీనామా

తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మౌళిక వస తులు, పెట్టుబడులు, ఓడరేవుల శాఖ మంత్రి గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2011లో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ సాధన క్రమంలో నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అడ్డుపడుతున్నారని, త్వరితగతిన రాష్ట్రం ఇవ్వాలని కాంగ్రెస్‌ అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చే క్రమంలో వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసి సంచనలం సృష్టించారు. ఫైర్‌ బ్రాండ్‌, కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ అయిన నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మరో సారి మంత్రి పదవి వరించింది. గురువారం స్వరాష్ట్రంలో ఏర్పడిన తొలి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య మంత్రి వర్గంలో ఐటీ, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిగా ఆయన పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి సీఎం కిరణ్‌కుమార్‌ మంత్రి వర్గంలో మౌలిక వసతులు, పెట్టుబడులు, ఓడరేవులశాఖ మంత్రిగా పనిచేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 1999, 2004, 2009, 2014లో వరుసగా నాలుగుసార్లు నల్లగొండ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ వెంటనే వచ్చిన 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డిపై 54,342 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. 1985లో నల్లగొండ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన మాజీ సీఎం ఎన్టీఆర్‌ 31,587 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందగా ఆ రికార్డును కోమటిరెడ్డి బ్రేక్‌ చేశారు. ఫ్లోరైడ్‌ నివారణకు 2003లో నల్లగొండ పట్టణంలోని గడియాం సెంటర్‌లో 11 రోజులపాటు ఆమరణదీక్ష చేపట్టి నాడు రాష్ట్రంలో వెంకటరెడ్డి చర్చకు నిలిచారు. కోమటిరెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి వర్గంలో కీలక శాఖ దక్కే అవకాశం ఉంది.

ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కుటుంబ నేపథ్యం..

తల్లిదండ్రులు : పురుషోత్తంరెడ్డి, ఉషాదేవి

సతీమణి : పద్మావతి విద్యార్హత : బీఎస్సీ

గ్రామం : తాటిపాముల, తిరుమలగిరి మండలం

రాజకీయనేపథ్యం: 1999, 2004లో రెండుసార్లు కోదాడ నుంచి ఎమ్మెల్యేగా విజయం. 2009, 2014, 2023లో హుజూర్‌నగర్‌నుంచి ఎమ్మెల్యేగా విజయం. 2019లో నల్లగొండ ఎంపీగా విజయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో గృహనిర్మాణశాఖ మంత్రిగా పనిచేశారు. 2015నుంచి 2021వరకు తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 1982నుంచి 1991 వరకు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌గా సేవలందించారు.

ప్రజలకు మెరుగైన పాలన అందిస్తాం : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి

సమష్టికృషిగా ప్రజలకు మెరుగైన పాలనను అంది స్తాం.అవినీతిని రూపుమాపి రాష్ట్ర ప్రజలకు ఉన్నతమైన పాలనను అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుంది. రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా తెలంగాణలో పాలన కొనసాగనుంది. ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయడంతో పాటు అనేక సంక్షేమ పథకాలను అందించేలా పాలన సాగిస్తాం. తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుంది.

కోమటిరెడ్డి కుటుంబ నేపథ్యం..

తల్లిదండ్రులు: కోమటిరెడ్డి పాపిరెడ్డి, సుశీలమ్మ

కుటుంబ సభ్యులు: భార్య సబితారెడ్డి, కూతురు శ్రీనిధి

గ్రామం : బ్రాహ్మణవెల్లంల, నార్కట్‌పల్లి మండలం

విద్యార్హత : బీటెక్‌

రాజకీయ ప్రస్థానం: 1999, 2004, 2009, 2014, 2023లో ఐదుసార్లు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక. 2019లో భువనగిరి పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నిక. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా బాధ్యతలు. తాజాగా ప్రత్యేక రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా బాధ్యతలు.

ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుంది : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంత్రి

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మెరుగైన ప్రజా పాలనను మా ప్రభుత్వం అందజేస్తుంది. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తూ ముందుకు సాగుతుంది. మంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తా. ప్రజలు ఇందిరమ్మ రాజ్యంను ఎన్నుకున్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేయడంతో పాటు అభివృద్ధి వైపు అడుగులు వేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతాం.

బీ.వెల్లెంల, హుజూర్‌నగర్‌లో సంబరాలు

నార్కట్‌పల్లి, హుజూర్‌నగర్‌: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంపై బీ.వెల్లెంల, హుజూర్‌నగర్‌లో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన వెంకట్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి వర్గంలో మరోసారి మంత్రి పదవి దక్కడంపై ఆయన స్వగ్రామం బీ.వెల్లెంలలో గ్రామస్థులు సంబరాలు చేసుకున్నారు. గ్రామస్థులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అదేవిధంగా హుజూర్‌నగరల్‌లో ఉత్తమ్‌ అనుచరులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంపిణీచేసి సంబరాలు చేసుకున్నారు.

Updated Date - 2023-12-08T18:52:36+05:30 IST