ఇరుకు గదులతో ఇక్కట్లు

ABN , First Publish Date - 2023-04-03T00:35:27+05:30 IST

మద్దిరాల మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న కస్తూర్బా బాలికల విద్యాలయ భవన నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. దీంతో శిథిలావస్థలో ఉన్న పాత భవనంలో తగిన వసతి, సౌకరాలు లేనందున విద్యార్థినులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

ఇరుకు గదులతో ఇక్కట్లు
కొనసాగుతున్న నూతన భవన నిర్మాణ పనులు

నత్తనడకన నూతన భవన నిర్మాణం

బిల్లులు విడుదల కానందున పనుల ఆలస్యం

అవస్థలు పడుతున్న కస్తూర్బా విద్యాలయ విద్యార్థినులు

మద్దిరాల మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న కస్తూర్బా బాలికల విద్యాలయ భవన నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. దీంతో శిథిలావస్థలో ఉన్న పాత భవనంలో తగిన వసతి, సౌకరాలు లేనందున విద్యార్థినులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

-మద్దిరాల

మద్దిరాలలో కస్తూర్బా బాలిక విద్యాలయ నిర్మాణానికి 2021 సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీన మంత్రులు జగదీ్‌షరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ శంకుస్థాపన చేశారు. రూ. 3.50కోట్ల నిధుల అంచనాతో ప్రారంభించిన భవన నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్లు చేసిన పనులకు సకాలంలో బిల్లులు మంజూరు కానందున పనుల్లో ఆలస్యం జరుగుతోందని సమాచారం. ఇంకా 30శాతం పనులు మిగిలి ఉన్నాయి. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు 250మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ బీసీ పాత వసతి గృహాన్ని కేటాయించారు. శిథిలావస్థలో ఈగృహంలో సరిపడా గదులు లేనందున తరగతులు,వసతికి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మొత్తం ఎనిమిది గదులు ఉండగా, ఒక గది కార్యాలయానికి, మరో గదిని సామాగ్రి కోసం కేటాయించారు. మిగిలిన ఆరు గదుల్లోనే తరగతి గదులు, అవి ముగిసిన తర్వాత వసతి కోసం విద్యార్థినులు అక్కడే ఉండాల్సివస్తోంది. ఒక్కో గదిలో 35 నుంచి 45మంది విద్యార్థినులు రాత్రి పూట నిద్రిస్తున్నారు. వర్షాకాలంలో భవనం కురుస్తున్నందున ఉండటానికి అనుకూలంగా లేదు. సరిపడా మరుగుదొడ్లు, స్నానాల గదులు లేనందున విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. బిక్కుబిక్కుమంటూ ఈ భవనంలో ఉంటున్నారు. ప్రభుత్వం స్పందించి నూతన భవననిర్మాణ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇబ్బంది పడుతున్నాం

ప్రస్తుతం నిర్వహిస్తున్న వసతి గృహంలో సరిపడా మరుగుదొడ్లు లేనందున ఇబ్బందులు పడుతున్నాం. పాఠశాల శిథిలావస్థకు చేరింది. ఒక్కో గదిలో 35 మంది ఉంటున్నాం. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నూతన భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయించాలి.

- అఖిల, 9వ తరగతి

మూడు నెలల్లో అందుబాటులోకి

నూతన భవనం మూడు నెలల్లో అందుబాటులోకి వస్తుందని కాంట్రాక్టర్‌ చెబుతున్నారు. పాత భవనంతో పాటు ఇరుకు గదులతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. భవన నిర్మాణాన్ని కాంట్రాక్టర్‌ సకాలంలో పూర్తి చేస్తే జూన్‌ నుంచి అందుబాటులోకి వస్తుంది.

- తేజశ్రీ, ఎస్‌వో, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, మద్దిరాల

Updated Date - 2023-04-03T00:35:27+05:30 IST