‘దళితబంధు’లో కమీషన్లు తీసుకున్న ఎమ్మెల్యేలకు టికెట్లా?
ABN , First Publish Date - 2023-08-22T23:58:28+05:30 IST
దళితబంధు’ పథకంలో కమీషన్లు తీసుకున్న ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ మళ్లీ టికెట్లు ఇవ్వడం విడ్డూరంగా ఉందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు.
నల్లగొండ, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి ప్రతి నిఽధి): ‘దళితబంధు’ పథకంలో కమీషన్లు తీసుకున్న ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ మళ్లీ టికెట్లు ఇవ్వడం విడ్డూరంగా ఉందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. బొగ్గు గనులు, ఉక్కు ఆధారిత పరిశోధన కోసం ఏర్పాటు చేసిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ స్టడీ టూర్‌లో భాగంగా కర్ణాటకలోని కూర్గ్‌లో జరుగుతున్న సమావేశంలో ఉన్న ఆయన మంగళవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏంచేసిందో సీఎం కేసీఆర్‌కు తెలియదా? ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైందే కాంగ్రెస్ నుంచే కదా అని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన, పూర్తి చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, దీని ద్వారా నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో లక్షల ఎకరాలకు నీరు అందుతుందని తెలిపారు. శ్రీశైలం, కల్వకుర్తి, ఎస్‌ఆర్‌ఎస్పీ ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే నిర్మించామని, కాం గ్రెస్ పాలనలో ప్రతినెలా మొదటి తేదీన పింఛన్లు ఇచ్చేవారమని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం 15వ తేదీ వచ్చినా ఇవ్వడం లేదన్నారు. దేశంలో ఉచిత కరెం టు, రైతుల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో కనీసం బాతరూంలు కూడా ఈ ప్రభుత్వం కట్టించలేకపోయిందని, ఎక్కడా కూడా ప్రభుత్వ ప్రొఫెసర్లు, కనీసం కాంట్రాక్టు స్టాఫ్ కూడా లేరని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన సీఎం కేసీఆర్‌కు కాంగ్రె్‌సను ప్రశ్నించే హక్కు లేదని కోమటిరెడ్డి హితవు పలికారు. బీఆర్‌ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని తెలిపారు. కేసీఆర్ ప్రకటించిన 115 మంది బీఆర్‌ఎస్ అభ్యర్థుల ఆస్తులు ఎమ్మెల్యేలు కాకముందు ఎంత, అయ్యాక ఎంత పెరిగిందనే వివరాలను సేకరించి సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు, ఉద్యమకారులు, నిరుద్యోగులకు పిలుపునిచ్చారు.