వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య

ABN , First Publish Date - 2023-09-22T00:19:58+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.

వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య

మాడ్గులపల్లి, కొండమల్లేపల్లి, హుజూర్‌నగర్‌, సెప్టెంబరు 21: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఎక్కువగా సెల్‌ఫోన్‌ చూస్తుందని కుమార్తెను తల్లిదండ్రులు మందలించడంతో నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి బాలిక, కొండమల్లేపల్లిలో అనుమానాస్పస్థితిలో వివాహిత, సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో చెడు వ్యసనాలకు బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

తల్లిదండ్రులు మందలించారని

నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన బొబ్బలి సైదులు, నిర్మల దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమార్తె బొబ్బలి రమ్య(19) నల్లగొండలోని నాగార్జున డిగ్రీ కళాశాలలో బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతోంది. నెల రోజులుగా చదువుపై ధ్యాస పెట్టకుండా ఎప్పుడూ సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేస్తుండటంతో పలుమార్లు తల్లిదండ్రులు రమ్యను మందలించారు. ఈ నెల 18న రమ్య సెల్‌ఫోన్‌ చూస్తుండగా ఫోన్‌లో ఏముంది మంచిగా చదువుకోవచ్చుగా అని చెప్పి తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లారు. ఆ కొద్దిసేటికే రమ్య ఇంట్లో ఉన్న క్రిమిసంహారక మందు తాగి అపస్మారక స్థితిలోకి చేరుకుంది. గమనించిన తమ్ముడు రాజు వెంటనే తల్లిదండ్రులను పిలిపించి, రమ్యను మిర్యాలగూడలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి, అక్కడినుంచి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. రమ్య తండ్రి సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు.

ఫ్యాన్‌కు ఉరి వేసుకొని వివాహిత

కొండమల్లేపల్లి మండలకేంద్రంలోని సాగర్‌రోడ్డులో నివాసముంటున్న రమావత్‌ హతీరాం, పద్మ దంపతుల కుమారుడు జగన్‌కు ఏడాదిన్నర క్రితం దామచర్ల గ్రామానికి చెందిన అంజలి(19)తో వివాహమైంది. జగన్‌, అంజలి దంపతులకు నాలుగు నెలల ఆడ శిశువు ఉంది. బుధవారం శిశువును ఆడపడుచుకు ఇచ్చి తన గదికి వెళ్లిన అంజలి ఎంతకీ బయటికి రాలేదు. దీంతో ఆమె గదికి వెళ్లి చూసిన అత్తకు అంజలి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉండడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురువారం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తన కుమార్తె అనారోగ్య సమస్యలతోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు అంజలి తల్లి దస్లీ పోలీసులకు లిఖిత పూర్వకంగా పేర్కొంది.

మనస్థితి సరిగా లేక...

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన గోపాలకృష్ణ(22) బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గోపాలకృష్ణ మానసిక స్ధితి సక్రమంగా లేకపోవడంతో అతని తల్లి రామ్మ అనేకసార్లు ఆస్పత్రుల్లో చూపించింది. అయినా అతని పరిస్ధితి తగ్గలేదు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ నెల 20వ తేదీ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Updated Date - 2023-09-22T00:19:58+05:30 IST