Gangrape: బాలికపై ముగ్గురి గ్యాంగ్‌రేప్?
ABN , First Publish Date - 2023-01-18T03:31:50+05:30 IST
బంధువులే కదా అని నమ్మి.. ముగ్గురు యువకులతో కలిసి వారి వస్త్రదుకాణానికి వెళ్లిన బాలిక అక్కడ తీవ్ర రక్తస్రావానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లింది! ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది.
తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి
ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి
నల్లగొండ జిల్లా అంగడిపేటలో దారుణం
దేవరకొండ/పెద్దఅడిశర్లపల్లి, జనవరి 17: బంధువులే కదా అని నమ్మి.. ముగ్గురు యువకులతో కలిసి వారి వస్త్రదుకాణానికి వెళ్లిన బాలిక అక్కడ తీవ్ర రక్తస్రావానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లింది! ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది. ఆ ముగ్గురు యువకులూ తమ కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలో మంగళవారం జరిగిందీ విషాదం. బాలిక తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాకు చెందిన దంపతులు హైదరాబాద్‌లో తాపీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె(14) హైదరాబాద్‌లోనే ఓ ప్రైవేట్ స్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. పాఠశాలకు సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో.. బాలిక నల్లగొండ జిల్లాలోని తన అమ్మమ్మ ఊరికి వచ్చింది. అదే ఊరికి చెందిన దిలీప్, శివ, నరేశ్ అనే యువకులు చదువు మానేసి పెద్ద అడిశర్లమండలంలోని అంగడిపేట క్రాస్‌రోడ్‌లో ‘రౌడీబాయ్స్’ పేరిట వస్త్రదుకాణం నిర్వహిస్తున్నారు. సెలవులు ముగియడంతో ఆ బాలిక మంగళవారం హైదరాబాద్ బయల్దేరింది. అంగడిపేట క్రాస్‌రోడ్డుకు ఆటోలో వెళ్లి అక్కడ హైదరాబాద్ బస్సు ఎక్కాల్సి ఉండటంతో అమ్మమ్మతో కలిసి ఆ బాలిక ఆటో కోసం ఎదురుచూస్తోంది.

అదే సమయంలో వారి బంధువులైన శివ, నరేశ్ కారులో అటువైపు రాగా.. బాలికను అంగడిపేట క్రాస్‌రోడ్డు వద్ద దించాలని అమ్మమ్మ వారిని కోరింది. ఈ మేరకు బాలికను తీసుకెళ్లిన యువకులు ఆమెను క్రాస్‌రోడ్డు వద్ద దింపేసి తమ దుకాణానికి వెళ్లారు. బస్టాప్ వద్ద నిలబడిన బాలికకు తండ్రి ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఫోన్ చేయగా బస్సు కోసం చూస్తున్నానని చెప్పింది. కాసేపటికి ఆ బాలిక వద్దకు మళ్లీ వచ్చిన ఆ యువకులు మాయమాటలు చెప్పి వస్త్ర దుకాణంలోకి తీసుకెళ్లారు. ఒక గంట తర్వాత.. బాలిక తీవ్ర రక్తస్రావానికి గురికావడంతో వారు భయపడి ఓ ఆర్‌ఎంపీని తీసుకొచ్చి చూపించారు. బాలికను వెంటనే దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించాలని ఆర్‌ఎంపీ సూచించారు. దిలీప్, శివ బాలికను కారులో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మరణించిందని వైద్యులు నిర్ధారించారు. యువకులు అక్కణ్నుంచి కారులో పారిపోయే క్రమంలో ఆస్పత్రి ఆవరణలోని బైక్‌ను ఢీకొట్టారు. అక్కడున్నవారు దిలీప్, శివను పోలీసులకు అప్పగించారు. నరేశ్ కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.

అత్యాచారం చేసి చంపేశారు
తన కుమార్తెను నరేష్, దిలీప్, శివ అత్యాచారం చేసి చంపేశారని బాలిక తండ్రి ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బంధువులతో కలిసి జడ్చర్ల-కోదాడ జాతీయ రహదారిపై దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని వారితో మాట్లాడి.. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.