‘డబుల్‌’ ఇళ్ల కేటాయింపులో ఎన్నో వింతలు

ABN , First Publish Date - 2023-03-31T00:13:15+05:30 IST

భువనగిరి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కేటాయింపులో అర్హుల జాబితాలోనే ఎస్టీలందరికీ రెండు పడకల ఇళ్లు లభించగా మృతి చెందిన మాజీ సైనికుల భార్యలకు రిజర్వ్‌ చేసిన ఇళ్లకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం.

 ‘డబుల్‌’ ఇళ్ల కేటాయింపులో ఎన్నో వింతలు
రహదారిపై వంట చేస్తూ నిరసన తెలుపుతున్న దరఖాస్తుదారుడు లింగం

అర్హుల జాబితాలోని ఎస్టీలందరికీ దక్కిన ఇళ్లు

మాజీ సైనికుల కోటాలో లేని అర్హులు

444 ఇళ్లకు గాను 417 ఇళ్ల కేటాయింపునకే డ్రా

భువనగిరి టౌన్‌, మార్చి 30: భువనగిరి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కేటాయింపులో అర్హుల జాబితాలోనే ఎస్టీలందరికీ రెండు పడకల ఇళ్లు లభించగా మృతి చెందిన మాజీ సైనికుల భార్యలకు రిజర్వ్‌ చేసిన ఇళ్లకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం. అలాగే 444 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు అధికారులు దరఖాస్తులు స్వీకరించినప్పటికీ 417 ఇళ్లను మాత్రమే డ్రా విధానంలో కేటాయించి మిగతా 27ఇళ్లను ఇతర అవసరాల కోసం రిజర్వ్‌ చేశారు. అయితే అనర్హులకే ఇళ్లు దక్కాయని పేర్కొంటూ నిరసనలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. రిజర్వేషన్‌ కేటగిరిలో టౌన్‌ యూనిట్‌గా, జనరల్‌ కేటగిరిలో మాత్రం మునిసిపల్‌ వార్డు యూనిట్‌గా డ్రాలు నిర్వహించారు. దీంతో పట్టణంలోని 35 వార్డులకు సమన్యాయం జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు.

దరఖాస్తులు, కేటాయింపులు ఇలా..

పట్టణంలోని సింగన్నగూడెంలో నిర్మించిన 444 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కోసం 4315 మంది దరఖాస్తు చేసుకున్నారు. పలు వడపోతల అనంతరం 1950 మందిని అర్హులుగా గుర్తించి బుధవారం డ్రా విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. కానీ 444 ఇళ్లకు గాను 417కు మాత్రమే డ్రా నిర్వహించగా మిగతా 27 ఇళ్లను అనాఽథ పిల్లలకు, ప్రత్యేక పరిస్థితుల్లో కేటాయింపుల కోసం రిజర్వ్‌ చేశారు. అయితే ఇళ్ల కేటాయింపులో ఎస్టీలకు ఆరు శాతం (27ఇళ్లు) కేటాయించగా అర్హుల జాబితాలో కేవలం 25 మంది మాత్రమే ఉండడంతో డ్రా నిర్వహించకుండానే ఇళ్లను కేటాయించారు. అలాగే మృతి చెందిన సైనికుల భార్యల కోసం 2 శాతం (9ఇళ్లు) కేటాయించగా ఏ ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఎస్సీలకు 17శాతం (75ఇళ్లు) కేటాయించగా అర్హుల జాబితాలో 342 మంది, మైనార్టీలకు 12శాతం (53ఇళ్లు) గాను 479 మంది, వికలాంగులకు 5శాతం (22ఇళ్లు) 80 మంది, ఇతరులకు 58శాతం (258 ఇళ్లు) 1104 మంది అర్హుల జాబితా ఆధారంగా డ్రా నిర్వహించారు. టౌన్‌ యూనిట్‌గా రిజర్వేషన్‌ కేటగిరి డ్రాలు నిర్వహించగా ఇతరుల విభాగంలో మాత్రం వార్డుకు 7 ఇళ్లను కేటాయించి, 35 వార్డుల ఇతరుల కేటగిరి అర్హుల జాబితాల ఆధారంగా డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. రిజర్వ్‌ కేటగిరిలో ఉంచిన 27 ఇళ్లను ప్రమాదవశాత్తు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన భువనగిరి పట్టణంలోని చిన్నారులకు, ప్రత్యేక పరిస్థితుల్లో పేదలకు కేటాయించనున్నట్లు, ఈ ప్రక్రియ కూడా త్వరలో పూర్తి చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

నిరసనల పర్వం..

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కేటాయింపుపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. డ్రాను పారదర్శకంగా నిర్వహించినప్పటికీ తుది జాబితా రూపొందించడంలో జరిగిన అవకతవకలతో అనర్హులకు ఇళ్లు దక్కి అర్హులకు అన్యాయం జరిగిందని పలువురు పేర్కొంటున్నారు. కుటుంబ సభ్యుల పేరిట అద్దె రూపంలో ఆదాయం సమకూర్చే సొంత ఇళ్లు, వ్యవసాయ భూములు, భువనగిరితో పాటు ఇతర ప్రాంతాల్లో ఖాళీ ప్లాట్లు ఉన్నవారికి ఇళ్లు దక్కాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వేల పేరిట తుది జాబితాలను రూపొందించడంలో అధికారుల వైఫల్యంతోనే ఈ స్థితి నెలకొన్నదని, అలాగే కొద్ది మంది కౌన్సిలర్లు అధికారుల బృందాలను ప్రభావితం చేయడంతో అనర్హులు తుది జాబితాలో చేరారని ఆరోపణలు వస్తున్నాయి. మునిసిపల్‌ పాలక పక్షానికి చెందిన ఓ కౌన్సిలర్‌ వార్డులో 140 దరఖాస్తులు రాగా ఏకంగా 100 మంది అర్హుల జాబితాలో ఉండడమే తుది జాబితా రూపకల్పనలో జరిగిన అవకతవకలకు ఉదాహరణ అని పలువురు వాపోతున్నారు. ఈ మేరకు స్థానిక 13వ వార్డుకు చెందిన తాపీ మేస్ర్తీ కుశంగుల లింగం అద్దెకు ఉంటున్న ఇంటి ఎదుట రహదారిపై వంట చేసుకుంటూ నిరసన తెలిపాడు.

నాకు అన్యాయం జరిగింది

15 ఏళ్ల క్రితం నా భర్త మృతి చెందాడు. నా ఏకైక కుమారుడు ప్రైవేట్‌ కంపెనీలో రూ.8వేల వేతనంతో పని చేస్తున్నాడు. నేను రైతు బజార్‌ రహదారిపై ఆకు కూరలు అమ్ముకుంటూ నెలకు రూ.2500 అద్దె చెల్లిస్తూ అద్దె ఇంట్లో ఉంటున్నాను. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు లభిస్తే నా కష్టాలు తీరుతాయని ఆశించాను. కానీ ఆస్తులు ఉన్నవారే తుది జాబితాలో ఉండడంతో డ్రా కూడా వారికే అనుకూలించి నాలాంటి అభాగ్యులకు అన్యాయం జరిగింది.

-నాగు వసంత, 28వ వార్డు, భువనగిరి

అనర్హులని తేలితే ఇళ్లను స్వాధీనం చేసుకుంటాం

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల లబ్ధిదారుల్లో అనర్హులు ఉన్నట్లు తేలితే వారికి కేటాయించిన ఇళ్లను తిరిగి స్వాధీనం చేసుకుని, అర్హులకు కేటాయిస్తాం. ఈ మేరకు అనర్హుల లబ్ధిదారుల వివరాలను సాక్ష్యాధారాలతో ఎవరైనా ఫిర్యాదులు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. వచ్చిన ఫిర్యాదులపై సమగ్రంగా విచారణ జరుపుతాం. ఈ మేరకు పట్టణ ప్రజలు స్పందించాలి.

-పమేలా సత్పథి, కలెక్టర్‌

Updated Date - 2023-03-31T00:13:23+05:30 IST