Share News

తొలి రోజు స్పందన అంతంతే

ABN , Publish Date - Dec 29 , 2023 | 12:23 AM

రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజాపాలన’ పేరుతో అభయహస్తం ఆరు గ్యారంటీలకు గురువారం నుంచి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గురువారం నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభయహస్తంలో భాగంగా గృహజ్యోతి, యువవికాసం, రైతుభరోసా, చేయూత, ఇందిరమ్మఇళ్ల పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే పల్లెల్లో తొలి రోజు అంత స్పందన కనిపించలేదు. పట్టణాల్లో మాత్రం దరఖాస్తు కేంద్రాల వద్ద సందడి కనిపించింది. కాగా, జిల్లా వ్యాప్తంగా తొలిరోజు 23,593 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు.

తొలి రోజు స్పందన అంతంతే
నల్లగొండ డైట్‌ పాఠశాల వద్ద ఏర్పాటుచేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న నోడల్‌ అధికారి, రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌

అభయహస్తం దరఖాస్తు కేంద్రాల వద్ద పల్లెల్లో కన్పించని ప్రజలు

పట్టణాల్లో పరిస్థితి కాస్త మెరుగు

కుటుంబాలు పెరగడంతో సరిపోని దరఖాస్తులు

అర్హుల ఎంపికకు మార్గదర్శకాలు కరువు

జిల్లా వ్యాప్తంగా 23,593 దరఖాస్తులు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ)

రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజాపాలన’ పేరుతో అభయహస్తం ఆరు గ్యారంటీలకు గురువారం నుంచి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గురువారం నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభయహస్తంలో భాగంగా గృహజ్యోతి, యువవికాసం, రైతుభరోసా, చేయూత, ఇందిరమ్మఇళ్ల పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే పల్లెల్లో తొలి రోజు అంత స్పందన కనిపించలేదు. పట్టణాల్లో మాత్రం దరఖాస్తు కేంద్రాల వద్ద సందడి కనిపించింది. కాగా, జిల్లా వ్యాప్తంగా తొలిరోజు 23,593 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు.

‘ప్రజాపాలన’లో భాగంగా ఇంటికో దరఖాస్తు చొప్పున అధికారులు దరఖాస్తులు తీసుకొని గ్రామాల్లోకి వెళ్లారు. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం ఇళ్ల సంఖ్యను పరిగణలోకి తీసుకోవడంతో పల్లెల్లో దరఖాస్తుల కొరత కనిపించింది. 2011 నుంచి పలు కొత్త కుటుంబాలు వచ్చాయి. ఫలితంగా దరఖాస్తు అందని వారు కలర్‌ జీరాక్స్‌ తీసుకుని నింపి ఇచ్చారు. పట్టణాల్లో ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబానికో దరఖాస్తు చొప్పున పంపిణీ చేయగా పట్టణాల్లో దరఖాస్తులు మిగిలాయి. గ్రామసభ తేదీల్లోనే గాక పని దినాల్లో ఎప్పుడైనా దరఖాస్తులు తీసుకుంటామని, వాటిని పంచాయతీ కార్యాలయాల్లో అందజేయవచ్చని, జనవరి 6 తరువాత మరికొద్ది రోజుల పాటు దరఖాస్తులు తీసుకుంటామని మంత్రులు ప్రచారం చేయడంతో ఎక్కడా తొక్కిసలాట, కిక్కిరిసిన పరిస్థితులు కనిపించలేదు. పల్లె ప్రజలు పనుల్లోకి వెళ్లడంతో తొలి రోజు ప్రశాంతంగా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ముగిసింది. నార్కట్‌పల్లి మండలం గోపాలయపల్లి గ్రామంలో కార్యక్రమాన్ని పరిశీలించేందుకు వెళ్లిన ఓ అధికారికి దరఖాస్తులు స్వీకరించే సిబ్బంది ఖాళీగా కనిపించడంతో విస్తుపోయారు. కారణాలు ఏంటా అని ఆరా తీస్తే గ్రామస్థుల్లో అత్యధికం ఉదయాన్నే పనుల్లోకి వెళ్లారని, సాయంత్రం ఆరు గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అధికారులు ప్రచారం చేయడంతో ప్రజల నుంచి తొలి రోజు అంతగా స్పందన కనిపించలేదని, దీంతో ఉద్యోగులు ఖాళీగా కూర్చోవాల్సి వచ్చిందని తేలింది. అదే పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల వద్ద ఉండే మహిళల శాతం అధికంగా ఉండటంతో మునిసిపాలిటీల్లో దరఖాస్తుదారుల సందడి కనిపించింది. జిల్లా వాసులైనప్పటికీ ఉపాధి కోసం హైదరాబాద్‌ వంటి పట్టణాల్లో స్థిరపడ్డ వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారు నేరుగా రావాల్సిన అవసరం లేదని, దరఖాస్తుతో పాటు ఆధార్‌, రేషన్‌కార్డు జీరాక్స్‌, ఇతర ధ్రువీకరణ పత్రాలు జత చేసి తెలిసిన వారి ద్వారా పంపిన తీసుకుంటామని అధికారులు ప్రచారం చేయడంతో వలస జీవులు పల్లెలకు తీరిగి రావాల్సిన అవసరం ఏర్పడలేదు.

అర్హుల ఎంపికకు మార్గదర్శకాలు కరువు

కుటుంబానికి, ఆరు గ్యారంటీలకు ఒకే దరఖాస్తు, సులువుగా నమోదు చేసేలా దరఖాస్తు ఉన్నా, అర్హులు ఎవరనేది ప్రభుత్వం ఎక్కడా అధికారికంగా స్పష్టం చేలేదు. దీంతో దరఖాస్తుదారుల్లో అయోమయం నెలకొంది. తెల్లరేషన్‌కార్డు కలిగిన వారు అర్హులుగా తీసుకుంటే, పదేళ్లుగా కొత్త రేషన్‌కార్డులు మంజూరు కాలేదు. పాత రేషన్‌కార్డులు మంజూరైన తరువాత రెండు తరాలు కుటుంబాలుగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డాయి. రేషన్‌కార్డు లేకపోవడంతో పథకాలు ఎలా అందజేస్తారో అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేశారు. కొత్త రేషన్‌కార్డు కావాలనుకునే వారు తెల్లకాగితంపై రాసి ఇస్తే సరిపోతుందని అధికారులు తెలపడంతో పలుచోట్ల పలువురు కొత్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. గృహ రుణం, కారు రుణం తీసుకోవాలంటే ఇన్‌కంట్యాక్స్‌ ఫైల్‌ చేసినవారై ఉండాలనేది బ్యాంకు నిబంధన. దీంతో చాలా మంది ఇన్‌కంట్యాక్స్‌ ఫైల్‌ చేసినవారు ఉన్నారు. అంతేగాక ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరు నూతన పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చా? లేదా? అనేది ఎక్కడా స్పష్టం చేయకపోవడంతో పలువురు సందేహంతో దరఖాస్తు చేసుకోలేదు. రైతుబంధు పథకం ఇప్పటికే అందుతోంది. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా? దీనికి ఉద్యోగులు, ఆదాయపన్ను చెల్లించే వారు అర్హులా? కాదా? అనే సందేహాలు ఉన్నాయి. నెలకు రూ.15వేల వేతనానికి ప్రైవేట్‌ కంపెనీలో పనిచేసినా ఏడాదికి రూ.1.50లక్షల వార్షిక ఆదాయం దాటుతుంది. అలాంటి వారు ఆరు గ్యారంటీలకు అర్హులు కారు. సరైన మార్గదర్శకాలు లేకుండా దరఖాస్తు చేసుకోమని ప్రభుత్వం చెప్పడంతో అందరికలో ఆశలు చిగురిస్తున్నాయని ఓ జిల్లాస్థాయి అధికారి అభిప్రాయపడ్డారు. ఆరు గ్యారంటీల కారణంగా జీరాక్స్‌ దుకాణాలకు గిరాకీ పెరిగింది. వీటితో పాటు ఆధార్‌, మీ-సేవా కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. ఆరు గ్యారంటీలకు ఆధార్‌కార్డు తప్పనిసరి కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. తొలిరోజు ‘ప్రజాపాలన’ కార్యక్రమాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లా నోడల్‌ అధికారిగా ఆర్‌వీ.కర్ణన్‌ పర్యవేక్షించారు. అదేవిధంగా అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌ నల్లగొండ మునిసిపాలిటీతోపాటు తిప్పర్తి మండలంలో పర్యటించారు. ఇదిలా ఉండగా, అభయహస్తం ప్రారంభించిన తొలి రోజు గురువారం 118 గ్రామపంచాయతీల్లో అధికారులు ‘ప్రజాపాలన’ కార్యక్రమాన్ని నిర్వహించగా, వాటి పరిధిలో 46,428 ఇళ్లు ఉండగా, 23,593 దరఖాస్తులు వచ్చాయి.

‘ప్రజాపాలన’ను సద్వినియోగం చేసుకోవాలి

ఉమ్మడి జిల్లా నోడల్‌ అధికారి, ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌

నల్లగొండ టౌన్‌: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ‘ప్రజాపాలన’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా నోడల్‌ అధికారి, ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌ అన్నారు. గురువారం ‘ప్రజాపాలన’ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పానగల్‌ 1వ వార్డు, డైట్‌ కళాశాలలో 5వ వార్డు, 21వ వార్డులకు సంబంధించిన అభయహస్తం పథకాల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దరఖాస్తుదారులకు అధికారులు విధిగా సమగ్ర వివరాలు చదివి వినిపించి ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని పూరించాలన్నారు. మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పట్టణంలోని 48 వార్డులకు బృందాలు ఏర్పాటు చేశామని, మరో 10 బృందాలు ప్రత్యేకంగా అన్ని వార్డుల్లో పర్యటిస్తాయని వివరించారు. అదేవిధంగా మునిసిపల్‌ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేకంగా కౌంటర్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

తిప్పర్తి: ‘ప్రజాపాలన’ కార్యక్రమాన్ని గురువారం మండల పరిధిలోని రాయినిగూడెం గ్రామంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, ఎస్పీ అపూర్వరావు పరిశీలించారు. వారి వెంట సీఐ రాఘవరావు, తహసీల్దార్‌ పద్మ, డీఈ నాగయ్య, ఎంపీడీవో పి.మహేందర్‌రెడ్డి, ఎస్‌ఐ ఎన్‌.ధర్మ, ఎంపీవో లక్ష్మీనరసింహస్వామి, ఏవో సన్నిరాజు ఉన్నారు.

Updated Date - Dec 29 , 2023 | 12:23 AM