విలీన వీఆర్ ఏల ఇక్కట్లు
ABN , Publish Date - Dec 22 , 2023 | 12:07 AM
ఉద్యోగులుగా గుర్తించినా వేతనాలు రా క విలీన గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ) ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త ప్రభుత్వమైనా తమ సమస్యలు తీరుస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.
నాలుగు నెలలుగా అందని వేతనాలు
కొత్త ప్రభుత్వంపైనే ఆశలు
అడ్డగూడూరు: ఉద్యోగులుగా గుర్తించినా వేతనాలు రా క విలీన గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ) ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త ప్రభుత్వమైనా తమ సమస్యలు తీరుస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. గ్రామ రెవెన్యూ సహాయకులను ఉద్యోగులుగా క్రమబద్ధీకరించి వారిని వివిధ శాఖల్లో విలీ నం చేశారు. కాగా, నాటి నుంచి నాలుగు నెలలుగా వారికి వేతనాలు రావడం లేదు.
దశాబ్దాలుగా గ్రామాల్లో పని చేసిన గ్రామ సేవకులను ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహాయకులుగా గుర్తించింది. ఈ వ్యవస్థను బీఆర్‌ఎస్ ప్రభుత్వం రద్దు చేసి వీరిని ఉద్యోగులుగా గుర్తిస్తూ క్రమబద్ధీకరించింది. అనంతరం వీరికి పలు శాఖల్లో విధులు కేటాయిస్తూ గత ఏడాది జూలై 24న ప్రభుత్వం జీవో విడుదల చేసింది. వీఆర్‌ఏలు వారికి కేటాయించిన శాఖల్లో చేరాలని ఆగస్టు 10న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగ భద్రత కోసం ఏళ్లుగా వేచి చూస్తున్న రెవెన్యూ సహాయకులు వారికి కేటాయించిన శాఖల్లో చేరారు. జిల్లాలో 611 మంది ఇలా విధుల్లో చేరారు. అర్హతలను బట్టి వారిని వివిధ శాఖల్లో జూనియర్ సహాయకులు, వార్డు ఆఫీసర్లు, ఇతర హోదాల్లో నియమించారు. కానీ, నాలుగు నెలలుగా వీరికి వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని శాఖల్లో చేరిన వారికి ఇప్పటికీ జాయినింగ్ ఆర్డర్ ఇవ్వలేదు. విధుల నిర్వహణలో భాగంగా ఇతర ప్రాంతాల్లో ఉండాల్సి రావడంతో ఇంటి అద్దె, పిల్లల పాఠశాలల ఫీజులు, నిత్యావసరాలు, రుణాల చెల్లింపు, ఆస్పత్రుల ఖర్చులకు డబ్బు లేక అప్పు చేసి కుటుంబాన్ని వెళ్లదీస్తున్నారు. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని వారు వేడుకుంటున్నారు.
రోజువారీ ఖర్చులకు ఇబ్బందులు : చిత్తాలూరి స్వామి, వీఆర్‌ఏల సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి
వీఆర్‌ఏలకు నాలుగు నెలలుగా వేతనాలు రాకపోవడంతో రోజు వారీ ఖర్చులకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయానికి వెళ్లేందుకు పెట్రోలకు డబ్బు కూడా లేని పరిస్థితి. నిత్యావసర సరుకులు తెచ్చుకునేందుకు కూడా ఇబ్బందిగా ఉంది. దీంతో అప్పు చేస్తున్నాం. అధికారులు స్పందించి ఎప్పటికప్పుడు వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలి.
అప్పుల పాలవుతున్నాం : దాసరి వీరన్న, వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు
అడ్డగూడూరు తహసీల్దారు కార్యాలయంలో వీఆర్‌ఏగా పనిచేస్తుండ గా, గత ప్రభుత్వం గత మోత్కూరు తహసీల్దారు కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా సర్దుబాటు చేసింది. నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో నిత్యావసర సరుకులకు డబ్బు లేదు. దీంతో అప్పుల పాలవుతున్నాం. ఉన్నతాధికారులు స్పందించి ప్రతీ నెల వేతనాలు అందించాలి.