Share News

ఎన్డీయే హయాంలోనే దేశం అభివృద్ధి

ABN , Publish Date - Dec 30 , 2023 | 12:19 AM

ఎన్డీయే హయాంలోనే దేశం ప్రణాళికా బద్దంగా అభివృద్ధి పథంలోకి దూసుకుపోతోందని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు తెలిపారు.

ఎన్డీయే హయాంలోనే దేశం అభివృద్ధి

బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు

‘విజన్‌ భువనగిరి పార్లమెంట్‌’ చర్చా కార్యక్రమం

యాదాద్రి, డిసెంబరు29(ఆంధ్రజ్యోతి): ఎన్డీయే హయాంలోనే దేశం ప్రణాళికా బద్దంగా అభివృద్ధి పథంలోకి దూసుకుపోతోందని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు తెలిపారు. శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో భువనగిరిలో ప్రజాసంఘాలతో ‘విజన్‌ భువనగిరి పార్లమెంట్‌-ఆలోచనలు పంచుకుందాం... అభివృద్ధికై మాట్లాడుకుందాం’ అన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని పలు సమస్యలతో పాటు అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై వక్తలు అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లోనూ ఎంతో అభివృద్ధిని సాధించిందన్నారు. ఎన్డీయే హయాంలోనే రూ.60వేల కోట్లతో జాతీయ రహదారులను విస్తరించామని, నూతనంగా మరిన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. నూతన విద్యావిధానంలో భాగంగా అన్ని విభాగాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తుందన్నారు. భువనగిరి రానున్న రోజుల్లో అభివృద్ధి చెందుతుందని, నగరానికి చేరువలో ఉన్నందున ఐటీతోపాటు చాలా ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉందన్నారు. భువనగిరి ఎంపీగా బీజేపీ అభ్యర్థిని గెలిపించి, మరోసారి మోదీ ప్రధానిగా చేయాలన్నారు.

70 ఏళ్లుగా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు : పీవీ శ్యాంసుందర్‌రావు

మూసీ నది ప్రక్షాళనపై 70ఏళ్లుగా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌రావు అన్నారు. నగరంలోని వ్యర్థాలు ఈ ప్రాంతంలోకి రావడంతో పంటలు పండించలేక, సాగు, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పార్మాకంపెనీల కాలుష్యంతో స్థానికులు రోగాల బారిన పడుతున్నారని, ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను మార్చాలన్నారు. ఈ ప్రాంతానికి గోదావరి జలాలతోనే విముక్తి కలుగుతుందని, అందుకోసం ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. భూదాన్‌పోచంపల్లి ప్రపంచ పర్యాట కేంద్రంగా పేరొందిందని, చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం పనిచేసే వ్యక్తినే ఎంపీగా ఎన్నుకోవాలని సూచించారు.

Updated Date - Dec 30 , 2023 | 12:19 AM