సహకార రైతులకు ‘తెలంగాణ దశాబ్ది డిపాజిట్‌’ పథకం

ABN , First Publish Date - 2023-06-02T23:44:06+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సహకార రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు తెలంగాణ దశాబ్ది డిపాజిట్‌ పథకాన్ని ప్రారంభించినట్లు డీసీసీబీ చైర్మన గొంగిడి మహేందర్‌రెడ్డి తెలిపారు.

 సహకార రైతులకు ‘తెలంగాణ దశాబ్ది డిపాజిట్‌’ పథకం
కరపత్రం ఆవిష్కరిస్తున్న డీసీసీబీ చైర్మన మహేందర్‌రెడ్డి, అధికారులు

డీసీసీబీ చైర్మన గొంగిడి మహేందర్‌రెడ్డి

నల్లగొండ, జూన 2: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సహకార రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు తెలంగాణ దశాబ్ది డిపాజిట్‌ పథకాన్ని ప్రారంభించినట్లు డీసీసీబీ చైర్మన గొంగిడి మహేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో డిపాజిట్‌ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి, కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది డిపాజిట్‌ పథకానికి మూడేళ్లకు 7.75శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు తెలిపారు. రూ.10లక్షలు ఆపైన డిపాజిట్లపై అదనంగా 0.25శాతం వడ్డీ, రూ.20లక్షలు ఆపైన డిపాజిట్లపై అదనంగా 0.50శాతం వడ్డీ చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ పథకానికి ఈ నెల 22వ తేదీ వరకు వర్తింపజేయడం జరుగుతుందని, రైతులు, ఖాతాదారులు ఈ డిపాజిట్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ప్రయోజనం పొందాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైన సందర్భంగా ఈ పథకాన్ని ప్రత్యేకంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రారంభించామన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దశాబ్ది ఉత్సవాలను ఈ నెల 22వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు వివరించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతు వేదికల వద్ద నిర్వహించే కార్యక్రమాల్లో 600 నుంచి 1000 మంది రైతులు పాల్గొనేలా చేసి ప్రభుత్వ పథకాలను వారికి వివరించాలని పండుగ వాతావరణంలో ఈ ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ సీఈవో కె. మధనమోహన, జీఎం వసంతరావు, డీజీఎం అశోక్‌, ఏజీఎం ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T23:44:06+05:30 IST