స్నానానికి చన్నీళ్లే దిక్కు
ABN , Publish Date - Dec 18 , 2023 | 12:35 AM
పేద విద్యార్థులకు అన్ని సదుపాయాలతో విద్య అందించేందుకు ఏర్పాటు చేసిన కస్తూర్బా పాఠశాలతో పాటు ఆద ర్శ పాఠశాలల్లో విద్యార్థులు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆదర్శ పాఠశాలలో పని చేయని సోలార్ హీటర్లు
ధ్వంసమైన సోలార్ పలకలు
గుండాల: పేద విద్యార్థులకు అన్ని సదుపాయాలతో విద్య అందించేందుకు ఏర్పాటు చేసిన కస్తూర్బా పాఠశాలతో పాటు ఆద ర్శ పాఠశాలల్లో విద్యార్థులు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు స్నానాల కోసం ఏర్పాటు చేసిన సోలార్ హీటర్లు ఏళ్ల తరబడి పని చేయడం లేదు. సోలార్ పలకలు ధ్వంసమై సోలార్ హీటర్లు పని చేయకపోవడంతో స్నానానికి చల్లటి నీళ్లే దిక్కయ్యాయి. మరమ్మతులు చేపట్టాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
గుండాల మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో 171 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. ఆదర్శ పాఠశాలలో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు 100మంది చదువుతున్నారు. కస్తూర్బా పాఠశాలలో ఐదేళ్ల క్రితం సుమారు 1,000 లీటర్ల సామర్ధ్యం ఉన్న సోలార్ హీటర్లు అమర్చారు. ఆదర్శ పాఠశాలలో సుమారు 500 లీటర్ల సామర్ధ్యం ఉన్న సోలార్ హీటర్లను అమర్చారు. కస్తూర్బా పాఠశాలలో మూడేళ్ల క్రితం సోలార్ పలకలు ధ్వంసమయ్యాయి. దీంతో అవి పని చేయకపోవడంతో గత ఏడాది ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వార్తకు స్పందించి అధికారులు సోలార్ పలకలకు మర్మతులు చేయించారు. ఈ ఏడాది చలి కాలం మొదలైనప్పటి నుంచి సోలార్ హీటర్లకు విద్యుత్ షాక్ వస్తుండడంతో మళ్లీ వాటిని వాడకుండా నిలిపివేశారు. దీంతో విద్యార్థులకు ఎప్పటి లాగానే స్నానానికి చల్లటి నీరే దిక్కయింది. ఆదర్శ పాఠశాలలో సోలార్ హీటర్లు ఐదేళ్ల క్రితం బిగించగా, అవి నాసిరకంగా ఉండటంతో మూడు నెలలకే గాలి దుమారానికి పలకలు కింద పడి ధ్వంసమయ్యాయి. అప్పటి నుంచి ఏళ్లు గడుస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. పరీక్షలు దగ్గరపడుతున్న నేపథ్యంలో చల్లటి నీటితో స్నానం చేయలేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సోలార్ హీటర్లకు మరమ్మతులు చేయించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
చలికి ఇబ్బందులు పడుతున్నాం : గన్న మాధురి, ఇంటర్ విద్యార్థిని
పాఠశాలలో వేడి నీరు రాకపోవడంతో నిత్యం చల్లటి నీళ్లతో స్నానం చేసేందుకు ఇబ్బందులు పడుతున్నాం. చలి తీవ్రంగా ఉండడంతో చల్లటి నీళ్లతో స్నానం చేస్తే జలుబు, జ్వరంతో తరచూ బాధపడుతున్నాం. వేడి నీరు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
త్వరగా మరమ్మతులు చేయించాలి : నిలుగొండ భార్గవి, ఇంటర్ విద్యార్థిని
పాఠశాలలో వేడి నీరు రాకపోవడం తో చల్లటి నీళ్లతోనే స్నానాలు చేస్తున్నాం. టీచర్లను అడిగితే సోలార్ హీటర్ పలకలు ధ్వంసమయ్యాయని, హీటర్లు పని చేయడం లేదంటున్నారు. ప్రస్తుతం చలి తీవ్రంగా ఉంది. చల్లటి నీళ్లతో స్నానం చేయలేక వణికిపోతున్నాం. అధికారులు పట్టించుకుని సోలార్ హీటర్లకు త్వరగా మరమ్మతు చేయించాలి.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం : విజయలక్ష్మి, ప్రత్యేక అధికారి
కస్తూర్బా పాఠశాలలో సోలార్ పలకలు ధ్వంసమవడంతో గత ఏడాది మరమ్మతు చేయించాం. గత వారం నుంచి విద్యుత్ షాక్ వస్తుండడంతో హీటర్‌ను వాడకుండా నిలిపివేశాం. ఆదర్శ పాఠశాల హాస్టల్‌కు ఇటీవలే నాకు చార్జ్ ఇచ్చారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తాం.