‘కూలి’న బతుకులు

ABN , First Publish Date - 2023-03-25T23:44:27+05:30 IST

వారు కష్టజీవులు.. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. ఏ పూటకాపూట కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు.

‘కూలి’న బతుకులు
ట్రాక్టర్‌ను ఢీ కొన్నలారీ

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ

ఇద్దరు మహిళా కూలీలు దుర్మరణం

హైదరాబాద్‌-విజయవాడ హైవేపై పనులు చేస్తుండగా ఘటన

మునగాల, మార్చి 25: వారు కష్టజీవులు.. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. ఏ పూటకాపూట కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. పొట్ట కూటి కోసం భోజనం సిద్ధం చేసుకొని పనికి బయలు దేరారు. ఇంతలోనే మృత్యురూపంలో గూడ్స్‌ లారీ వెంటాడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా కూలీలను మృత్యువు కబళించింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో మునగాల మండలంలోని హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై శనివారం జరిగింది. మునగాల సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ లోకేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి డివైడర్లపై ఉన్న చెత్తను కూలీలతో జీఎంఆర్‌ కాంట్రాక్టర్‌ తొలగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 10గంటల ప్రాంతంలో మునగాల మండలం ఆకుపాముల బైపాస్‌ చౌరస్తా సమీపం వద్ద 14మంది మహిళా కూలీలతో కాంట్రాక్టర్‌ చెత్తను ట్రాక్టర్‌లో వేయిస్తున్నాడు. అందుకోసం స్టాపర్స్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. కోదాడ వైపు ట్రాక్టర్‌ నెమ్మదిగా కదులుతుండగా, కూలీలు చెత్తను అందులో వేస్తున్నారు. ఈ క్రమంలో వెనక నుంచి హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్‌ లారీ అతివేగంగా వచ్చి ట్రాక్టర్‌ను ఢీకొట్టి దాదాపు 50మీటర్లు ఈడ్చుకెళ్లింది. అయితే లారీ ఢీకొనే సమయంలో డివైడర్‌పై నిలబడి చెత్తను ట్రాక్టర్‌లో వేస్తున్న ముగ్గురు మహిళా కూలీలపైకి ట్రాక్టర్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన నేలమర్రి వినోద(27) అక్కడికక్కడే మృతి చెందగా, అదే గ్రామానికి చెందిన తుమ్మల ధనమ్మ(54), చెవుల రోషమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని ఖమ్మం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ధనమ్మ మృతిచెందింది. రోషమ్మ పరిస్థితి విషమంగా ఉంది. ట్రాక్టర్‌ డ్రైవర్‌ దాస్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతదేహాలకు కోదాడ, ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రుల్లో పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. ఇదిలా ఉండగా ఘటనా స్థలంలో మిగతా కూలీలు దూరంగా ఉండటంతో క్షేమంగా బయటపడ్డారు. అదేవిధంగా ఘటన చోటుచేసుకోగానే లారీ డ్రైవర్‌ పరారయ్యాడు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

కన్నీరు మున్నీరైన రామాపురం

నడిగూడెం: మునగాల మండలం ఆకుపాముల గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన ఇద్దరు మహిళా కూలీలు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలు ముకున్నాయి. ప్రతి సీజన్‌లో 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై పిచ్చి చెట్లను తొలగిస్తుంటారు. నడిగూడెం మండల రామాపురం గ్రామం నుంచి 10నుంచి 15మంది మూడు బృందాలుగా కూలికి వెళ్తుంటారు. శనివారం కూలీకి వెళ్లిన వీరు రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు మృతిచెందారు. మరో మహిళ చికిత్స ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. గ్రామానికి చెందిన నేలమర్రి వినోద, ఆమె భర్త తిరప య్య వ్యసాయ కూలీగా జీవిస్తున్నారు. వినోద మృతితో ఆమె కుమారు డు నాలుగు సంవత్సరాలు ఉన్న అజయ్‌ను చూసి బంధువులు, కుటుంబ సభ్యు లు, గ్రామస్తులు కంటతడి పెట్టారు. ప్రమాదంలో మృతిచెందిన తుమ్మల ధనమ్మ భర్త కోటయ్య కూడా వ్యవసాయ కూలిగా పనిచేస్తాడు. వీరికి కుమా రుడు, కూతురు ఉండగా పెళ్లిళ్లు చేశారు. వినోద ప్రమాద స్థలంలోనే మృతి చెందగా, ధనమ్మ ఖమ్మం ఆస్పత్రి చికిత్సపొందుతూ మృతిచెందింది. వారి మృతదేహాల కోసం గ్రామస్థులు కోదాడ, ఖమ్మంకు వెళ్లి శవ పంచనామా చేయించారు. గాయపడిన రోషమ్మ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు.

కోదాడ రూరల్‌: మునగాల మండలం ఆకుపాముల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులను ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌ కోదాడ ఆసుపత్రిలో పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి తగిన ఆర్థిక సాయం అందేలా కృషిచేస్తానని తెలిపారు.

Updated Date - 2023-03-25T23:44:27+05:30 IST