యాదగిరిక్షేత్రంలో వైభవంగా నిత్యారాధనలు
ABN , First Publish Date - 2023-07-21T00:42:04+05:30 IST
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి గురువారం నిత్యవిధి కైంకర్యాలు వైభవంగా కొనసాగాయి. సుప్రభాతంతో స్వామివారిని మే ల్కొలిపిన అర్చకులు గర్భగుడిలో కొలువుదీరిన స్వయంభువులు, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులను వేదమంత్రోచ్ఛరణలతో అభిషేకించి, తులసీదళాలతో అర్చించారు.
యాదగిరిగుట్ట, జూలై 20: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి గురువారం నిత్యవిధి కైంకర్యాలు వైభవంగా కొనసాగాయి. సుప్రభాతంతో స్వామివారిని మే ల్కొలిపిన అర్చకులు గర్భగుడిలో కొలువుదీరిన స్వయంభువులు, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులను వేదమంత్రోచ్ఛరణలతో అభిషేకించి, తులసీదళాలతో అర్చించారు. ప్రధానాలయ ముఖమండపంలో స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్ది సుదర్శన హోమం నిర్వహించారు. అనంతరం గజవాహన సేవోత్సవం జరిపి విశ్వక్సేనుడికి తొలి పూజలతో నిత్యతిరుకల్యాణపర్వాలు నిర్వహించారు. సాయంత్రం ప్రధానాలయ ముఖమండపంలో దర్భారు సేవోత్సవం చేపట్టి, అలంకార వెండి జోడు సేవలు, సహస్రనామార్చనలు చేశారు. కొండపైన అనుబంధ శివాలయంలో రామలింగేశ్వరుడికి నిత్యారాధనలు, యాగశాలలో రుద్ర హవనం శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. ఆలయ ఖజానాకు రూ.9,80,740 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.
స్వామిసేవలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్
యాదగిరీశుడిని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్‌జైన్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. క్షేత్ర సందర్శన అనంతరం యాదాద్రి రైల్వేస్టేషన్‌ను పరిశీలించారు. రైల్వేస్టేషన్‌లో ప్రతీ రైలు ఆగే విధంగా చర్యలు తీసుకుం టున్నట్లు తెలిపారు. ఆయనవెంట డివిజనల్ మేనేజర్ ఏకే గుప్తా ఉన్నారు.
వైభవంగా లక్ష్మీనరసింహుడి కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహుడి క్షేత్రంలో స్వామివారి నిత్య కల్యాణం నిర్వహించారు. విశ్వక్ష్సేన పూజ, పుణ్యాహావాచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్వప్రాసన నిర్వహించారు. మాంగళ్యధారణ తలంబ్రాలతో నిత్య కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. నీరాజనమంత్రపుష్పాలతో మహానివేదన గావించి భక్తుల కు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు చెన్నూరి విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈవో సిరికొండనవీన్, ఆలయ అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, కృష్ణామాచార్యులు, రామాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, నరసింహమూర్తి, లక్ష్మీనరసింహమూర్తి, సీతారామశాస్ర్తి, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.