ఫలానా బంధువు.. ఫలానా అకౌంటెంట్
ABN , First Publish Date - 2023-03-19T00:11:41+05:30 IST
నాలుగు నెలలుగా అకౌంటెంట్ బంధువు యాదగిరిగుట్ట మునిసిపాలిటీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. కీలకమైన విభాగంలో అనామక వ్యక్తిని నిమించడం ఏమిటని ఇటు కౌన్సిలర్లు, అటు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

విధులు నిర్వహిస్తున్న ఇమ్రాన్
నాలుగు నెలలుగా బాధ్యతల నిర్వహణ
యాదగిరిగుట్ట రూరల్, మార్చి 18: నాలుగు నెలలుగా అకౌంటెంట్ బంధువు యాదగిరిగుట్ట మునిసిపాలిటీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. కీలకమైన విభాగంలో అనామక వ్యక్తిని నిమించడం ఏమిటని ఇటు కౌన్సిలర్లు, అటు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. యాదగిరిగుట్ట మునిసిపాలిటీలో అకౌంటెంట్‌గా పనిచేసిన రజిత భువనగిరి మునిసిపల్ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. ఆమె స్థానంలో నాలుగు నెలల క్రితం హైదరాబాద్‌లోని పోచారం మునిసిపాలిటీ నుంచి అకౌంటెంట్ అబ్దుల్ డిప్యూటేషన్‌పై వచ్చారు. వచ్చీ రాగానే ఆయనకు పేరుకుపోయిన లెక్కల ఖాతాలు కన్పించాయి. దీంతో కమిషనర్‌కు ఓ మాట చెప్పి మరొకరి సహకారంతో లెక్క తేల్చాలని నిర్ణయించుకున్నారు. తన బంధువు ఇమ్రాన్‌ను ఆ సీటులో అనధికారికంగా కూర్చోబెట్టాడు. నాలుగు నెలల నుంచి గుట్ట మునిసిపల్ అకౌంట్స్ విభాగంలో ఇమ్రాన్ అనధికారికంగా పనిచేస్తున్నాడు. అబ్దుల్ మాత్రం డిప్యుటేషన్‌పై మూడు రోజులు పోచారంలో, మూడు రోజులో గుట్టలో పనిచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇదేమి తనకు తెలియదని, ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కమిషనర్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నారు. రెగ్యులర్ అకౌంటెంట్ మాదిరి పనిచేయడానికి అతనికి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. తాత్కాలికంగా పనులు పూర్తి చేయడానికి వచ్చినట్లు చెప్పారు. చైర్‌పర్సన్ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్ మాట్లాడుతూ ప్రైవేట్ వ్యక్తి నియామకం కోసం ఎలాంటి తీర్మానం చేయలేదన్నారు.
పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించలేదు : శ్రవణ్‌కుమార్‌రెడ్డి, కమిషనర్
మూడేళ్ల నుంచి అకౌంట్స్ పెండింగ్‌లో ఉండటంతో వాటిని పూర్తి చేయడానికి మరో వ్యక్తిని తీసుకొస్తానని అబ్దుల్ చెప్పడం తో సరేనన్నా. అంతేగానీ పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించలేదు.