వామ్మె వానరం

ABN , First Publish Date - 2023-09-04T00:53:08+05:30 IST

కిష్కింధకాండ పెచ్చురిల్లుతోంది. వేలాదిగా సంచరిస్తూ చిన్నారులు మొదలు పెద్దలపై దాడులు చేస్తుండటంతో వారు బెంబేలెత్తిపోతున్నారు. కోతుల దాడులను అరికట్టడం ఖర్చుతో కూడిన అంశం కావడంతో మునిసిపల్‌, పంచాయతీ పాలకవర్గాలు చేతులెత్తేస్తున్నాయి.

వామ్మె వానరం

తీవ్రమైన కోతుల బెడద

బెంబేలెత్తుతున్న జనం

పట్టింపులేని అధికార యంత్రాంగం

భూదాన్‌పోచంపల్లి: కిష్కింధకాండ పెచ్చురిల్లుతోంది. వేలాదిగా సంచరిస్తూ చిన్నారులు మొదలు పెద్దలపై దాడులు చేస్తుండటంతో వారు బెంబేలెత్తిపోతున్నారు. కోతుల దాడులను అరికట్టడం ఖర్చుతో కూడిన అంశం కావడంతో మునిసిపల్‌, పంచాయతీ పాలకవర్గాలు చేతులెత్తేస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో కొండముచ్చులను తిప్పడం ద్వారా తాత్కాలిక నివారణ చర్యలు చేపడుతున్నా, ఆశించిన ఫలితం కానరావడం లేదు. కోతుల ఆహారానికి అవసరమైన మంకీ ఫుడ్‌ కోర్టులు లేకపోవడంతో వాటి బెడద ఎక్కువైంది. అటవీ ప్రాంతంలో పండ్ల చెట్లు లేకపోవడంతో గ్రామాలు, పట్టణాల్లోకి గుంపులుగా కోతులు వస్తున్నాయి. ఇళ్లు, దుకాణాల్లోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇంటి పైకప్పు పెంకులను పెకిలించడంతోపాటు పంటల ను నాశనం చేస్తూ రహదారులపై స్వైరవిహారం చేస్తున్నాయి.

పట్టణాలతోపాటు పల్లెల్లోనూ కోతుల బెడద నా నాటికీ పెరుగుతోంది. అడవులను విడిచి పల్లెల్లోకి అవి ప్రవేశిస్తున్నాయి. పల్లెలను వాటి జీవన ఆవాసాలుగా మార్చుకుంటున్నా యి. ఆకలితో అలమటిస్తూ ఊళ్లల్లో ప్రజలపై దాడులు చేస్తున్నాయి. జనాల చేతుల్లో ఏదైనా కనిపిస్తే వాటిని లాక్కునే సమయంలో కోతులు తీవ్రంగా గాయపరుస్తున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పంటపొలాలకు, చేలకు తీవ్ర నష్టం చేస్తున్నాయి. నారు వేసిన కొన్ని రోజులకే నారు పీకేస్తున్నాయి. రైతులు పంటల వద్ద కా పుగాసి కాపాడుకుంటున్నారు. పండ్ల తోటలనూ నాశనం చేస్తున్నా యి. కోతులపై ప్రజల్లో కొంత ఆధ్యాత్మిక భావన ఉండటంతో వాటిని ఏమీ చేయలేకపోతున్నారు.గ్రామాల్లో కోతుల బెడద తీవ్ర సమస్యగా పరిణమించింది. అడవుల్లో కోతులకు సరైన ఆహారం దొరక్కపోవడంతో ఇలా వ్యవహరిస్తున్నాయని అంతా అభిప్రాయపడుతున్నారు.

కోతుల ఆకలి తీరేదెలా?

పల్లెలు, పట్టణాల్లోని కోతులు అడవుల బాట పట్టేలా మంకీ ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అటవీశాఖ ఆశించిన స్థాయిలో కాకుండా నామమాత్రంగా చర్యలు చేపట్టి గాలికి వదిలేసిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. మూడేళ్ల క్రితం ‘వానర వనం’ పేరుతో యాదాద్రి జిల్లాలో సుమారు 15 హెక్టార్లలో ఏడు చోట్ల వానర ఆహార ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. ఉపాధి హామీ పథకం, గ్రామపంచాయతీ, మునిసిపల్‌ నిధుల ద్వారా ఏర్పాటైనా లక్ష్యం నెరవేరలేదు. కొన్నిచోట్ల పోషణ సరిగా లేక చెట్లు ఎదగలేదు. కాత సరిగా కాయలేదు. దీంతో వ్యవసాయ క్షేత్రాల్లో పండ్లు, కూరగాయల తోటలపై కోతులు దాడులు చేస్తూ తీవ్రంగా నష్టం కలిగిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశంతో అప్పట్లో కొండలు, లోయ ల్లో సీడ్‌ బాల్స్‌ వేసినా ఆశించిన ఫలితాలు దక్కలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. మంకీఫుడ్‌ కోర్టులను హరితహారం కార్యక్రమంలో చేర్చితే ప్రభుత్వం ఆశయం నెరవేరుతుందని పలువురు పేర్కొంటున్నారు. భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌లోని అటవీప్రాంతంలో ప్రధాన రహదారిపై నిత్యం వందలాదిగా కోతులు దర్శనమిస్తున్నాయి. దారివెంట వెళ్తున్న వాహనాలకు అడ్డుగా నిలిచి ఆకలితో అలమటిస్తూ నిరీక్షిస్తున్నాయి. దీంతో వానర ప్రేమికులు వారికి తోచిన విధంగా పండ్లు, బ్రెడ్‌, ఇతర ఆహార పదార్థాలు తెచ్చి పెడుతున్నారు. వానర ప్రేమికుడైన రావుల మోహన్‌రెడ్డి కోతుల సంరక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీ సుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. తన వంతుగా ప్రతీ ఆదివారం సెలవు రోజు కుటుంబసభ్యులతో కలిసి ఇక్కడికి వచ్చి కోతులకు ఒక ఆటోలో పండ్లు తెచ్చి ఆహారంగా అందిస్తున్నారు. ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేసి కోతులను సంరక్షించాలని ఆయన కోరుతున్నారు.

దాడులతో జనం బెంబేలు

వ్యవసాయశాఖ అధికారులు గత ఏడాది లెక్కగట్టి జిల్లాలో 92 వేలకు పైగా కోతులున్నట్లు నిర్ధారించారు. ఎన్ని గుంపులు వస్తున్నా యి, ఏ దశలో పంటలను ఎంత శాతం నాశనం చేస్తున్నాయి, వాటి నివారణకు రైతులు ఏవైనా పద్ధతులు పాటిస్తున్నారా అనే వివరాలు సేకరించారు. కోతి జీవితకాలం 15 ఏళ్లు. ఒక్కో కోతి సగటున ఆరు పిల్లలకు జన్మనిస్తోంది. గడిచిన ఏడాదికాలంలో వీటి సంఖ్య విపరీతంగా పెరిగినట్టు అంచనా. ఇళ్లల్లోని ఆహార పదార్థాలు, వంట సరుకులను కాపాడుకునే ప్రయత్నంలో ప్రజలపై అవి మూకుమ్మడిగా దాడికి పాల్పడుతున్నాయి. కొద్దిపాటి సాగుచేసిన కూరగాయల తోటల చుట్టూ నైలాన్‌ వలలు ఏర్పాటు చేస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతుల బారి నుంచి ఆరుతడి పంటల రక్షణకు సోలార్‌ ఫెన్సింగ్‌, మంకీగన్స్‌ తదితర పరికరాలను రాయితీపై ప్రభుత్వం అందించాలని రైతులు కోరుతున్నారు. అడవులు అంతరిస్తుండటంతో జనావాసాల్లోకి ప్రవేశించిన కోతులు గ్రామాలు, పట్టణాలతో పాటు పంట పొలాలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తూ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఇళ్ల పైకప్పుల కు వేసిన పెంకులు, రేకులు ధ్వంసం చేయడం, పెరట్లోని కూరగాయలు, పండ్లను దక్కకుండా చేస్తున్నాయి. ఏళ్ల తరబడి పెంచుకున్న మామిడి, వేప, చింత తదితర మహావృక్షాలను కోతులు ఆవాసాలుగా చేసుకుంటుండటం తో వాటిని ప్రజలు నరికివేస్తున్నారు. వ్యవసాయ పొలాల వద్ద వరి, కంది, పెసర,మొక్కజొన్న, పండ్ల తోటలతోపాటు వివిధ రకాల కూరగాయల పంటలను నాశనం చేస్తూ రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇళ్లలో ఉండే చిన్న పిల్లలు, మహిళల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కొంతమంది మిద్దెలపై ఉన్న సమయంలో ఒక్కసారిగా కోతులు రావడంతో భయంతో పరుగెత్తబోయి కిందపడి కాళ్లు, చేతులు విరగొట్టుకోవడం, గాయాలపాలవడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఓవైపు ప్రకృతి వైపరీత్యాలకు కుదేలవుతున్న రైతులకు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు కోతులబెడద మరో పెద్ద సమస్యగా మారింది.

చెట్లు పెంచుతున్నా..

ప్రభుత్వం ఆరేళ్లుగా రాష్ట్రంలో హరితహారం కింద మొక్కలు నాటు తోంది. కానీ,కోతులు మాత్రం గ్రామాలను వదిలి అడవులకు వెళ్లడం లేదు. హరితహారం పథకంలో భాగంగా అడవుల్లో పండ్ల మొక్కలు నాటుతున్నారా? లేదా? అనే విషయం ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ నాటినా వాటి సంరక్షణకు చర్యలు ఏ మేరకు తీసుకుంటున్నారో తెలియదు. అడవుల్లో పండ్ల మొక్కలు తప్పనిసరి పెంచాలి. కోతులకు కావాల్సిన ఆహారానికి సంబంధించిన పండ్ల మొక్కలు నాటా లి. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన స్పందించి కోతులను పట్టి అడవుల్లో విడిచిపెట్టాలి. స్థానికంగా ఆయా మునిసిపాలిటీలు, గ్రామపంచాయతీల పాలకవర్గాలు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఏడు వానర వనాలు ఏర్పాటు చేశాం : పద్మజారాణి, డీఎ్‌ఫవో

సీఎం ఆదేశాలతో 2020-21లో జిల్లాలో ఏడు చోట్ల వానర వనాలు ఏర్పాటు చేశాం. సుమారు 15 హెక్టార్లలో కోతుల ఆకలిని తీర్చే మారేడు, నేరేడు, చింత, ఇప్ప, సీతాఫలం, రామాఫలం, సీమచింత మొక్కలు నాటి వాటిని పోషిస్తున్నాం. రాచకొండతోపాటు రాయిగిరి, చౌటుప్పల్‌, లక్కారం, పర్వతాపురం, భూదాన్‌పోచంపల్లి మండల పరిధిలోని జలాల్‌పూర్‌లో వనాలు పెంచుతున్నాం.

Updated Date - 2023-09-04T00:53:08+05:30 IST