మూడోసారి బరిలో శానంపూడి సైదిరెడ్డి
ABN , First Publish Date - 2023-08-22T00:39:18+05:30 IST
హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మరోసారి శానంపూడి సైదిరెడ్డికే అవకాశం దక్కింది. సీఎం కేసీఆర్ మూడోసారి ఆయనకే అవకాశం కల్పించారు.
హుజూర్‌నగర్, ఆగస్టు 21 : హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మరోసారి శానంపూడి సైదిరెడ్డికే అవకాశం దక్కింది. సీఎం కేసీఆర్ మూడోసారి ఆయనకే అవకాశం కల్పించారు. దీంతో మరోసారి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కెనడాలో హోటల్ బిజినెస్ చేసిన సైదిరెడ్డి 2017 నుంచి హుజూర్‌నగర్‌లో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటున్నారు. మొదటిసారి 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సైదిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై 7వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తమ్ పోటీ చేసి విజయం సాధించడంతో 2019లో హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డిపై 43,400ఓట్లతో బీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హుజూర్‌నగర్‌లో బీఆర్‌ఎస్ జెండాను ఎగురవేశారు. గడిచిన నాలుగేళ్లలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ జోగినపల్లి సంతో్‌షలకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. టికెట్‌ను దక్కించుకుని కేసీఆర్‌తో పాటు అధిష్టానం వద్ద ఉన్న తన పలుకుబడిని చాటుకున్నారు. టికెట్ తనకే వస్తుందని మొదటి నుంచి ఆయన ధీమాగానే ఉన్నారు.
మరోసారి బీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తా : ఎమ్మెల్యే సైదిరెడ్డి
మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీ్‌షరావు, జగదీ్‌షరెడ్డిలకు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో మరోసారి భారీ మెజార్టీతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాలుగేళ్లలోనే రూ.3.5 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టానన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెడతానన్నారు. ప్రజల ఆదరాభిమానాలు పొందుతానన్నారు. గతంలో కన్నా ఎక్కువ మెజార్టీ సాధిస్తానన్నారు. సీఎం కేసీఆర్ ఎడమ కకాల్వ అభివృద్ధి పనులపై జిల్లా ప్రజల సాక్షిగా సభా వేదికపై ప్రశంసించారన్నారు.