గుండెపోటుతో రౌడీషీటర్‌ జునైద్‌ మృతి

ABN , First Publish Date - 2023-05-16T00:06:32+05:30 IST

హత్యానేరంతో పాటు పలురకాల సెటిల్‌మెంట్ల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించి పోలీసులకు వాంటెడ్‌ రౌడీషీటర్‌గా మారిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మహ్మద్‌ జునైద్‌(35) సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు.

గుండెపోటుతో రౌడీషీటర్‌ జునైద్‌ మృతి
జునైద్‌ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తున్న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది, జునైద్‌ (ఇనసెట్‌లో ఫైల్‌ఫొటో)

ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలింపు

హైదరాబాద్‌లో చికిత్సపొందుతూ మృతి

మిర్యాలగూడ అర్బన, మే 15 : హత్యానేరంతో పాటు పలురకాల సెటిల్‌మెంట్ల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించి పోలీసులకు వాంటెడ్‌ రౌడీషీటర్‌గా మారిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మహ్మద్‌ జునైద్‌(35) సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. మిర్యాలగూడ పట్టణం ఇస్లాంపురకు చెందిన జునైద్‌ ఉన్నతవిద్య అభ్యసించేందుకు హైదరాబాద్‌కు వెళ్లి గ్యాంగ్‌కల్చర్‌కు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో 2019 జూనలో హైదరాబాద్‌ పీపుల్స్‌ప్లాజా వద్ద జరిగిన ఓ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన జునైద్‌ మిర్యాలగూడ కేంద్రంగా పలు సెటిల్‌మెంట్లను చక్కబెట్టడంలో బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో 2020లో అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్‌ జునైద్‌పై రౌడీషీట్‌ తెరచి పీడీయాక్ట్‌ నమోదుచేశారు. వరంగల్‌ సెంట్రల్‌ జైల్‌లో ఏడాది పాటు శిక్ష అనుభవించిన జునైద్‌ బయటకు వచ్చిన అనంతరం తన ప్రవృత్తిని వదులుకోకుండా పెద్దఎత్తున యువతను చేరదీసి భూ సెటిల్‌మెంట్లు మొదలు సివిల్‌ కేసులను పరిష్కరిస్తూ ుభాయ్‌్‌గా గుర్తింపు పొందాడు. అయితే మూడునెలల క్రితం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల వద్ద జరిగిన ఓ ఫంక్షనలో తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఓ యువకుడిపై దాడిచేసి తీవ్రస్థాయిలో మందలించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు తన అనుచరుల్లో కీలకమైన కొందరు యువకులను టాస్క్‌ఫోర్స్‌ పోలీ్‌సబృందాల ద్వారా అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో మందలించి కఠినంగా చర్యలు తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జునైద్‌ దాడి కేసులో జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన తరువాత హైదరాబాద్‌లోని టోలీచౌక్‌లో నివాసం ఉంటున్న తన సోదరుడి వద్దకు వెళ్లిపోయాడు. మానసికంగా నలిగిపోతున్న జునైద్‌ ఆదివారం రాత్రి ఛాతిలో నొప్పిగా ఉందంటూ కిందపడిపోయినట్లుగా అతడి సన్నిహితులు చెబుతున్నారు. సోదరుడి కుటుంబ సభ్యులు అతడిని చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతూ సోమవారం మృతి చెందాడు. జునైద్‌పై ఓ హత్యానేరం కేసుతో పాటు 15 వరకు ఇతర సెక్షన్ల కింద కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మృతిపై బంధువుల అనుమానం

జునైద్‌ మృతిపై అతడి సన్నిహితులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషప్రయోగం జరిగి ఉండవచ్చంటున్నారు. జునైద్‌ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం మిర్యాలగూడకు సోమవారం తీసుకురాగా అతడి బంధువులు, సన్నిహితులు పలు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు జునైద్‌ మృతదేహానికి స్థానిక ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. వైద్యులు సేకరించిన అతడి శరీర అవయవాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించినట్లు వనటౌన సీఐ రాఘవేందర్‌ తెలిపారు. అయితే జునైద్‌ అనుచరులు, సన్నిహితులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అతడి ఆకస్మిక మృతిపై నెలకొన్న మిస్టరీని తొలగించేదుకు ఫోరెన్సిక్‌ నివేదిక కీలకంగా మారనుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించగా దహనసంస్కారాలు పూర్తిచేశారు. అంతిమయాత్రలో భాగంగా యువత పెద్దఎత్తున బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీ్‌స బందోబస్తు నిర్వహించారు.

Updated Date - 2023-05-16T00:06:32+05:30 IST