వరికొయ్యలే ఉరితాళ్లు

ABN , First Publish Date - 2023-06-01T00:56:49+05:30 IST

వరి కొయ్యలే రైతులకు ఉరితాళ్లుగా మారుతున్నాయి. వరి కొయ్యలను కాల్చవద్దని వ్యవసాయాధికారులు చెబుతున్నప్పటికీ రైతులు పట్టించుకోవడంలేదు. వరి కొయ్యలను కాల్చితే భూసారం తగ్గడంతో పాటు పంట దిగుబడి కూడా గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది. దీనికితోడు జిల్లాలో వరి కొయ్యల మంటల్లో, పొగతో ఇద్దరు రైతులు మృతి చెందారు.

వరికొయ్యలే ఉరితాళ్లు

పొగ, మంటలతో ఇటీవల ఇద్దరు రైతులు మృతి

వరి కొయ్యలను కాల్చడంతో కోల్పోతున్న భూసారం

భూమిలో కలియ దున్నితేనే రైతులకు మేలు

కాల్చవద్దంటున్న వ్యవసాయాధికారులు

వరి కొయ్యలే రైతులకు ఉరితాళ్లుగా మారుతున్నాయి. వరి కొయ్యలను కాల్చవద్దని వ్యవసాయాధికారులు చెబుతున్నప్పటికీ రైతులు పట్టించుకోవడంలేదు. వరి కొయ్యలను కాల్చితే భూసారం తగ్గడంతో పాటు పంట దిగుబడి కూడా గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది. దీనికితోడు జిల్లాలో వరి కొయ్యల మంటల్లో, పొగతో ఇద్దరు రైతులు మృతి చెందారు.

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట)

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన గత నెల 16వతేదీన ఓ రైతు తన పొలంలోని వరి కొయ్యలకు నిప్పు పెట్టారు. ఈ పొలం పక్కనే ఉన్న రైతు గోళ్ల గంగయ్య(60) తన పొలంలోని నీటి పైపులు కాలిపోయే ప్రమాదం ఉందని భావించి చెట్ల పచ్చి కొమ్మలను విరిచి మంటలు ఆర్పేందుకు యత్నించారు. ఈ క్రమంలో గంగయ్య చుట్టూ మంటలు చుట్టుముట్టాయి. చుట్టపక్కల రైతులు గమనించి మంటలను ఆర్పే లోపు గంగయ్య మృతి చెందారు. అదేవిధంగా మునగాల మండలం నేలమర్రి గ్రామంలో రైతు చామకూరి సూర్యనారాయణ(65) ఈనెల 17వ తేదీన తన పొలంలో వరి కొయ్యలకు నిప్పు పెట్టాడు. మంటలు పెద్దఎత్తున ఎగిసి పక్క పొలంలోకి వ్యాపించడంతో వాటిని ఆర్పడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో పొగమంటలు చుట్టుముట్టడంతో ఊపిరాడక సూర్యనారాయణ మృతి చెందాడు. వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో మోతె మండలంలోని పలు గ్రామాల్లో రోడ్డు పక్కన నాటిన హరితహారం మొక్కలు కూడా దగ్ధమయ్యాయి. సిరికొండ నుంచి రాయిపాడు వెళ్లే రోడ్డులో వరి కొయ్యలకు ఓ రైతు ఈ నెల 19వ తేదీన నిప్పుపెట్టి ఇంటికి వెళ్లారు. ఈ మంటలు పెద్దఎత్తున వ్యాపించి రోడ్డు వెంబడి నాలుగేళ్లుగా పెంచిన హరితహారం మొక్కలు కిలోమీటర్‌ మేర పూర్తిగా కాలిపోవడంతో పాటు సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌కు మంటలు అంటుకున్నాయి. నామవరం నుంచి గుంజలూరుకు వెళ్లే మార్గంలో ఏడు కిలోమీటర్ల మేర నాటిన మొక్కలు అగ్నికి ఆహుతయ్యాయి. ఒకవైపు గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే మొక్కలను సంరక్షించాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే కొంతమంది నిర్లక్ష్యంగా వరి కొయ్యలకు నిప్పుపెట్టి భూసారాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణానికి హాని చేస్తున్నారు.

భూసారానికి ప్రమాదం

రైతులు వరి కొయ్యలకు నిప్పుపెట్టి బూడిద చేస్తున్నారు. దీంతో భూమిలో పంటకు ఉపయోగపడే క్రిమి, కీటకాలు కూడా చనిపోయి పంటలకు తీవ్ర నష్టం కలుగుతోంది. వరి కొయ్యలను కాల్చితే సేంద్రియ కర్బన శాతం పెరిగి గాలిలో చేరి, కాలుష్యం ఏర్పడుతోంది. వరి కొయ్యలకు కాల్చకుండా అలాగే పొలంలో కలియదున్నితే సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

వరి కొయ్యలను కలియదున్నితే అనేక ప్రయోజనాలు

వరి కొయ్యలను నేలలో కలియదున్నితే సేంద్రియ కర్బనశాతం పెరిగి దిగుబడులు ఐదు నుంచి పది శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. దుక్కి దున్నే సమయంలో సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌ చల్లితే అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా అందుబాటులోకి వస్తాయి. ఈ విధంగా చేస్తే రైతులపై డీపీపీ వాడకభారం తగ్గుతుంది. మొక్కలకు రెండు శాతం నత్రజని(యురియా) నాలుగు శాతం ఫాస్పరస్‌ అదనంగా అందిస్తుంది. నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. జింక్‌, మాంగనీస్‌, ఇనుము, కాల్షియం లాంటివి పంటకు మేలు చేస్తాయి. వరి కొయ్యలను భూమిలో కలియ దున్నితే భూమిలో సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. భూమికి నీటిని, పోషకాలను నిల్వ ఉంచే గుణం పెంచుతుంది. వాయు కాలుష్యం జరగకుండా ఉంటుంది. కొయ్యకాలు కుళ్లడంతో పంటకు ఎరువుగా ఉపయోగపడి దిగుబడులు పెరిగే అవకాశం ఉంది.

కొయ్యకాలుకు నిప్పు పెడితే అనర్థాలు అనేకం

వరి కొయ్యకాలుకు నిప్పు పెడితే అనేక అనర్థాలకు దారి తీస్తుంది. వరి మొదళ్లలో నత్రజని, భాస్వరం, పొటాషియంతో పాటు సూక్ష్మజీవులు ఉంటాయని, మొదళ్లు కాల్చితే ఈ పోషకాలు నేలలో కలవకుండా మంటలకు మాడిపోతాయని అధికారులు పేర్కొంటున్నారు. వరి మొదళ్లను కాల్చితే మంటలు ఎగిసిపడి వేడి తీవ్రతకు సూక్ష్మజీవులు చనిపోతాయు. రైతులు ఆశించిన మేర పంట దిగుబడి రాదు. తరచుగా గడ్డి కాల్చే పొలాలు కోతకు గురవుతుంటాయి. తద్వారా నేలపై ఉండే సారవంతమైన పొర కొట్టుకుపోతుంది. గడ్డిని తిని బతికే కీటకాలు, పశువులకు ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ మంటల వల్ల అకస్మాత్తుగా గ్రామాల్లో అతి సమీపంలో గుడిసెలకు మంటలు అంటుకుని ఆస్తి నష్టం జరుగుతుంది. దీంతో పాటుగా బోరు పైపులు, కరెంటు తీగలు, మోటర్లతో పాటు హరితహారం మొక్కలు, మామిడి తోటలు, ఇతర పండ్ల తోటలు కాలిపోయిన దాఖలాలు అనేకం ఉన్నాయి. ఈ ఏడాది ఇద్దరు రైతులు కూడా మృతి చెందడం విషాదకరం.

వానాకాలం సాగుకు సన్నద్ధం

యాసంగి సీజన్‌ మరో నెల రోజుల్లో పూర్తి కానుంది. వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. యాసంగి సీజన్‌లో వరి కోతలు పూర్తి కాగానే పొలంలో మిగిలిన వరి కొయ్యలను రైతులు కాల్చుతున్నారు. వరి కొయ్యలను కాల్చితే పంటకు అధిక నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. గతంలో వరిపంటను రైతులు కొడవళ్లతో మొదళ్ల దాకా కోసేవారు. పశువులు ఎక్కువగా ఉండటంతో గడ్డిని పశుగ్రాసం కోసం కోసేవారు. ప్రస్తుతం వ్యవసాయంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. గ్రామాల్లో పశువుల సంఖ్య తగ్గడంతో పాటు యంత్రాల వాడకం విపరీతంగా పెరిగింది. మిషన్‌తో హార్వెస్టింగ్‌ చేసే సమయంలో వరి పంటను పైకి కోస్తున్నారు. పొలం దున్నే సమయంలో నాగళ్లకు అడ్డుగా వస్తున్నాయని చాలమంది రైతులు వరి కొయ్యలతో పాటు గడ్డిని కూడా తగలబెడుతున్నారు. వరి కొయ్యలను కాల్చితే భూసారం తగ్గుతుందని, వీటిని కాల్చవద్దంటున్నారు.

వరి కొయ్యలను పొలంలోనే కలియ దున్నాలి : డి.రామరావునాయక్‌, జిల్లా వ్యవసాయాధికారి, సూర్యాపేట

వానకాలం సీజన్‌కు సన్నద్ధం అవుతున్న రైతులు యాసంగిలో వరి పంటను కోయగా మిగిలిన కొయ్యలను కాల్చివేస్తున్నారు. వరి కొయ్యలను కాల్చితే పంట దిగుబడితో పాటు భూసారం తగ్గుతుంది. వరి కొయ్యలకు నీరు పెట్టి పొలంలోనే కలియ దున్నితే సేంద్రియ ఎరువుగా మారి భూసారం పెరగడానికి దోహాదం చేస్తుంది.

Updated Date - 2023-06-01T00:56:49+05:30 IST