చార్‌ధామ్‌ యాత్రలో కొండమల్లేపల్లి వాసి మృతి

ABN , First Publish Date - 2023-06-02T23:45:18+05:30 IST

చార్‌ధామ్‌ యాత్రలో విషాదం నెలకొంది. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్‌ ఆర్టీసీ కండక్టర్‌ మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

చార్‌ధామ్‌ యాత్రలో కొండమల్లేపల్లి వాసి మృతి
మురళి(ఫైల్‌)

కొండమల్లేపల్లి, జూన 2 : చార్‌ధామ్‌ యాత్రలో విషాదం నెలకొంది. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్‌ ఆర్టీసీ కండక్టర్‌ మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మృతుడి బంధువులు తెలిపిన ప్రకారం కొండమల్లేపల్లి మండల కేంద్రానికి చెందిన ఆర్టీసీ రిటైర్డ్‌ కండక్టర్‌ మారం మురళి(75) మే 27వ తేదీన తన నివాస సమీపంలోని కండె చంద్రయ్య కుటుంబసభ్యులతో కలిసి చార్‌ధామ్‌ యాత్రకు రైలులో వెళ్లారు. యాత్ర వివరాలు, యోగక్షేమాలను మురళి ఫోన ద్వారా కుమారుడు వెంకటేశ్వర్లుకు తెలిపేవాడు. గురువారం మురళికి ఫోన చేయగా స్విచ్ఛాఫ్‌ రావడంతో తండ్రి యోగక్షేమాలు తెలుసుకునేందుకు కండె చంద్రయ్యకు వెంకటేశ్వర్లు ఫోనచేశాడు. తాము కేదార్‌నాధ్‌ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్‌ రాష్ట్రం రుద్రప్రయాగ జిల్లాలోని గౌరికుండ్‌ ప్రాంతానికి చేరుకున్నామని చంద్రయ్య తెలిపారు. కేదార్‌నాథ్‌ 16 కిలోమీటర్లు ఉంటుందని, గురువారం ఉదయం ఆలయానికి అందరం కలిసి బయలుదేరగా, మురళి నడవలేక గుర్రంపై వెళ్లారని, కొద్దిదూరం వెళ్లాక వర్షపాతం ఉందని తెలియడంతో తాము హోటల్‌ గదికి వచ్చినట్లు తెలిపారు. మురళి రాత్రి వరకు తిరిగి రాలేదని ఫోన చేస్తే స్విచ్చాఫ్‌ వచ్చిందని వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో చంద్రయ్య అక్కడి పోలీసులకు ఫిర్యాదుచేయడంతో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు వారు తెలిపారు.ఆ మృతదేహం మురళిదిగా గుర్తించి శుక్రవారం మధ్యాహ్నం మురళి కుమారుడు వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. తన తండ్రి మృతదేహాన్ని తీసుకురావడానికి వెళ్తున్నట్లు వెంకటేశ్వర్లు తెలిపాడు. మురళికి భార్య, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Updated Date - 2023-06-02T23:45:18+05:30 IST