ధరాఘాతం
ABN , Publish Date - Dec 30 , 2023 | 11:43 PM
ఆశ, నిరాశల మధ్య సామాన్యుడు 2023 సంవత్సరాన్ని వెళ్లదీశాడు. పెరిగిన నిత్యావసరాల ధరలతో మధ్య తరగతి, ఉపాధి అవకాశాలు దొరక్క నిరుద్యోగులు, మూడు రెట్లు పెరిగిన రియల్ ధరలతో విక్రయాలు మందగించి వ్యాపారులు, సాగర్ ప్రాజెక్టు నీరందక యాసంగి సీజన్‌లో ఆయకట్టు రైతులు నిరాశలో ఉన్నారు.
పెరిగిన ధరలతో ఇబ్బందుల్లో మధ్య తరగతి
నిత్యావసరాల ధరలు పైపైకి
జీఎస్టీతో విక్రయాలు అంతంతే
కుదేలైన రియల్ ఎస్టేట్ రంగం
ఎక్సైజ్ శాఖకు పెరిగిన ఆదాయం
కోదాడ: ఆశ, నిరాశల మధ్య సామాన్యుడు 2023 సంవత్సరాన్ని వెళ్లదీశాడు. పెరిగిన నిత్యావసరాల ధరలతో మధ్య తరగతి, ఉపాధి అవకాశాలు దొరక్క నిరుద్యోగులు, మూడు రెట్లు పెరిగిన రియల్ ధరలతో విక్రయాలు మందగించి వ్యాపారులు, సాగర్ ప్రాజెక్టు నీరందక యాసంగి సీజన్‌లో ఆయకట్టు రైతులు నిరాశలో ఉన్నారు. అన్నివర్గాలు ఈ సంవత్సరాన్ని ఒడిదుడుకుల మధ్య కొనసాగించాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా కరోనా తగ్గినా, కొత్త వెరియంట్స్ భయం ప్రజలను వెంటాడింది. 2024 సంవత్సరంలోనైనా నిత్యావసరాల ధరలు తగ్గించి, జీవన ప్రమాణాలు పెరిగేలా చూడాలని సగటు మధ్య తరగతి ప్రజలు కోరుతున్నారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది చివరి నాటికి నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు అరకొర వస్తువులతోనే నెట్టుకురావాల్సి వచ్చింది. ప్రతీ నిత్యావసర వస్తువుల ధరలు 20శాతం మేర పెరిగాయి.
రైతులపై ఎరువుల ధరల భారం
సాగు ఖర్చులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎరువులు, పురుగు మం దుల ధరలు భారంగా మారాయి. పంట దిగుబడికి అవసరమైన యూరియా 45కిలోల బస్తా రూ.266, డీఏపీ 50కిలోల బస్తా రూ.1,350 ఉంది. డీ ఏపీపై రూ.500, యూ రియాపై రూ.100 ధర తగ్గించాలని రైతులు కోరుతున్నారు. అదేవిధంగా పైరుకు పిచికారీ చేసే మందుల ధరలూ అధికంగానే ఉన్నాయి. పెట్టుబడులు అధి కంగా కావడంతో చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయం చేసేందుకు ఇష్టపడటం లేదు. కొత్త ఏడాదిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎరువులు ధరలు తగ్గించి, వ్యవసాయరంగానికి చేయూత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
మందగించిన రియల్‌రంగం
కరోనాకు ముందు రియల్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయల్లా ఉండేది. దీంతో పెరగాల్సిన దానికన్నా భూమి ధర మూడు రెట్లు పెరిగింది. దీనికి తోడు ఇతర దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన యువత తమ ఆర్జితాన్ని పంపించకపోవడం, రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగడంతో భూక్రయవిక్రయాలు ఈ ఏడాది అంతగా జరగలేదు. గతంలో ఒక నెలలో 20 ప్లాట్లు విక్రయించిన తాము ఈ ఏడాది నెలకు ఒక్కటి కూడా విక్రయించలేక పోయినట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేర్కొంటున్నారు.
ఎక్సైజ్ శాఖకు కలిచివచ్చిన ఏడాది
ఎక్సైజ్‌శాఖకు ఈ ఏడాది కలిసొచ్చింది. ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించటంతో విక్రయాలు పెరిగాయి. 2022లో ఎంసీ ఫుల్ బాటిల్ ధర రూ.760 ఉంటే ఈ ఏడాది ఆ ధర రూ.720కి తగ్గింది. ఆఫ్‌బాటిల్‌పై రూ.20, క్వార్టర్‌పై రూ.10 తగ్గింది. ఇలా ఇతర బ్రాండ్లపై ధరలు తగ్గించటంతో విక్రయాలు పెరిగాయి. ధరలు తగ్గించకముందు 2022లో ఒక్కో దుకాణంలో రోజూ రూ.3లక్షల వ్యాపారం నడిచేది. ధర తగ్గించాక ఈ ఏడాది రూ.3.5లక్షలకు విక్రయాలు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు.
పెరిగిన కల్తీ విక్రయాలు
ప్రతీ రంగంలో విక్రయాలు అంతంత మాత్రంగా ఉండటంతో కల్తీ వ్యాపారం పెరిగింది. ఫలితంగా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కల్తీ వస్తువులు తీసుకోవడంతో ప్రతి ఒక్కరూ గ్యాస్ సమస్యను ఎదుర్కొంటున్నట్టు చెబుతున్నారు. నూతన సంవత్సరంలోనైనా ప్రభుత్వం కల్తీ విక్రయాలకు చెక్ పెట్టాలని, ప్రజల ఆరోగ్యాలను మెరుగుపర్చాలని సూచిస్తున్నారు.
జీఎస్టీ భారంతో తగ్గిన విక్రయాలు
కేంద్ర ప్రభుత్వం 2017లో వ్యాట్ స్థానంలో జీఎస్టీని తీసుకువచ్చింది. అయితే ఈ విధానంలో పన్నుల భారం అధికంగా ఉండటం, అది వినియోగదారుడిపై నేరుగా పడుతుండటంతో కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. దీంతో విక్రయాలు లేక వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిమెంట్‌ను రాయల్ వస్తువు కింద కేంద్రం ప్రకటించింది. దీంతో 50కిలోల బస్తా తయారీకి రూ.300 అయితే జీఎస్టీగా రూ.100కు 29శాతం పన్ను రూ.87 జమ అవుతోంది. వెరసి సిమెంట్ బస్తా ధర రూ.387కు పెరిగింది. ధర అధికంగా ఉండటంతో నిర్మాణ రంగంలో పురోగతి మందగించింది. అదేవిధంగా ఎలక్ట్రికల్ వస్తువులకు 18శాతం, ఇతర వస్తువులకు 12శాతం జీఎస్టీతో విక్రయాలు సాగడం లేదు. 2017-18తో పోల్చితే ఈ ఏడాది విక్రయాలు సగానికి సగం తగ్గాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.
వస్తువులు 2022లో ప్రస్తుతం పెరుగుదల
క్వింటా క్వింటా
బియ్యం రూ 5,000 రూ.6,400 రూ.1400
కందిపప్పు రూ 13,000 రూ.18,500 రూ.5,500
మినపప్పు రూ 13,000 రూ.17,000 రూ.4,000
పెసరపప్పు రూ 11,000 రూ.13,000 రూ.2,000
ఉల్లిగడ్డలు రూ.2,000 రూ.3,500 రూ.1,500
వెల్లుల్లి రూ.13,000 రూ.28,000 రూ.15,000
పంచదార రూ.3,500 రూ.4,500 రూ.1,000
పల్లీలు రూ.12,000 రూ.16,000 రూ.4,000
నూనె(లీటర్) రూ.165 రూ.115 రూ.50
కాస్మోటిక్స్ విభాగంలో ప్రతీ వస్తువుపై రూ.5నుంచి రూ.10పెరిగాయి. కూరగాయాలు కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగాయి.