పల్లెల సమగ్రాభివృద్ధికి ప్రణాళిక

ABN , First Publish Date - 2023-03-17T00:00:04+05:30 IST

పల్లెల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాల కింద నిధులు మంజూరు చేస్తున్నాయి. వీటికితోడు ఆర్థిక సంస్థల ద్వారా కూడా నిధులు విడుదలవుతున్నాయి. ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులతోపాటు గ్రామాల్లో కొంతమంది వారి కుటుంబసభ్యుల జ్ఞాపకార్థం భవనాల నిర్మాణం తోపాటు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టేందుకు దాతలు ముందుకొస్తుంటారు.

పల్లెల సమగ్రాభివృద్ధికి ప్రణాళిక

కేంద్ర, రాష్ట్ర నిధుల వినియోగానికి కసరత్తు

421 గ్రామాల్లో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు

70శాతం పనులపై వివరాలు నమోదుకు చర్యలు

పల్లెల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాల కింద నిధులు మంజూరు చేస్తున్నాయి. వీటికితోడు ఆర్థిక సంస్థల ద్వారా కూడా నిధులు విడుదలవుతున్నాయి. ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులతోపాటు గ్రామాల్లో కొంతమంది వారి కుటుంబసభ్యుల జ్ఞాపకార్థం భవనాల నిర్మాణం తోపాటు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టేందుకు దాతలు ముందుకొస్తుంటారు. మరికొంత మంది గ్రామంలో చేపట్టే పలు అభివృద్ధి పనులకు తమవంతుగా సహాయ సహకారాలు(కాంట్రిబ్యూషన్‌) అందిస్తుంటారు. ఈ నిధులన్నీ వినియోగించుకునేలా జిల్లా యంత్రాంగం ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి)

జిల్లాలో మొత్తం 17 మండలాల్లో 421 గ్రామపంచాయతీలున్నాయి. అన్ని పంచాయతీల్లోనూ గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ-గ్రామపంచాయతీ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌) రూపొందిస్తున్నారు. జీపీడీపీ పనుల గుర్తింపు, కార్యాచరణపై ఈమేరకు జిల్లా అధికారులు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై తీర్మానాలు చేసి, ప్రభుత్వం రూపొందించిన వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేయాలని జిల్లాయంత్రాంగం ఆదేశించింది. గ్రామపంచాయతీల్లో భవిష్యత్‌ తరాలకోసం ఉపయోగపడే పనులను గుర్తించేందుకు స్థానిక సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జీపీడీపీలో భాగంగా గ్రామపంచాయతీల్లో చేపట్టనున్న పనులను అప్‌లోడ్‌ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది. జిల్లాలోని 421 గ్రామపంచాయతీలకు 274 (60శాతానికి పైగా) పంచాయతీలు వెబ్‌సైట్‌లోని యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు. జిల్లాలో మిగిలిన 147 మండలాల్లోనూ పంచాయతీ ల్లో చేపట్టనున్న పనులపై ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు జిల్లాయంత్రాంగం చర్యలు తీసుకుంటుం ది. ఈ నెలాఖరులోగా అన్ని పంచాయతీలు కూడా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, జీడీడీపీను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

పల్లెల్లో సకల సౌకర్యాల కల్పన

గ్రామపంచాయతీల సమగ్రాభివృద్ధిలో భాగంగా కేంద్రప్రభుత్వం మిషన్‌ అంత్యోయ పథకం కింద 216 అంశాలతో కూడిన ఫార్మట్‌ను రూపొందించింది. పల్లెల్లో సకల సౌకర్యాలు కల్పించేందుకు తగిన నివేదికలు సిద్ధం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామాల్లో భవిష్యత్‌ కోసం చేపట్టాల్సిన పనులపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను రూపొందించాలని ఆదేశించింది. వీటిలో ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులతోపాటు ఉపాధి హామీ, జాతీయ ఆరోగ్య మిషన్‌, వ్యవసాయం, జలవనరులు, పింఛన్లు, విద్య, తదితర విభాగాల వారీగా సమగ్ర నివేదికను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో చేపట్టనున్న సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, తాగునీటి అవసరాలు, ఇంటింటికీ నల్లా నీటి కనెక్షన్లు, భవనాలు, స్మృతి వనాలు, పార్కుల అభివృద్ధి, శ్మశానవాటికలు తదితర పనులపై పంచాయతీ తీర్మానాలు చేసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఏయే పనులకు ఎంత ఖర్చు చేస్తున్నారు ? ఏ నిధుల కింద వీటిని వినియోగించుకోవాలి, పూర్తిస్థాయి బడ్జెట్‌ను తయారు చేసి ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఆన్‌లైన్‌లో నమోదైన పనులపై సంబంధిత అధికారులు పరిశీలించి, నిధుల మంజూరు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆన్‌లైన్‌లోనే నివేదించనున్నారు. జీపీడీపీ నివేదికల ఆధారంగా భవిష్యత్‌లో నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోనున్నాయి. జిల్లావ్యాప్తంగా ప్రణాళికలు వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

పంచాయతీల వారీగా ప్రణాళికలు సిద్ధం : ఆర్‌.సునంద, జిల్లా పంచాయతీ అధికారి

ప్రభుత్వ ఆదేశాలమేరకు జిల్లాలోని 421 గ్రామపంచాయతీల్లో గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. జీపీడీపీలో భాగంగా ఇప్పటివరకు జిల్లాలో 70శాతం మేరకు గ్రామపంచాయతీల్లో ప్రభుత్వం రూపొందించిన యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో పాస్‌వార్డులు, యూజర్‌ ఐడీలు నమోదు చేశాం. పంచాయతీల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో చేపట్టనున్న పనులపై తీర్మానాలు చేసి, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - 2023-03-17T00:00:04+05:30 IST