పత్తి చేలకు తెగులు గుబులు

ABN , First Publish Date - 2023-09-22T00:31:16+05:30 IST

పత్తి చేలకు తెగులు సోకుతుండడంతో రైతులకు గుబులు పట్టుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి చేలు ఏపుగా వస్తున్న సమయంలో మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న పత్తి చేలకు ఊడ రాలుట, పేనుబంక వంటి తెగులు సోకుతుంది.

పత్తి చేలకు తెగులు గుబులు
ఊడరాలే తెగులు సోకిన పత్తి చేను

ఊడ రాలుట, పేనుబంక తెగుళ్లతో సతమతం

చౌటుప్పల్‌ టౌన్‌, సెప్టెంబరు 21: పత్తి చేలకు తెగులు సోకుతుండడంతో రైతులకు గుబులు పట్టుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి చేలు ఏపుగా వస్తున్న సమయంలో మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న పత్తి చేలకు ఊడ రాలుట, పేనుబంక వంటి తెగులు సోకుతుంది. వర్షాభావ పరిస్థితులతో తల్లడిల్లి పోయిన రైతులకు ఇటీవల కురిసిన మోస్తరు వర్షాలు కొంత మేరకు ఊరటనిచ్చాయి. లక్షలాది రూపాయల పెట్టుబడులతో సాగు చేస్తున్న పత్తికి సోకిన తెగులు నివారణకు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, సలహాలను తీసుకొని అవసరమైన మందులను పిచికారీ చేయాల్సి ఉంది. మండలంలోని ఆరెగూడెం, కాట్రేవు, పంతంగి, తంగడపల్లి, చింతల గూడెం, దామేర, జై.కేసారం, ఎస్‌.లింగోటం, నేలపట్ల, కొండూరు, పీపల్‌పహడ్‌, అల్లాపురం తదితర గ్రామాల్లో పత్తి అధికంగా సాగు చేశారు. అధికార లెక్కల ప్రకారంగా మండలంలో 10,091 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు.

తెగుళ్ల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి : ముత్యాల నాగరాజు, ఏవో చౌటుప్పల్‌

పత్తి చేల ఊడరాలే తెగులును నివారించేందుకు ప్లానోపిక్స్‌ ద్రావణాన్ని 2ఎంఎల్‌ను 20 లీటర్ల నీటి(ఒక పంపు)లో కలిపి పిచికారీ చేయాలి. ఎకరానికి పది పంపులు (అనగా 200 లీటర్ల నీటిలో) 20ఎంఎల్‌ ప్లానోపిక్స్‌ ద్రావకాన్ని కలిపి పిచికారీ చేయాలి. పేనుబంక తెగులు నివారణకు ఎస్టామిప్రిడ్‌ 0.2 గ్రాములు, లేదా ఎస్సీపేట్‌ 2గ్రాములను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఎకరానికి 200లీటర్ల నీటిలో కలిపిన మందుల ద్రావకాన్ని(పది పంపులు) పిచికారీ చేయాలి. కానీ కొంతమంది రైతులు ఆరు నుంచి ఏడు పంపులు మాత్రమే పిచికారీ చేస్తుండడంలో తెగులు పూర్తిస్థాయిలో నివారణ జరగడం లేదు. దీంతో దిగుబడులు తగ్గి రైతులు నష్టాల బారిన పడుతున్నారు.

Updated Date - 2023-09-22T00:31:16+05:30 IST