నోటికాడి ముద్ద నేల పాలు

ABN , First Publish Date - 2023-04-05T00:26:05+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంగళవారం ఈదురు గాలులు, వడగండ్లు బీభత్సం సృష్టించాయి.

నోటికాడి ముద్ద నేల పాలు
యాదా ద్రి భువనగిరి జిల్లా ఆజీంపేటలో తడిసిన రైతుల ధాన్యం

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈదురుగాలులు, వడగండ్ల బీభత్సం

వేలాది ఎకరాల్లో పంట నష్టం

అంచనా వేస్తున్న వ్యవసాయ శాఖ

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంగళవారం ఈదురు గాలులు, వడగండ్లు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల పొట్టదశలో ఉన్న వరి సహా ఇతర పంటలు, కోసి ఆరబెట్టిన పంటలు ధ్వంసం అవుతుండడంతో ఆరుగాలం పడ్డ శ్రమ వృథా అయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తోటల్లో పిందె దశలోని మామిడి పిందెలు రాలిపోవడంతో రైతులు తలపట్టుకుంటున్నారు. వర్షాలతో వరి పొలాలు, మామిడి, నిమ్మతోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు చోట్ల గేదెలు మృతిచెందాయి.

(ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌)

నల్లగొండ జిల్లాలో...

. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని కొప్పోలు, బొల్లారం, నడికుడ, ఆమలూరు, పిట్టలగూడెం గ్రామాల్లో కురిసిన వడగండ్ల వానకు బత్తాయి, మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. వరిచేళ్లు, పత్తి, మిర్చి పంటలు నేలకొరిగాయి. చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. బైరవోని స్వామికు చెందిన దూడ మృతిచెందింది. మన్నెం కాశయ్యకు చెందిన ఇంటి పై కప్పు ఎగిరిపోవడంతో ఇంట్లో ఉన్న 20క్వింటాళ్ల పత్తి తడిసిపోయింది. ఇల్లు కూలిపోవడంతో ఇంట్లో ఉన్న రుద్రాక్షి లావణ్య చెయ్యి విరిగింది. కొప్పోలులో మొత్తం 18ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. నడికుడ గ్రామంలో తిరుమలయ్యకు చెందిన హేయిర్‌ సెలూన్‌ రేకులు మొత్తం లేచిపోయాయి. బైరెడ్డి తిరుమల్‌రెడ్డి ఇంటి వద్ద చెట్టు విరిగి విద్యుత్‌ స్తంభంపై పడడంతో నేలకొరిగింది. నల్లగొండ-దేవరకొండ ప్రధాన రహదారిపై కట్టవారిగూడెం వద్ద చెట్టు రోడ్డుకు అడ్డంగా పడడంతో స్థానిక ఎస్‌ఐ శివప్రసాద్‌ అక్కడికి చేరుకుని చెట్టును రోడ్డు అడ్డంగా పడడంతో తొలగించారు. నడికుడ గ్రామానికి చెందిన మలిగిరెడ్డి నారాయణరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో పశువుల పాక ధ్వంసమైంది. కొప్పోలులో జాతర సందర్భంగా ఏర్పాటైన దుకాణాలు కుప్పకూలిపోయాయి. పిట్టలగూడెంలో కేసాని యాదగిరిరెడ్డికి చెందిన డెయిరీ ఫాం నేలమట్టమైంది. రూ.15లక్షల ఆస్థినష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. విద్యుత్‌ స్తంభాలు విరిగి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

సూర్యాపేట జిల్లాలో...

. సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని డి. కొత్తపల్లి గ్రామంలో చెట్టు కూలి గైగుల్ల రామలింగానికి చెందిన గేదె మృతిచెందింది. మరిపెల్లి సాయిలు, తోడ్సు శ్రవణ్‌, కాసం భద్రయ్యల రేకుల ఇంటి పై కప్పులు లేచి రోడ్డుపైన పడ్డాయి. ఆ సమయంలో రోడ్డుపై ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గాలి దుమారానికి పలు గ్రామాల్లో విద్యుత్‌ తీగలకు అంతరాయం ఏర్పడి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలు అంధకారంలో ఉన్నాయి.

. తిరుమలగిరిలో గాలిదుమారంతో పాటు మోస్తారు వర్షం కురిసింది. గాలి వానకు పలుచోట్ల చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల కోత దశలో ఉన్న వరి పంట నేలకొరిగింది. పదిహేను రోజుల వ్యవదిలో రెండు మార్లు గాలివానకు పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

. అర్వపల్లి మండలంలో ఆకాశంలో మబ్బులు పట్టి ఉరుములు, మెరుపులతో ఈదురు గాలలు వర్షం కురిసింది. ఆకాశంలో మబ్బులను చూసి రైతులు గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. 10రోజుల్లో చేతికొచ్చే పంటలు వడగాలు పడడంతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. మండలంలోని పర్సాయపెల్లి, అర్వపల్లి, సీతారాంపురం, కాసర్లపాడు, బొల్లంపల్లి గ్రామాల్లో ఈదురు గాలులతో కూడి భారీ వర్షం కురిసింది. వరి పంటలు నెలకొరిగాయి.

యాదాద్రి భువనగిరి జిల్లాలో

. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు, అడ్డగూడూరు, ఆత్మకూరు(ఎం) మండలాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడి వర్షం కురిసింది. దీంతో వరి చేలు నేలకొరిగాయి. తోటల్లో మామిడి రాలింది. మోత్కూరు పట్ట ణం అతలాకుతలమైంది. మోత్కూరు వ్యవసాయ మార్కెట్లో, అడ్డగూడూరు మండలం ఆజీంపేటలో బండ మీద పోసిన ధాన్యం రాశులపై కప్పిన టార్పాలిన్లు, పట్టాలు గాలికి లేచిపోయి ధాన్యం వరదకు కొట్టుకుపో యింది. మోత్కూరు- రాయిగిరి రోడ్డులో, మోత్కూరు పనకబండ రోడ్డులో చెట్లు విరిగిపడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మోత్కూరులో పట్టణంలో పలు చోట్ల చెట్లు విరిగి పడ్డాయి. పలు విద్యుత్‌ స్తంభాలు విరిగిపడి విద్యుత్‌ తీగలు తెగాయి. ఓ విద్యుత్‌ స్థంభం విరిగి ట్రాన్స్‌ఫార్మర్‌పై పడింది. మండలంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

. ఆత్మకూరు(ఎం) మండలం పారుపల్లి పరిధిలో బండ యాదగిరికి చెందిన డెయిరీ షెడ్‌ పూర్తిగా ధ్వంసమైంది. సేయింట్‌ ఆన్స్‌ పాఠశాల ప్రహరీ కూలింది. జామచెట్లబావి వద్ద వితంతువు రాంపెల్లి మంజుల, మునిసిపల్‌ కోఆప్షన్‌ సభ్యురాలు సుల్తానామజీద్‌ ఇళ్ల పైకప్పు రేకులు లేచిపోయాయి. బిల్లపాటి మాధవరెడ్డి వ్యవసాయ బావివద్ద షెడ్‌ రేకులు లేచిపోయి గోడలు కూలిపోయాయి. బుజిలాపురంలో దయ్యాల స్వామి, వెంకన్న, చేతరాశి చంద్రయ్యతో పాటు పలువురి వరి చేలల్లో ధాన్యం రాలింది. అనాజిపురంలో కొల్లు శంకర్‌ మామిడి తోటతో పాటు పలు తోటల్లో మామడి కాయలు రాలాయి. సదర్శాపురంలో పలు వరి చేలు నేలకొరిగాయి. మోత్కూరులో గాలికి లేచిపోయిన ఇళ్ల పైకప్పులను తహసీల్దార్‌ షేక్‌ అహమ్మద్‌ పరిశీలించారు. సంబంధిత ప్రభుత్వ అధికారులు స్పందించి గాలివానకు దెబ్బతిన్న ఇళ్లను, వరి, తోటలను పరిశీలించి తగిన నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

. మోటకొండూరు మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చేతికి వచ్చిన వరి నేలపాలు కావడంతో రైతు లు అవేదన వ్యక్తం చేశారు. అధికారులు అదుకోవాని రైతులు కోరుతున్నారు.

. రాజపేట మండలంలోని బొందుగుల, గోదుమకుంట, సోమారం, పారుపల్లి, బూరుగుపల్లి, కుర్రారం గ్రామాల్లో ఈదురు గాలులు, వడగళ్ల వర్షం మంగళవారం కురిసింది. గంట పాటు ఈదురు గాలులతో వడగళ్లు గోలీల సైజులో కురిసాయి. దీంతో మామిడి, వరి, మక్కజోన్న, పశుగ్రాసాలకు నష్టం వాటిల్లింది. ఆయా గ్రామాల్లో ఈదురు గాలులతో మామిడి కాయలు రాలిపోయాయి. అక్కడక్కడ చెట్లు, విద్యుత్‌ స్థంబాలు విరిగి పడ్డాయి. వరి చిరుపొట్ట దశ నుంచి కోత కోసే దశలో ఉండగా వడగళ్లతో తీవ్ర నష్టం వాటిల్లింది. బొందుగుల గ్రామంలో 2020 ఎకరాల్లో వరి సాగు చేయగా 200ఎకరాల్లో మామిడి తోటలు సాగు చేశారు. ఈదురు గాలులు, వడగళ్లతో మామిడి తోటలకు పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. వరి పంట పూర్తిగా నేలపాలైంది. పంట సాగుకు వేల రూపాయలు వెచ్చించి సాగు చేసిన పంట చేతికందే దశలో నేల పాలవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

. ఆత్మకూరు(ఎం) మండలంలోని పారుపల్లి, టి.రేపాక, కఫ్రాయిపల్లి, పల్లెపహడ్‌, ఉప్పలపహడ్‌, సారగండ్లగూడెం, మోదుబాయిగూడెం గ్రామాల్లో ఈదురు గాలలతో కూడిన అకాలవర్షం భీభత్సం సృష్టించింది. భయంకరంగా వీచిన ఈదురు గాలులకు కోళ్లఫాంల రేకులు ఎగిరిపోయాయి. పెద్దసంఖ్యలో విద్యుత్‌ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. కప్రాయిపల్లి గ్రామం వద్ద ప్రధాన రహదారిపై పెద్ద చెట్లు రోడ్‌కు అడ్డంగా విరిగి పడటంతో వాహనాలు నిలిచిపోగ, గ్రామస్తులు చెట్లను తొలగించారు. కోళ్లఫాంలకు భారీగా నష్టం వాటినట్లు బాధితులు తెలిపారు. మామిడి చెట్లకు ఉన్న కాయలు నేలరాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగిపోవడం వలన గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది

. గుండాల మండలంలోని అంబాల, సుద్దాల, బ్రాహ్మణపల్లి, వెల్మజాల, అనంతారం, సీతారాంపురం గ్రామాల్లో కురిసిన అకాల వర్షంతో పాటు వడగళ్లు ఈదురు గాలులకు వరి పంట దెబ్బతిన్నది. అంబాల గ్రామంలో కరెంట్‌ స్తంభాలు కూలిపోవడంతో తీగలు తెగిపడ్డాయి. కందుల దేవమ్మకు చెందిన ఇంటి రేకులు లేచి కింద పడ్డాయి.

. యాదగిరిగుట్ట పట్టణ, మండలంలోని గ్రామాల్లో ఈదులు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. పట్టణంలో పలు వీధుల్లో వర్షం వీధుల్లో పారింది. రాకపోకలకు 30 నిమిషాల పాటు అంతరాయం కలిగింది.

Updated Date - 2023-04-05T00:26:05+05:30 IST