భువనగిరికి కొత్త సొబగులు

ABN , First Publish Date - 2023-05-26T00:34:06+05:30 IST

జిల్లాకేంద్రం భువనగిరి పట్టణ ప్రధాన రహదారికి నూతన సొబగులు సమకూరనున్నాయి.

భువనగిరికి కొత్త సొబగులు
టవర్స్‌ ఏర్పాటు అనంతరం తొలగించనున్న స్తంభం

ఆకర్షణీయమైన డిజైన్లతో వీధి దీపాలు ఏర్పాటు

విద్యుత్‌ టవర్ల ఏర్పాటు పనులు ప్రారంభం

సుమారు రూ.7కోట్లతో 160కి పైగా టవర్లు

భువనగిరి టౌన్‌, మే 25: జిల్లాకేంద్రం భువనగిరి పట్టణ ప్రధాన రహదారికి నూతన సొబగులు సమకూరనున్నాయి. ఇప్పటికే వందఫీట్ల విస్తరణ, రహదారి మధ్యలో, రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలతో హరితశోభ సంతరించుకోగా తాజాగా విద్యుత్‌ కాంతులు విరజిమ్మను న్నాయి. పట్టణంలోని పలు బస్తీల్లో ధీర్ఘకాలికంగా ఉన్న ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్‌ వైర్ల సమస్య కూడా పరిష్కారం లభించనుంది. పట్టణ ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో భాగంగా రహదారికి ఇరువైపులా ఇప్పటి వరకు ఉన్న విద్యుత్‌ స్తంభాల చోటునే విద్యుత్‌ టవర్లు ఏర్పాటు పనులు గురువారం ప్రారంభమయ్యాయి. టవర్లతో పాటు ఆ మార్గంలో నూతన విద్యుత్‌ కేబుల్స్‌, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు, వీధి దీపాల బిగింపు తదితర పనులు పూర్తయ్యాక ప్రస్తుత స్తంభాలు, వైర్లను తొలగిస్తారు. ప్రధాన రహదారి సుందరీకరణ పనుల్లో భాగంగా రహదారికి ఇరువైపు లా ఆకర్షణీయమైన డిజైన్‌లో ఉండే వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయ నున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పనులు పరిశీలించారు.

పనులు ఇలా..

సుమారు రూ.7కోట్లతో విద్యుత్‌ టవర్స్‌ పనులు చేపట్టారు. పట్టణ ప్రధాన రహదారి 100ఫీట్ల విస్తరణ పనుల్లో భాగంగా ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి పాత బస్టాండ్‌ వరకు 2.125కిలో మీటర్ల పాటు ఇరువైపు లా భూఉపరితలం నుంచి 13.5మీటర్ల ఎత్తు ఉండే సుమారు 130 టవ ర్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే బస్తీల్లో విద్యుత్‌ తీగల సమస్యల నివా రణకు పలు వీధుల్లో సుమారు 30 టవర్లను ఏర్పాట్లు చేయను న్నారు. సుమారు ఐదు కిలోమీటర్ల 33కేవీ, ఆరు కిలోమీటర్ల చొప్పున 11కేవీ, ఎల్‌టీ లైన్లు, 10ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తారు. సుమారు 3 నుంచి ఆరు నెలల వ్యవధిలో పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు.

ఇళ్ల మధ్య విద్యుత్‌ వైర్ల సమస్య

టవర్స్‌ ఏర్పాటుతో పట్టణంలోని పలు బస్తీల్లో విద్యుత్‌ వైర్ల సమస్యలు తీరనున్నాయి. పహాడినగర్‌, ప్రగతినగర్‌, విద్యానగర్‌, తారకరామానగర్‌, కిసాననగర్‌, తదితర బస్తీల్లోని ఇళ్ల మధ్యనే విద్యుత్‌ స్తంభాలు ఉండడం, ఆ మార్గంలో 33కేవీ విద్యుత్‌ లైన్లు వెళ్తుండడంతో ఆయా ప్రాంతాల ప్రజ లు నిత్యం భయం గుప్పెట ఉంటున్నారు. తేలిక పాటి వర్షాలు కురిసినా, ఈదుర గాలులు వీచినా ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయోనని ఆంధోళనతో ఉన్నారు. ఆ సమస్య పరిష్కరించాలని దీర్ఘకాలికంగా ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే విద్యుత్‌ వైర్ల కారణంగా ఆ మార్గంలో బహుళ అంతస్థుల భవనాల నిర్మాణాలు కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో పట్టణ ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో టవర్స్‌ ఏర్పాటుతో పాటు ఆయా బస్తీల్లో విద్యుత్‌ వైర్ల సమస్యలను నివారించే లక్ష్యంతో టవర్స్‌ ఏర్పాటు, స్పిన్నింగ్‌ మిల్‌ సమీపంలోని ఐడల్‌ సబ్‌ స్టేషన్‌ నుంచి కిసాన్‌ నగర్‌లోని సబ్‌ స్టేషన్‌ వరకు 33కేవీ వైర్ల ఏర్పాటుకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి చూపిన చొరవతో ధీర్ఘకాలికంగా ఉన్న సమస్య తీరనుంది.

టవర్ల ఏర్పాటుతో విద్యుత్‌ వైర్ల సమస్యలు దూరం

టవర్ల ఏర్పాటుతో భువనగిరి పట్టణంలో పలు విద్యుత్‌ సమస్యలు దూరం కానున్నాయి. ప్రధాన రహదారి వెంట ఎత్తైన టవర్స్‌ ఏర్పాటుతో సమీప ప్రాంతాల్లోని భవనాలకు విద్యుత్‌ వైర్లతో ఇబ్బందులు తొలగనున్నాయి. రహదారికి న్యూ లుక్‌ కూడా వస్తుం ది. అలాగే పలు బస్తీల్లో ధీర్ఘకాలికంగా భయపెడుతున్న విద్యుత్‌ స్తంభా లు, వైర్ల సమస్య శాశ్వతంగా తీరనుంది. టవర్లతో పాటు నూతన కేబు ల్స్‌ను ఏర్పాటు చేస్తుండడంతో తెగి పడే, కిందికి వేలాడే ముప్పు కూడా తప్పనుంది. గడువులోపు పనులు పూర్తి చేస్తాం.

సగ్గు హరినాథ్‌, ట్రాన్స్‌కో భువనగిరి టౌన్‌, ఏఈ.

Updated Date - 2023-05-26T00:34:06+05:30 IST