ఎడమకాల్వ లైనింగ్‌ పనులకు మోక్షం

ABN , First Publish Date - 2023-03-31T00:05:03+05:30 IST

ప్రపంచబ్యాంకు నిధులతో ఆధునికీకరించిన సాగర్‌ ఎడమకాల్వ మరమ్మతుల పనుల్లో అసంపూర్తి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు నిధులు మంజూరు చేసి దెబ్బతిన్న కాల్వ లైనింగ్‌ పనులు చేపట్టేందుకు టెండర్‌ ప్రక్రియ పూర్తిచేసి ఒప్పందం ఖరారుచేసింది.

ఎడమకాల్వ లైనింగ్‌ పనులకు మోక్షం
నేరేడుచర్ల మండలం మేడారం వద్ద దెబ్బతిన్న ఎడమకాల్వ లైనింగ్‌

టెండరు, అగ్రిమెంట్‌ ప్రక్రియలు పూర్తి

కాల్వకు నీటి విడుదల నిలిచాక పనులు

నడిగూడెం, మార్చి 30 : ప్రపంచబ్యాంకు నిధులతో ఆధునికీకరించిన సాగర్‌ ఎడమకాల్వ మరమ్మతుల పనుల్లో అసంపూర్తి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు నిధులు మంజూరు చేసి దెబ్బతిన్న కాల్వ లైనింగ్‌ పనులు చేపట్టేందుకు టెండర్‌ ప్రక్రియ పూర్తిచేసి ఒప్పందం ఖరారుచేసింది. 2008 నుంచి 2018 వరకు రూ.4,444కోట్లతో ఎడమకాల్వ ఆధునికీకరణ పనులు చేపట్టగా అప్పట్లో లైనింగ్‌ బాగుందని వదిలేశారు. అయితే ఆయా చోట్ల లైనింగ్‌ దెబ్బతినడంతో పనులను చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. 70.52 కిలోమీటర్ల నుంచి 115.4కిలోమీటర్ల వరకు 44 కిలో మీటర్ల మేర కుడి, ఎడమ పక్కన లైనింగ్‌ చేపట్టనున్నారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం మొదలు సూర్యాపేట జిల్లా పెనపహాడ్‌, నేరేడుచర్ల, గరిడేపల్లి, చిలుకూరు, మునగాల హెడ్‌ రెగ్యులేటర్‌ వరకు పనులు చేపడతారు. ఇందుకోసం నిధుల అంచనా వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.ఎడమకాల్వ నీటివిడుదల నిలిపేశాక పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్నెస్పీ అధికారులు తెలిపారు.

పనుల నిర్వహణకు ప్రతిపాదనలు

మునగాల హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి కింద చేపట్టాల్సిన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. మునగాల హెడ్‌ రెగ్యులరేటర్‌ నుంచి నడిగూడెం మండలం కాగితరామచంద్రపురం పరిధిలోని వరకు (రంగుల వంతెన) మరమ్మతులు చేపట్టేలా ప్రతిపాదనలు రూపొందించినట్లు ఎన్నెస్పీ అధికారులు తెలిపారు. నల్లగొండ జిల్లా వేములపల్లి నుంచి మునగాల వరకు లైనింగ్‌ పనులను చేస్తూనే మునగాల నుంచి నడిగూడెం మండలంలో చేపట్టాల్సిన పనులపై విధివిధానాలు రూపొందిస్తున్నామని, ఈ వేసవిలో పనులను చేస్తామని ఎన్నెస్పీ అధికారి ఒకరు తెలిపారు.

Updated Date - 2023-03-31T00:05:03+05:30 IST