ఆరోనెలలో గర్భస్రావం

ABN , First Publish Date - 2023-01-29T00:57:31+05:30 IST

జిల్లా కేంద్రం భువనగిరిలోని ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రంలో ఐవీఎఫ్‌ విధానంలో గర్భం దాల్చిన ఓ మహిళకు ఆరో నెలలోనే గర్భస్రావం అయ్యింది.

 ఆరోనెలలో గర్భస్రావం

సంతాన సాఫల్య కేంద్రం ఎదుట బంధువుల ఆందోళన

భువనగిరి టౌన్‌, జనవరి 28: జిల్లా కేంద్రం భువనగిరిలోని ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రంలో ఐవీఎఫ్‌ విధానంలో గర్భం దాల్చిన ఓ మహిళకు ఆరో నెలలోనే గర్భస్రావం అయ్యింది. బాధిత మహిళ భర్త ఉపేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిథిలోని అనాజీపురానికి చెందిన ఉపేందర్‌, నవ్య దంపతులు ఉపాధి నిమిత్తం భువనగిరిలో నివాసం ఉంటూ ఆన్‌లైన్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం ఆ సంతాన సాఫల్య కేంద్రంలోనే ఐవీఎఫ్‌ విధానంలో నవ్య ఆడ శిశువుకు జన్మనిచ్చింది. రెండో కాన్పు కూడా ఆ ఆసుపత్రిలోనే ఐవీఎఫ్‌ విధానంలో గర్భం దాల్చింది. అయితే పలు వైద్య పరమైన కారణాలతో ఆమె గర్భంలోనే ఆరు నెలల మగ శిశువు మృతి చెందడంతో శుక్రవారం అర్ధరాత్రి పట్టణంలోని మరో ఆసుపత్రిలో ఆమెకు శస్త్ర చికిత్స చేసి, మృత శిశువును తొలగించారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులు శనివారం సంతాన సాఫల్య కేంద్రం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఆసుపత్రి ఎదుట స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నది. అయితే మధ్యవర్తుల ప్రమేయంలో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరినట్లు తెలిసింది.

Updated Date - 2023-01-29T00:59:25+05:30 IST