మేళ్లచెర్వు శంభులింగేశ్వరస్వామి జాతర పరిసమాప్తి
ABN , First Publish Date - 2023-02-23T00:36:43+05:30 IST
మహాశివరాత్రి సందర్భంగా సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలకేంద్రంలో నిర్వహించే శ్రీస్వయంభు శంభులింగేశ్వరస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ నెల 17న అంకురార్పణ జరిగిన ఉత్సవాలు బుధవారం రాత్రి నిర్వహించిన పవళింపు సేవతో ముగిశాయి.
అత్యంత వైభవంగా ఉత్సవాల నిర్వహణ
చివరి రోజు పవళింపు సేవ
కొనసాగుతున్న ఎద్దుల, కబడ్డీ పోటీలు
హుజూర్‌నగర్ / మేళ్లచెర్వు, ఫిబ్రవరి 22 : మహాశివరాత్రి సందర్భంగా సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలకేంద్రంలో నిర్వహించే శ్రీస్వయంభు శంభులింగేశ్వరస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ నెల 17న అంకురార్పణ జరిగిన ఉత్సవాలు బుధవారం రాత్రి నిర్వహించిన పవళింపు సేవతో ముగిశాయి. స్వామి వారిని అందంగా అలంకరించిన అర్చకులు ఆలయ ఆవరణలో పవళింపు సేవ నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ప్రతీ రోజూ లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. జాతరలో విద్యుద్దీపాలతో ప్రభలను ఏర్పాటు చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. మొదటి రోజునే గ్రామంలో సుమారు ఏడు లైటింగ్ ప్రభలు ఏర్పాటుచేశారు. రెడ్డి సంఘం ఆఽధ్వర్యంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు, చౌదరి, యాదవులు, నాయళ్లు, వడ్డెరరాజుల ఆఽధ్వర్యంలో లైటింగ్ ప్రభలు ఏర్పాటుచేశారు. ఆ ప్రభల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వీటిని వీక్షించేందుకు తరలివచ్చిన ప్రజలతో ఆ ప్రాంతం కిక్కిరిసింది. అదేవిధంగా 18న దేవాలయ ప్రాంగణంలో తొమ్మిది లైటింగ్ ప్రభలు ఆయా సంఘాలతో పాటు ఎస్సీ, ఎన్‌టీఆర్ అభిమానులు ప్రభలను ఏర్పాటుచేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ఒక్కరోజే సుమారు మూడు లక్షల మంది భక్తులు వచ్చారని అధికారులు అంచనా వేశారు. ఈ జాతరకు అదనపు ఆకర్షణగా ఎద్దుల పందేలను నిర్వహిస్తుంటారు. ఈ నెల 21న ఎద్దుల పందేలతో పాటు ప్రో కబడ్డీ పోటీలు ప్రారంభించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో శతచండీ విశ్వశాంతి మహాయాగం నిర్వహిస్తున్నారు. శ్రీమాతా ఛారిటబుల్ ట్రస్ట్, త్రిశక్త్యాత్మక చండీపీఠం పర్యవేక్షణలో నిర్వహిస్తున్న యాగంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొ ంటున్నారు.
సామాజిక సేవలో...
జాతరకు వచ్చే భక్తులు, ఎద్దుల పందేలకు వచ్చే వారి కోసం చలువ పందిళ్లు వేశారు. ఇదిలా ఉండగా మైహోం సిమెంట్స్ ఆధ్వర్యంలో మంచినీటి సౌకర్యం కల్పించారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి, ఎన్‌ఆర్‌ఐ సాముల జైపాల్‌రెడ్డి, ఓజో ఫౌండేషన్ చైర్మన పిల్లుట్ల రవి ఆధ్వర్యంలో ఐదు రోజులుగా బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నదానం చేస్తున్నారు.
పశుపోషకులకు ప్రత్యేక సన్మానం
తవిడిశెట్టి జ్యుయలరీస్ అధినేత, మేళ్లచెర్వుకు చెం దిన తవిడిశెట్టి నాగేశ్వరరావు పశుపోషకును సన్మా నించారు. జాతర సందర్భంగా నిర్వహిస్తున్న ఎద్దుల పందేల పోటీల్లో పాల్గొన్న పశుపోషకులకు రామ్‌రాజ్ కాటన పంచెలు, కండువాలతో సత్కరించారు.
భారీ స్థాయిలో ఉత్సవాలు
జాతర సందర్భంగా శివాలయం పరిసర ప్రాం తాల్లో రంగుల రాట్నాలు, బొమ్మల దుకాణాలను పెద్దఎత్తున ఏర్పాటుచేశారు. రాజకీయ పార్టీల నాయకులు పోటా పోటీగా అన్నదానాలు ఏర్పాటుచేశారు. జాతర మొత్తం నాయకుల స్వాగత బ్యానర్లతో నిండిపోయింది. వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన భక్తులు ఎద్దుల పందేలు, కబడ్డీ, డ్యాన్స్ పోటీలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో కబడ్డీ, ఎద్దుల పందేలను నిర్వహిస్తుండటంతో పాటు ఆలయ అభివృద్ధికి రూ.50 లక్షలు మం జూరు చేయించారు. ఆలయం చుట్టూ సీసీ రోడ్లు, ఆల యం లోపల శాశ్వత క్యూలైన్లు ఏర్పాటుచేయించారు.
నేడు హుండీ లెక్కింపు
మహాశివరాత్రి జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన హుండీలతో పాటు కార్తీక పౌర్ణమి అనంతరం నుంచి ఏర్పాటుచేసిన హుండీలను గురువారం ఉదయం 10 గంటల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో లెక్కించనున్నట్లు ఆలయ ఈవో కొండారెడ్డి తెలిపారు.