తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌

ABN , First Publish Date - 2023-09-22T00:21:41+05:30 IST

తాళం వేసిన ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆభరణాలు

దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగల అరెస్టు

నల్లగొండ టౌన్‌, సెప్టెంబరు 21: తాళం వేసిన ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. గురువారం జిల్లా ఎస్పీ అపూర్వరావు ఓ ప్రకటన విడుదల చేశారు. తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని మన్నాడి ప్రాంతానికి చెందిన ఇమ్రాన్‌ఖాన్‌ వృత్తిరీత్యా హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేసేవాడు. చెడు అలవాట్లకు బానిసై 2022లో చెన్నైలో రెండు ఆర్థిక నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటికి వచ్చి సినిమాల్లో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 13సంవత్సరాల క్రితం ఇంటి నుంచి పారిపోయిన మిర్యాలగూడ పట్టణంలోని శ్రీరామ్‌నగర్‌కు చెందిన సూర్య చెన్నైలో ఓ హోట్‌లో క్యాటరర్‌గా, జూనియర్‌ ఆర్టిస్టుగా పనిచేస్తుండేవాడు. కరోనా సమయంలో వీరిద్దరికి అక్కడ పరిచయమైంది. లాక్‌డౌన్‌ సమయం లో ఉపాధి లభించక అడపదడపా పనిచేయగా వచ్చే సంపాదన ఖర్చులకు కూడా సరిపోకపోవడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. చెన్నై ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడితే సులువుగా దొరికిపోతామని సూర్యకు తెలిసిన ప్రాంతాల్లో దొంగతనాలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. కొంతకాలంగా చౌటుప్పల్‌, అబ్దుల్లాపుర్‌మెట్‌, నార్కట్‌పల్లి, నకిరేకల్‌, నల్లగొండలోని తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రిపూట దొంగతనాలు చేసేవారు. ఈ నెల 5వ తేదీన నల్లగొండ పట్టణంలోని న్యూ సాయినగర్‌లో నివాసముంటున్న మారెడ్డి శ్రీనివా్‌సరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తన కుమార్తెను వరంగల్‌లోని నిట్‌ కళాశాలలో చేర్పించేందుకు ఇంటికి తాళం వేసి వెళ్లారు. గమనించిన నిందితులు రాత్రి సమయంలో తాళం పగులగొట్టి ఇంట్లోని ఆరు తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి, ల్యాప్‌టాప్‌ అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ నెల 20వ తేదీన నల్లగొండలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇమ్రాన్‌ఖాన్‌, సూర్యలను అదుపులోకి తీసుకుని విచారించగా, చౌటుప్పల్‌, అబ్దుల్లాపుర్‌మెట్‌, నార్కట్‌పల్లి, నకిరేకల్‌లో మొత్తం 21 దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. నిందితుల నుంచి రూ.14.20లక్షల విలువైన 20 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి ఆభరణాలు, ల్యాప్‌టాప్‌, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ జితేందర్‌రెడ్డి, వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణలు కేసు పరిశోధనలో చొరవ చూపినందుకు ఎస్పీ అభినందించారు.

Updated Date - 2023-09-22T00:21:41+05:30 IST