కందులు క్వింటా ధర రూ.7,559

ABN , First Publish Date - 2023-02-14T00:49:42+05:30 IST

: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో కందులకు రికార్డు స్థాయి ధర పలికింది.

కందులు క్వింటా ధర రూ.7,559
తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌కు వచ్చిన కందులు

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో గణనీయమైన ధరలు

తిరుమలగిరి, ఫిబ్రవరి 13: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో కందులకు రికార్డు స్థాయి ధర పలికింది. సోమవారం మార్కెట్‌కు కందులు తీసుకురాగా క్వింటా ధర రూ.7,559లు పలికింది. గత ఏడాది సుమారు రూ.5వేల నుంచి రూ.7వరకు పలికిన ధరలు, ఈ ఏడాది రూ.6వేల నుంచి రూ.7వేల పైచిలుకు నమోదవుతున్నాయి. తిరుమలగిరి మార్కెట్‌కు సోమవారం 245 క్వింటాళ్ల కందులు వచ్చాయి. తిరుమలగిరి మండలంలోని మాలిపురం గ్రామానికి చెందిన రైతు ఆమనగంగి సోమయ్య తెచ్చిన కందులకు క్వింటా ధర రూ. 7,559 లభించింది. కనిష్టంగా రూ.6,339 ధర పలికింది. మద్దతు ధర రూ.6,600 కాగా, అంతకుమించి ధర వస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఈ ధర అత్యధికంగా, మార్కెట్‌ చరిత్రలోనే ఆల్‌టైం రికార్డు ధర పలికిందని మార్కెట్‌ అదికారులు తెలిపారు. గత ఏడాది 28వేల క్వింటాళ్ల కందులు కొనుగోలు చేశామని, గరిష్ఠ ధర రూ.6,900లు పలికిందని, ఈ ఏడాది జనవరి సీజన్‌ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 9800 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేసినట్లు మార్కెట్‌ కార్యదర్శి శ్రీధర్‌ తెలిపారు. తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో వేరుశనగ కూడా రికార్డు స్థాయిలో రూ.8,269 ధర పలికింది. ఇక్కడి మార్కెట్‌లో అధిక ధరలు నమోదవ్వడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు, సరిహద్దు జిల్లా ప్రాంతాలైన దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి, తొర్రూర్‌ మండలాల నుంచి రైతులు తమ పంటలను తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొస్తున్నారు.

చాలా సంతోషంగా ఉంది

తిరుమలగిరి మార్కెట్‌కు మూడు క్వింటాళ్ల కందు లు తీసుకొచ్చా. క్వింటాకు రూ.7,559లు ధర పలికినం దుకు సంతోషంగా ఉంది. గతేడాది మార్కెట్‌లో క్విం టా ధర రూ.5,800లు పలికింది. కూలీల రేట్లు, మిషన్‌ ధరలు భరించలేక మా కుటుంబసభ్యులమే పంట కోసి తీసుకొచ్చాం.

ఆమనగంగి సోమయ్య రైతు, తిరుమలగిరి మండలం మాలిపురం గ్రామం.

సూర్యాపేట మార్కెట్‌లో క్వింటా ధర రూ.7,434

సూర్యాపేట సిటీ: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో కందుల ధర రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. రెండు రోజులుగా వ్యాపారస్థులు ఎక్కువ ధరలు కోడ్‌ చేస్తున్నారు. మార్కెట్‌లో రూ.7 వేల కంటే ఎక్కువ ధరలు వస్తుండడంతో రైతులు సూర్యాపేట మార్కెట్‌ బాట పడుతున్నారు. తాజాగా సోమవారం మార్కెట్‌కు 55 మంది రైతులు 318బస్తాల కందులను తీసుకువచ్చారు. కందులకు వ్యాపారులు అత్యధిక ధర రూ.7,434లు కోడ్‌ చేయగా, తక్కువ ధర రూ.5,697ల ధరలు నిర్ణయించారు. నాణ్యమైన కందులు మార్కెట్‌కు వస్తుండటంతో వ్యాపారులు ఎక్కువ ధరలు కేటాయిస్తున్నారని మార్కెట్‌ కార్యదర్శి ఎండీ. ఫసియోద్ధీన్‌ తెలిపారు.

Updated Date - 2023-02-14T00:49:43+05:30 IST