నేత్రపర్వంగా శివపార్వతుల కల్యాణం
ABN , First Publish Date - 2023-02-18T00:19:33+05:30 IST
యాదగిరికొండపైన అనుబంధ శివాలయంలో శుక్రవారం రాత్రి శివపార్వతుల కల్యాణం కన్నుల పండువగా సాగింది. శివాలయ మహామండపంలో పార్వతీ, పరమేశ్వరులను పట్టువసా్త్రలు,
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి17: యాదగిరికొండపైన అనుబంధ శివాలయంలో శుక్రవారం రాత్రి శివపార్వతుల కల్యాణం కన్నుల పండువగా సాగింది. శివాలయ మహామండపంలో పార్వతీ, పరమేశ్వరులను పట్టువసా్త్రలు, బంగారు, ముత్యాలు, వజ్రాభరణాలు, వివిధ రకాల పూలమాలలతో దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేకసేవలో తీర్చిదిద్దారు. అలంకార సేవ, శివపార్వతుల కల్యాణ పట్టువసా్త్రలను వేదమంత్ర పఠనాలు, మంగళవాయిద్యాలతో తిరువీధుల్లో ఊరేగించిన అర్చకులు శివాలయ బాహ్యప్రాకార మండపంలోని నూతన కల్యాణమండపంలో వేదికపై అధిష్ఠింపజేశారు. సకల విఘ్నాధిపతి విఘ్నేశ్వరుడికి తొలిపూజలతో అర్చకులు కల్యాణతంతు ప్రారంభించారు. దేవస్థాన అధికారులు నూతన వధూవరులు పర్వతవర్ధినీ అమ్మవారు, రామలింగేశ్వరుడికి కల్యాణ పట్టువసా్త్రలను అందజేశారు. పరమేశ్వరుడికి యజ్ఞోపవీతధారణ పర్వాలు జరిపిన అర్చకులు జీలకర్రబెల్లం, కన్యాదానతంతు నిర్వహించారు. వేదపండితులు నిర్ణయించిన సుముహూర్తంలో అమ్మవారి మెడలో పరమేశ్వరుడు మాంగల్యధారణ చేశారు. స్వామి, అమ్మవార్ల శిరస్సులపై ముత్యాల తలంబ్రాలను అర్చక, వేద పండితులు వేదోక్త పఠనాల నడుమ అలంకరింపజేసే ఆధ్యాత్మిక ఘట్టాలు భక్తుల జయజయ ధ్వానాల నడుమ వైభవంగా కొనసాగాయి. శివపార్వతుల కల్యాణ వేడుకలను దేవస్థాన పురోహితులు గౌరీభట్ల సత్యనారాయణశర్మ, శివాలయ ప్రధానార్చకులు గౌరీభట్ల నరసింహరామశర్మ, అర్చకబృందం, వేదపండితులు నిర్వహించగా.. ఆలయ అనువంశిక ధర్మకర్త బీ.నరసింహమూర్తి, ఇనచార్జి ఈవో రామకృష్ణారావు, డీఈవో దోర్భల భాస్కరశర్మ, ఏఈవో గజవెల్లి రమేశబాబు, పర్యవేక్షకులు శంకర్‌నాయక్, సిబ్బంది, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
శాస్త్రరీతిలో రుద్రహవనం
శివాలయ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం రుద్ర హవనం, ప్రత్యేక పూజలు శైవాగమ శాస్త్రరీతిలో కొనసాగాయి. ఉదయం ప్రధానాలయంలో కొలువుదీరిన పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరుడిని, మహామండపంలోని స్ఫటికమూర్తులను ఆరాధించారు. అర్చకబృందం, వేదపండితులు శివపంచాక్షరీ జపాలు, నందీశ్వర పారాయణం, పంచసూక్త, మూలమంత్ర జప పఠనం, వేద ఇతిహాస పారాయణాలు చేశారు. అనంతరం యాగశాలలో ఉదయం 9గంటల నుంచి 10.30గంటల వరకు రుద్ర హవనం కొనసాగింది. సాయంకాలం నమక, చమక, వేద ఇతిహాస పారాయణాలు, సోమకుంభార్చనలు నిర్వహించారు.
నేత్రపర్వంగా ఆండాళ్ అమ్మవారి ఊంజల్ సేవ
యాదగిరీశుడి సన్నిధిలో శుక్రవారం స్వామికి సువర్ణ పుష్పార్చనలు, ఆండాళ్ అమ్మవారి ఊంజల్ సేవాపర్వాలు నేత్రపర్వంగా సాగాయి. సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన అర్చకులు గర్భాలయంలోని సువర్ణ ప్రతిష్ఠా అలంకార కవచమూర్తులను 108 బంగారు పుష్పాలతో అర్చించారు. స్వయంభువులను వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ అభిషేకించి తులసీదళాలతో అర్చించారు. ప్రాకార మండపంలో హోమం, నిత్యతిరుకల్యాణపర్వాలు ఆగమ శాస్త్రరీతిలో కొనసాగాయి. సాయంత్రంవేళ ప్రధానాలయంలో కొలువుదీరిన ఆండాళ్ అమ్మవారి ఊంజల్ సేవోత్సవాలు నేత్రపర్వంగా సాగాయి. ఆండాళ్ అమ్మవారిని పట్టువసా్త్రలు, బంగారు, ముత్యాలు, వజ్రాభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించిన అర్చకులు ఊంజల్ సేవలో తీర్చిదిద్ది తిరువీధుల్లో ఊరేగించి అద్దాల మండపంలో వేదమంత్ర పఠనాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాలు, మహిళా భక్తుల మంగళ నీరాజనాల నడుమ ఊంజల్ సేవోత్సవం నేత్రపర్వంగా సాగింది. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.16,78,356 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.
సీఎం కేసీఆర్ పేరిట సుదర్శన హోమ పూజలు
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిపించారు. ఆమె సీఎం కేసీఆర్ దంపతుల పేరిట సంకల్ప పూజలతో గర్భాలయంలో ప్రభాతవేళ మూలమూర్తులకు నిజాభిషేకం, ముఖమండపంలో ఉత్సవమూర్తుల వద్ద సువర్ణపుష్పార్చన పూజలు, ఆలయ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నారు. కొండకింద వైకుంఠద్వారం వద్ద కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక్‌కట్ చేసి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, గుట్ట మునిసిపల్ చైర్‌పర్సన ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్, ఆలేరు మార్కెట్ చైర్మన గడ్డమీది రవీందర్‌గౌడ్, పట్టణ అధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధర్‌గౌడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.
దేవాదాయశాఖ మంత్రికి బ్రహ్మోత్సవ ఆహ్వానం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని దేవస్థాన ఇనచార్జి ఈవో రామకృష్ణారావు కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు.