నేనే రాజు.. నేనే మంత్రి

ABN , First Publish Date - 2023-06-26T00:49:17+05:30 IST

అది మిర్యాలగూడ డివిజన్‌లో ఓ మండలంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల. ఆ కళాశాలలో ప్రిన్సిపాల్‌ ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. నేనే రాజు.. నేను మంత్రి అనేలా ఆయన వ్యవహార శైలి ఉంది. తోటి అధ్యాపకులను, ప్రధానంగా మహిళా అధ్యాపకుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న సదరు ప్రిన్సిపాల్‌ వేధింపులు తట్టుకోలేకపోతున్నారు.

నేనే రాజు.. నేనే మంత్రి

ఓ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ అరాచకం

మహిళా అధ్యాపకులకు వేధింపులు

భరించలేక ఓ కాంట్రాక్టు లెక్చరర్‌ ఆత్మహత్యాయత్నం

రెండు నెలల క్రితం బదిలీ చేయించుకున్న మహిళా లెక్చరర్‌

అయినా ఆమెకు తప్పని కష్టాలు

నల్లగొండ, జూన్‌ 25: అది మిర్యాలగూడ డివిజన్‌లో ఓ మండలంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల. ఆ కళాశాలలో ప్రిన్సిపాల్‌ ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. నేనే రాజు.. నేను మంత్రి అనేలా ఆయన వ్యవహార శైలి ఉంది. తోటి అధ్యాపకులను, ప్రధానంగా మహిళా అధ్యాపకుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న సదరు ప్రిన్సిపాల్‌ వేధింపులు తట్టుకోలేకపోతున్నారు. సూర్యాపేట జిల్లాలోని ఓ మండలంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విధులు నిర్వహించిన సదరు ప్రిన్సిపాల్‌ ఆ తర్వాత మిర్యాలగూడ డివిజన్‌కు బదిలీపై వచ్చాడు. ఉన్నతాధికారుల అండ ఉందంటూ, తనను ఎవ్వరూ ఏమీ చేయలేరని, చెప్పినట్టు వినాలని వేధిస్తుండడంతో అధ్యాపకులు భయబ్రాంతులకు గురవుతున్నారు. అనుకూలంగా ఉన్న వారు డ్యూటీకి సక్రమంగా రాకున్నా, ఆలస్యంగా వచ్చినా ఏమీ అనని ప్రిన్సిపాల్‌ తాను టార్గెట్‌ చేసిన వారిని మాత్రం ఇబ్బందులకు గురిచేయడం నిత్యకృత్యమైంది. నోటికి వచ్చిన విధంగా దుర్భాషలాడటం, బూతులు సైతం మాట్లాడుతుండటంతో మహిళా అధ్యాపకులు భరించలేకపోతున్నారు.

ఆత్మహత్యాయత్నం చేసిన కాంట్రాక్టు లెక్చరర్‌

సదరు ప్రిన్సిపాల్‌ బాధలు భరించలేక ఓ మహిళా కాంట్రాక్టు లెక్చరర్‌ డీఐఈవో, కమిషనర్‌, ఆర్‌జేడీకి ఫిర్యాదు చేసింది. వారు విచారణ కూడా ఆదేశించారు. అయినా అతడి ఆగడాలు ఆగకపోవడంతో సదరు మహిళా లెక్చరర్‌ కొన్ని నెలల క్రితం ఓ కాల్వలోకి దూకి ఆత్మహత్యకు యత్నించగా, అటుగా పెట్రోలింగ్‌కు వచ్చిన ఓ ఎస్‌ఐ ఆమెను కాపాడారు. ఆ సమయంలో ఆమె బాధలను విన్న ఎస్‌ఐ వివరాలు తీసుకొని ప్రిన్సిపాల్‌పై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత షీటీంతో పాటు ఎస్పీ, కలెక్టర్‌కు, ఇతర అధికారులకు ఫిర్యాదు చేయడంతో ప్రిన్సిపాల్‌ రాజీధోరణికి వచ్చి సదరు లెక్చరర్‌ జోలికి వెళ్లనని, షీటీంకు స్వయంగా లేఖ రాసిచ్చారు. కాగా, ఆ తర్వాత కూడా వేధింపులు ఆగకపోవడంతో ఉన్నతాధికారులకు ఆమె మరోసారి ఫిర్యాదు చేసింది. అయినా ఫలితం లేకపోవడంతో ఆమె ఆ కళాశాల నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేయించుకుని వెళ్లింది. ఇటీవల అడ్వాన్స్డ్‌ సప్లమెంటరీ పరీక్ష స్పాట్‌ ఆర్డర్‌ రాగా, ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడంతో ఆమె ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయం ఎదుట ధర్నాకు దిగడంతో ఆర్డర్‌ ఇచ్చారు. గతంలో ఓ కళాశాలలో పనిచేసి బదిలీపై వెళ్లిన వారికి స్పాట్‌ ఆర్డర్‌ ఇచ్చేలా నిబంధనలు ఉన్నా కావాలనే ఇబ్బందులకు గురి చేసినట్లు తెలుస్తోంది. ప్రిన్సిపాల్‌ నుంచి తనకు ప్రాణహాని ఉందని అధికారులకు ఆమె ఫిర్యాదు చేసింది.

కమిషనర్‌కు నివేదిక పంపాం : దస్రునాయక్‌, నల్లగొండ డీఐఈవో

ప్రిన్సిపాల్‌పై వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ నిర్వహించాం. చాలా రోజుల క్రితమే కమిషనర్‌కు నివేదిక కూడా పంపాం. బాధిత లెక్చరర్‌ ఇచ్చిన ఫిర్యాదుకు అనుగుణంగానే విచారణ నిర్వహించి పూర్తి నివేదికను రాష్ట్ర అధికారులకు పంపాం.

-

Updated Date - 2023-06-26T00:49:17+05:30 IST