Share News

ఇన్‌చార్జీల పాలన ఇంకెన్నాళ్లో?

ABN , Publish Date - Dec 18 , 2023 | 12:41 AM

కొత్త జిల్లాలు.. నూతన కలెక్టరేట్‌ భవనాలు.. ప్రజలకు చేరువగా పరిపాలన వ్యవస్థ.. ఇదంతా ఒక ఎత్తయితే.. పలు శాఖల నుంచి సరైన సమాచారం అందడం ఇంకో ఎత్తవుతోంది. ఆయా శాఖలకు పూర్తిస్థాయి అధికారులు లేక లబ్ధిదారులకు అరకొర సమాచారమే అందుతోంది.

ఇన్‌చార్జీల పాలన ఇంకెన్నాళ్లో?

తాత్కాలిక అధికారులతో అరకొర సమాచారమే

అభివృద్ధి, సంక్షేమానికి దూరమవుతున్న లబ్ధిదారులు

భువనగిరి అర్బన్‌, డిసెంబరు 17: కొత్త జిల్లాలు.. నూతన కలెక్టరేట్‌ భవనాలు.. ప్రజలకు చేరువగా పరిపాలన వ్యవస్థ.. ఇదంతా ఒక ఎత్తయితే.. పలు శాఖల నుంచి సరైన సమాచారం అందడం ఇంకో ఎత్తవుతోంది. ఆయా శాఖలకు పూర్తిస్థాయి అధికారులు లేక లబ్ధిదారులకు అరకొర సమాచారమే అందుతోంది. టార్గెట్లు పూర్తి చేసేందుకు సొంత శాఖల్లో పనికే సమయభావం, పనిభారం పడుతుంటంతో ఇతర శాఖల అదనపు బాధ్యతలు కేటాయించడంతో అధికారులు సతమతమవుతున్నారు. దీంతో అధికారుల చొరవ తగ్గుముఖం పట్టి ఇన్‌చార్జీగా కొనసాగుతున్న శాఖలకు న్యాయం చేయలేకపోతున్నారు. ఫలితంగా పరిపాలన వ్యవస్థ లబ్ధిదారులకు దూరమవుతోందని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

ఇన్‌చార్జీలు వీరే

జిల్లాలో గిరిజన, మహిళ, శిశు సంక్షేమ, మైనార్టీ శాఖల్లో సుమారు ఏడాది కాలంగా ఇన్‌చార్జీ పాలన కొనసాగుతోంది. గిరిజనశాఖకు చెందిన అధికారి మంగ్తానాయక్‌ బదిలీ తర్వాత ఈ శాఖకు ఇప్పటి వరకు పూర్తిస్థాయి అధికారిని నియమించలేదు. డీఆర్డీవో మందడి ఉపేందర్‌రెడ్డి ఈ శాఖకు ఇన్‌చార్జీగా కొంత కాలం కొనసాగారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌ టూరిజం శాఖకు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో డీఆర్గీవోగా టి.నాగిరెడ్డి నియమితులు కాగా, గిరిజన శాఖకు ఇన్‌చార్జీగా గత కలెక్టర్‌ పమేలా సత్పథి నియమించారు. అప్పటి నుంచి ఆయనే ఈ శాఖకు ఇన్‌చార్జీగా కొనసాగుతున్నారు. మహిళా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి నల్లగొండకు బదిలీ కాగా, ఆమె స్థానంలో ఉద్యావనశాఖ అధికారి జి.అన్నపూర్ణకు ఇన్‌చార్జీగా బాధ్యతలు ఇచ్చారు.మైనార్టీశాఖ అధికారి సత్యనారాయణ హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయానికి బదిలీపై వెళ్లగా, ఈ ఏడాది జనవరి నుంచి ఆ శాఖకు బీసీ సంక్షేమ అధికారి పి.యాదయ్య ఇన్‌చార్జీగా కొనసాగుతున్నారు.

సమాచారం అందడం లేదు

ఇన్‌చార్జీల పాలనలో కింది స్థాయి అధికారులు, ఉద్యోగులు, సిబ్బం ది లబ్ధిదారులకు తగిన న్యాయం చేయలేకపోతున్నారు. సమయాభావంతో ఫైళ్లు పెండింగ్‌లో పడుతున్నాయి. ఫైళ్లను పరిశీలించేందుకు ఇన్‌చార్జీ అధికారి కార్యాలయానికి సిబ్బంది మోసుకెళ్తున్నారు. దీంతో ఫైళ్ల పరిశీలన, సంబంధించిన సమాచారం లబ్ధిదారులకు అందడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న వివిధ పథకాలకు సంబంధించి లబ్ధిపొందేందుకు కలెక్టరేట్‌కు తరలివచ్చిన అర్హులు ఇన్‌చార్జీ అధికారులు అందుబాటులో లే క వెనుదిరుగుతున్నారు. ఈ ఇబ్బందులు తొలగించేందుకు త్వరలో శాశ్వత అధికారులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.

సరైన సమాచారం అందడంలేదు : ఉప్పు కృష్ణ, చౌటుప్పల్‌

ఇన్‌చార్జీలతో శాఖలకు సంబంధించిన సమాచా రం లబ్ధిదారులకు చేరడం లేదు. ఇప్పటికే సంవత్సరం కాలంగా ఇన్‌చార్జీలు కొనసాగుతున్న పలు శాఖలకు తక్షణమే శాశ్వత అధికారులను నియమించాలి. అప్పుడే ప్రభుత్వం అందజేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు సకాలంలో లబ్ధిదారులకు చేరుతా యి. అధికారులు కూడా బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తారు. ప్రజలకు చేరువగా ఉంటుందని జిల్లాల పునర్విభజన చేసి కొత్తగా సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని అందుబాటులోకి తెచ్చినా, ప్రభుత్వం ఆశించి స్థాయిలో ఫలితాలు దక్కాలంటే శాశ్వత అధికారులను నియమించాలి.

అభివృద్ధి, సంక్షేమం మరింత దూరం : మక్కల దుర్గయ్య, రామాజీపేట, యాదగిరిగుట్ట

అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు మరింత దూరమవుతోంది. కేటాయించిన శాఖలకు చెందిన అధికారులు సమయాభావం, పనిభారం చేత ఇన్‌చార్జీలుగా కొనసాగుతున్న శాఖలకు సమయం ఇవ్వలేకపోతున్నారు. ఫైళ్లు, ఉన్నతాధికారులకు అందజేయాల్సిన నివేదికలు సమర్పణకు అలస్యం అవుతోంది. ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న శాఖలకు సంబంధించి కింది స్థాయి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది బాధ్యతయుతంగా లబ్ధిదారులకు సకాలంలో సమాచారం ఇవ్వడం లేదు.

పూర్తిస్థాయి అధికారులను నియమించాలి : నంద అయిలయ్య, కుర్రారం, రాజపేట

జిల్లాలో వివిధ రంగాల్లో అభివృద్ధి, సంక్షేమం సమృద్ధిగా సాధించాలంటే అన్ని శాఖలకు పూర్తిస్థాయి అధికారులను నియమించాలి. ఇలా అదనపు బాధ్యతలు అప్పగిస్తే సొంత శాఖలకే ప్రాధాన్యం ఇచ్చి ఇన్‌చార్జీలుగా కొనసాగుతున్న శాఖలను అంతగా పట్టించుకోవడం లేదు. దీంతో ఆయా శాఖల లక్ష్యం నీరుగారుతోంది. కలెక్టరేట్‌కు వచ్చిన ప్రజలకు అందుబాటులో లేని అధికారులతో లబ్ధిదారులు అభివృద్ధి, సంక్షేమానికి దూరమతున్నారు.

Updated Date - Dec 18 , 2023 | 12:41 AM