గత వైభవం కోసం ఆశగా..

ABN , First Publish Date - 2023-09-29T00:37:03+05:30 IST

ఒకప్పుడు పంచాయతీ సమితిగా, నియోజకవర్గం కేంద్రంగా విలసిల్లిన రామన్నపేట నేడు మండల కేంద్రానికి పరిమితమైంది.

 గత వైభవం కోసం ఆశగా..
రామన్నపేటలోని ఏరియా ఆసుపత్రి

నేడు రామన్నపేటకు మంత్రులు హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి రాక

రామన్నపేట, సెప్టెంబరు 28 : ఒకప్పుడు పంచాయతీ సమితిగా, నియోజకవర్గం కేంద్రంగా విలసిల్లిన రామన్నపేట నేడు మండల కేంద్రానికి పరిమితమైంది. నియోజకవర్గాల పునర్విభజనతో తన అస్థిత్వాన్ని కోల్పోయి, జిల్లాల పునర్విజనతో రెండు జిల్లాల్లో విస్తరించి నేడు అభివృద్ధిలో వెనకబడి పోయింది. కనీసం ఇప్పుడైనా రెవెన్యూ డివిజన కేంద్రంగా ప్రకటించి, ప్రస్తుత ఆసుపత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్‌, ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి కాల్వల భూసేకరణ, కాళేశ్వరం జలాలు, మెడికల్‌ కళాశాల మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు. శుక్రవారం రాష్ట్ర మంత్రులు హరీ్‌షరావు, జగదీ్‌షరెడ్డి పర్యటనల నేపథ్యంలో ఆ దిశగా అడుగులు పడాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ క్రమం

రామన్నపేట 1954లో పంచాయతీ సమితిగా ఏర్పడింది. ఇందులో చౌటుప్పల్‌, వలిగొండ, రామన్నపేట మండలాలు ఉండేవి. అనంతరం 1981లో చౌటుప్పల్‌, రామన్నపేట, వలిగొండ మండలాలతో పాటు చిట్యాల మండలంలోని ఎనిమిది గ్రామాను కలిపి తాలుకాగా ఏర్పాటుచేశారు. 1957లో రామన్నపేట నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటైంది. జీవనదిగా అలరారుతున్న మూసీ పరివాహక ప్రాంతంలోని వలిగొండ, ఆత్మకూరు(ఎం), మోత్కూరు, గుండాల, రామన్నపేట మం డలాలను కలిపి నియోజకవర్గం కేంద్రం ఏర్పడింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీల నాయకులే ఎమ్మెల్యేలుగా గెలిచారు.ఈ ప్రాంతానికి చెందిన కొమ్ము పాపయ్య, ఉప్పునూతల పురుషోత్తంరెడ్డిలు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మం త్రులుగా పనిచేశారు. పురుషోత్తంరెడ్డి చొరవతో రామన్నపేటలో ప్రభుత్వజూనియర్‌, డిగ్రీ కళాశాలలు ఏర్పాటయ్యాయి.

100 పడకలకు నోచని ఆసుపత్రి

రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎందరికో సేవలందించింది. ఈ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రికి అప్‌గ్రేడ్‌ చేయాలని స్థానికులు 2007 నుంచే డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం 30పడకల ఆసుపత్రి నుంచి 50పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేసింది. శుక్రవారం మం త్రులు హరీ్‌షరావు, జగదీ్‌షరెడ్డిలు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అయితే రామన్నపేట, చిట్యాల, వలిగొండ, ఆత్మకూరు(ఎం) మండలాల ప్రజలు ఈ ఆసుపత్రికి పెద్దసంఖ్యలో వైద్యం కోసం వస్తుంటారు. ప్రస్తుతం 22మంది వెద్యులు ఉండాల్సి ఉండగా కేవలం ముగ్గురే సేవలందిస్తున్నారు. జనరల్‌ ఫిజీషియన, కార్డియో, ఆర్థో, న్యూరో, ఆప్తమాలజీ, మత్తు డాక్టర్‌, ఫిజియోథెరపీ వంటి వైద్యసేవలు అందుబాటులో లేవు. 100 పడకలకు అప్‌గ్రేడ్‌ చేసి వైద్యసిబ్బందిని, సౌకర్యాలను కల్పించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. అదేవిధంగా మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

కరోనాతో నిలిచిన సేవలు

రామన్నపేట రైల్వేస్టేషనలో కరోనాకు ముందు నారాయణాద్రి, హౌరా, రేపల్లె, జన్మభూమి వంటి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలిపేవారు. ప్రస్తుతం రేపల్లె, డెమో మినహా ఏ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగడం లేదు. నిత్యం వందలాది మంది యువకులు, విద్యార్థులు, ప్రయాణికులు ఈ స్టేషన నుంచి రాజధానికి రాకపోకలు సాగిస్తున్నారు. గతంలోలా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను స్టేషనలో నిలపాలని ప్రజలు కోరుతున్నారు.

సాగునీటికి నిధులేవీ?

సాగనీటి పరంగా రామన్నపేట మండలంలో కొన్నిగ్రామాలు మూసీ పరివాహకంలోని ఆసి్‌ఫనెహర్‌ కాల్వ కింద ఉన్నాయి. ఈ కాల్వ నీటితో చెరువులు నిండడంతో అవి సమృద్ధిగా ఉన్నాయి. మిగతా సగానికిపైగా గ్రామాలు పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి కాల్వల్లో సాగునీటికోసం ఎదురుచూస్తున్నాయి. ఈ మండలానికి కాళేశ్వరం జలాలు అందాల్సి ఉంది. కాల్వల భూసేకరణ వద్ద పనులు నిలిచాయి. మిషన భగీరథ పథకం ద్వారా తాగునీరు సైతం అందడం లేదని ప్రజలు తెలిపారు.

డివిజన, నియోజకవర్గం కేంద్రం కావాలని..

రామన్నపేట నియోజకవర్గం 2009లో రద్దయిన తర్వాత ఇక్కడి ప్రజల్లో నైరాశ్యం నెలకొంది. నకిరేకల్‌ నియోజకవర్గంలో మండలాలు నల్లగొండ జిల్లాలో ఉంటే రామన్నపేట మండలం యాదాద్రిభువనగిరి జిల్లాలో ఉంది. రామన్నపేట, చౌటుప్పల్‌, సంస్థాన నారాయణపురం మండలాలను కలిసి రామన్నపేట కేంద్రంగా నియోజకవర్గం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచి రామన్నపేటలో ఆర్డీవో కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. నూతనంగా ఏర్పాటవుతున్న అమ్మనబోలు మండలాన్ని యాదాద్రిభువనగిరి జిల్లాలో కలిపి అమ్మనబోలు, మోత్కూరు, అడ్డగూడూరు, ఆత్మకూరు(ఎం), గుం డాల మండలాలను కలిసి రెవెన్యూ డివిజన కేంద్రంగా ఏర్పాటుచేయాలని స్థానికులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధి కోసం

విద్యావంతులైన అనేకమంది యువకులు ఉపాధిలేక హైదరాబాద్‌ ముంబాయి, చైన్నె నగరాలకు వలసపోతున్నారు. వాటిని నివారించేందుకు మండలంలో ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

రోడ్డు విస్తరణతో మారనున్న రూపురేఖలు

మండల కేంద్రంలోని బస్టాండ్‌లోని ఖాళీస్థలాన్ని, ఆసుపత్రిలోని రోడ్డు వెంట ఉన్న స్థలాన్ని షాపింగ్‌ కాంప్లెక్స్‌లుగా మార్చడంతో పట్టణానికి కొత్తశోభ వచ్చింది.ఇటీవల ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చొరవతో పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు చురుకుగా సాగుతున్నాయి. డివైడర్‌ను ఏర్పాటుచేసి లైటింగ్‌ వ్యవస్థను ఏర్పాటుచేస్తే మరింత శోభను సంతరించుకోనుంది. జూనియర్‌ కళాశాల స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు అందుబాటులోకి తెస్తే మరికొందరికి ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. రామన్నపేటలోని చాలా వార్డులు వర్షాలకు ముంపునకు గురవుతున్నాయి. ఇందుకు పరిష్కారంగా చాకలికుంట నుంచి వెంకట్రామ చెరువు వరకు వరద కాల్వ నిర్మించాల్సి ఉన్నా అది కార్యరూపం దాల్చలేదు. మండలంలోని మునిపంపుల గ్రామ పరిధిలో ఆసి్‌ఫనెహర్‌(రాచకాల్వ) కాల్వ కట్ట ఐదుసార్లు తెగి పంట నష్టం జరిగింది. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.

రెవెన్యూ డివిజనగా ఏర్పాటు చేయాలి

సమితి, నియోజకవర్గ కేంద్రంగా వెలుగొందిన రామ న్నపేట ప్రస్తుతం మండలంగా మారింది. కేవలం 19 గ్రామాలకే పరిమితమైంది. నియోజకవర్గం రద్దు చేసి, దాని పరిధిలోని గ్రామాలను మూడు నియోజకవర్గాలకు కేటాయించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రామన్నపేటను డివిజన కేంద్రంగా ఏర్పాటు చేయాలని పలుమార్లు ఆందోళన చేశాం. ఇప్పటికైనా రామన్నపేటను డివిజన కేంద్రంగా ఏర్పాటుచేయాలి.

- మేక అశోక్‌, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు

100 పడకలకు అప్‌గ్రేడ్‌ చేయాలి

ఒకప్పుడు రామన్నపేట ఆసుపత్రి ఉమ్మడి జిల్లాలో రెండో అతిపెద్ద ఆసుపత్రి. ప్రస్తుతం సరిపడా డాక్టర్లు లేక మెరుగైన వైద్యం అందక రోగులు హైదరాబాద్‌, నల్లగొండకు వెళ్లాల్సి వస్తోంది. 100 పడకల స్థాయికి అప్‌గ్రేడ్‌ చేస్తామని వైద్య ఉన్నత వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు నెరవేరలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకొని వంద పడకల స్థాయికి పెంచాలి.

- మిర్యాల మల్లేశం, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు

ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి

రామన్నపేటలో ఎలాంటి పరిశ్రమలు లేవు. నిరుద్యోగులు ఉపాధి కోసం పట్టణా లకు తరలిపోతున్నారు. కాలుష్యానికి ఆస్కారం లేని ఫార్మా కంపెనీలకు ఈ ప్రాంతం అనుకూలం. రాజధానికి అందుబాటులో ఉండడం, రైలుమార్గం ఉండడం కారణంగా ఐటీ పరిశ్రమలను ఏర్పాటు చేసి ప్రోత్సహించాలి.

- నకిరెకంటి మొగులయ్య, బీజేపీ జిల్లా నాయకుడు.

అభివృద్ధి బాటలో రామన్నపేట

రామన్నపేటలో గతంలో ఏనాడూ లేనంత అభివృద్ధి ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరుగుతోంది. ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి కాల్వలను ఏర్పాటు చేయడంతో పాటు పలు గ్రామాల్లో పాఠశాలలో, మురికి కాల్వలు మంచినీటి సౌకర్యం, రోడ్డు విస్తరణ తదితర అనేక పనులు చేపట్టారు. రామన్నపేట మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దడం కోసం ఎమ్మెల్యే చొరవ తీసుకుంటున్నారు.

- మందడి ఉదయ్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు

Updated Date - 2023-09-29T00:37:03+05:30 IST