చేనేత మగ్గం ఇక ఆన్‌లైన్‌

ABN , First Publish Date - 2023-03-19T00:10:22+05:30 IST

పారదర్శకత, దళారుల వ్యవస్థకు స్వస్తి పలికేలా ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. చేనేత మగ్గాల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మొదటి విడతగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భూదాన్‌పోచంపల్లి మండలాన్ని వివరాల సేకరణకు ఎంపిక చేసి చేనేత, జౌళీశాఖ అధికారులు వివరాల నమోదు ప్రక్రియ చేపట్టారు.

చేనేత మగ్గం ఇక ఆన్‌లైన్‌
భూదాన్‌పోచంపల్లిలో చేనేత మగ్గం వివరాలను ఆన్‌లైన్‌ చేస్తున్న జిల్లా చేనేత,జౌళీశాఖ ఏడీ విద్యాసాగర్‌(ఫైల్‌)

ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శతకోసం

ఉమ్మడి జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా భూదాన్‌పోచంపల్లిలో షురూ

పారదర్శకత, దళారుల వ్యవస్థకు స్వస్తి పలికేలా ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. చేనేత మగ్గాల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మొదటి విడతగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భూదాన్‌పోచంపల్లి మండలాన్ని వివరాల సేకరణకు ఎంపిక చేసి చేనేత, జౌళీశాఖ అధికారులు వివరాల నమోదు ప్రక్రియ చేపట్టారు. రానున్న మూడు నెలల్లో చేనేత కార్మికులున్న అన్ని గ్రామాల్లో ఇది అమలు చేయనున్నారు.

భూదాన్‌పోచంపల్లి

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 80కి పైగా గ్రామాల్లో మగ్గాలు నేసే చేనేత కార్మికుల కుటుంబాలున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 30వేల మగ్గాలు ఉండగా, వాటిలో సుమారు 9,284 మగ్గాల వరకు జియోట్యాగ్‌ మగ్గాలున్నాయి. వీటి పై ఆధారపడి దాదాపు 30వేల కుటుంబాలున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో జియోట్యాగ్‌ మగ్గాలు సుమారు 6,740 ఉండగా, మరో 6,200 మగ్గాలు జియోట్యాగ్‌ కానివి ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో జియోట్యాగ్‌ మగ్గాలు సుమారు 2,446 ఉండగా, జియోట్యాగ్‌ కానివి మరో 2,600 వరకున్నాయి. సూర్యాపేటలో 280 జియోట్యాగ్‌ మగ్గాలుండగా మరో 320 మగ్గాలున్నాయి. కొన్నేళ్ల క్రితం కార్వి సంస్థ ఇంటింటికీ వెళ్లి మగ్గానికి ఒక జియో ట్యాగ్‌ నెంబరు ఇచ్చి ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. అయితే ఇవి మ గ్గం, ఒక కార్మికుడి వివరాలు మాత్రమే అందులో ఉన్నాయి. దీంతో వివరా లు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈనేపథ్యంలో అందరి వివరాలు నమోదు చేసేందుకు జిల్లాలోని భూదాన్‌పోచంపల్లిని ఎంపిక చేసి అధికారులు పూర్తి వివరాలు నమోదు చేస్తున్నారు. చేనేత మగ్గం కార్మికుడితోపాటు లూమ్‌ (మగ్గం) వివరాలు మరియు అనుబంధ కార్మికుల వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.

బోగస్‌ మగ్గాలకు చెక్‌

ప్రస్తుతం చేపట్టే ఆన్‌లైన్‌ ప్రక్రియతో మగ్గం లేకుండా జియోట్యాగ్‌ నెంబరు పొందిన వాటికి చెక్‌ పడనుంది. గతంలో కార్వీ సంస్థ జియోట్యాగ్‌ నెంబరు ఇచ్చే తరుణంలో కొందరు డబ్బులు ఇచ్చి, మరికొందరు పలుకుబడి ఉపయోగించి మగ్గాలు లేకున్నా జియోట్యాగ్‌ పొంది ప్రస్తుతం ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతున్నారు. ఇలాంటి బోగ్‌సల బాగోతం బయటపడనుంది. ఇప్పుడు ఆన్‌లైన్‌ ప్రక్రియను ప్రభుత్వం పకడ్బందీగా చేపడుతోందని అధికారులు చెబుతున్నారు.

నమోదు ప్రక్రియ ఇలా

మగ్గం ఉన్న స్థలం, పనిచేసే ప్రధాన చేనేత కార్మికుడు, ఇద్దరు సహాయ కార్మికులు, అందరి ఆధార్‌, బ్యాంకు వివరాలు సేకరించడంతోపాటు, ఒక్కో మగ్గానికి 3 లేదా 4 ఫొటోలు సేకరించి టీఎస్‌ హ్యాండ్లూమ్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తున్నారు. ఇవి పూర్తయ్యాక అన్ని గ్రామాల్లో ప్రతీ మగ్గం వివరాలు సేకరించనున్నట్లు చేనేత అధికారులు చెబుతున్నారు. వివరాల నమోదుకు జిల్లా కార్యాలయాల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో ఆన్‌లైన్‌ ప్రక్రియకు అడ్డంకిగా మారింది. జిల్లా చేనేత శాఖ సహాయాధికారి విద్యాసాగర్‌ స్వయంగా భూదాన్‌పోచంపల్లి పట్టణంలో చేనేత మగ్గాల ఆన్‌లైన్‌కు హాజరై నమోదు చేయడం ఇందుకు అద్దం పడుతోంది.

జాప్యం లేకుండా

రాష్ట్ర ప్రభు త్వం ‘చేనేత మిత్ర’ పేరుతో రేషం(యారన్‌) కొనుగోలుపై 40 శాతం రాయితీ అందిస్తోంది. ఇది ప్రతీ 40 రోజులకోసారి మాస్టర్‌ వీవర్‌ బిల్లులు అప్‌లోడ్‌ చేస్తే కార్మికుల ఖాతాల్లో మూడు, నాలుగు నెలలకు డబ్బులు జమవుతాయి. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అన్ని వివరాలు ఆన్‌లైన్‌ చేయడంతో బిల్లు లు అప్‌లోడ్‌ లేకుండా నేరుగా కార్మికుల ఖాతాల్లోకి సమయానికి డబ్బు జమ అయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. ‘త్రిఫ్ట్‌ స్కీం’లో కార్మికు లు సంపాదించిన దాంట్లో ప్రతీ నెలా 8శాతం జమ చేస్తే ప్రభుత్వం రెం డింతలు అనగా 16 శాతం జమ చేస్తోంది. ఈ ప్రక్రియలో బ్యాంకులు అనుమ తి ఇవ్వడంలో జాప్యం కారణంగా ఆలస్యమవుతోంది. ఇకపై అలా కాకుండా చేనే త అధికారులు బ్యాంకుకు వెళ్లి ఎన్ని ఖాతాల్లో కార్మికులు జమ చేశారో గుర్తించి, అప్పటికప్పుడే ప్రభుత్వం డబ్బు జమ చేయడం జరుగుతుంది. ఇక చేనేత బీమా అం దించడంలోనూ జాప్యం లేకుండా చర్యలు తీసుకోనున్నామని అధికారులు చెబుతున్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాలు : విద్యాసాగర్‌, ఏడీ, చేనేత జౌళీశాఖ, యాదాద్రి భువనగిరి

మగ్గాలు, చేనేత కార్మికులకు సంబంధించిన పూర్తి వివరాలు ఆన్‌లైన్‌ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. మొదట కొన్ని పైలట్‌ గ్రామాలను ఎంపిక చేసి ఈ ప్రక్రియ చేపడుతున్నాం. ఇక్కడ విజయవంతం కావడంతో ఈ ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా నమోదు చేయడంలో భాగంగా మొదటగా అతిపెద్ద చేనేత కేంద్రమైన భూదాన్‌పోచంపల్లిలో ప్రారంభించాం. దీంతో నిధులు అందడంలో పారదర్శకత, పథకాల అమలులో వేగవంతం అవుతోంది.

సద్వినియోగం చేసుకోవాలి : ఎం.వెంకటేశం, స్టేట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి

మగ్గం వివరాలతోపాటు,చేనేత కార్మికుడి వివరాలు, అతని సహాయ కార్మికుల వివరాలు అందించి ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలి. జియోట్యాగ్‌ కలిగిన ప్రతీ కార్మికుడి వివరాలు ఇందులో నమోదు చేస్తున్నాం. దీంతో ప్రభుత్వం నుంచి అందే ప్రతీ చేనేత పథకం నేరుగా పొందవచ్చును. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

Updated Date - 2023-03-19T00:10:22+05:30 IST