Share News

సీఎం ముఖ్య భద్రతాఽధికారిగా ఏపూరు వాసి

ABN , First Publish Date - 2023-12-13T00:14:17+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ముఖ్య భద్రతాధికారిగా నియమితులైన గుమ్మి చక్రవర్తి తండ్రి వెంగళ్‌రెడ్డి స్ఫూర్తితో అంచెలంచెలుగా ఎదిగారు.

సీఎం ముఖ్య భద్రతాఽధికారిగా ఏపూరు వాసి
కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న గుమ్మి చక్రవర్తి

తండ్రి స్ఫూర్తితో అంచెలంచెలుగా ఎదిగిన చక్రవర్తి

ప్రస్తుతం యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరో ఎస్పీగా బాధ్యతలు

కొన్నాళ్లు అమెరికాలో మెకానికల్‌ ఇంజనీర్‌గా పనిచేసిన అనుభవం

చిట్యాల రూరల్‌, డిసెంబరు 12: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ముఖ్య భద్రతాధికారిగా నియమితులైన గుమ్మి చక్రవర్తి తండ్రి వెంగళ్‌రెడ్డి స్ఫూర్తితో అంచెలంచెలుగా ఎదిగారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు గ్రామానికి చెందిన చక్రవర్తి మాదక ద్రవ్యాల నియంత్రణ అధికారిగా (యాంటి నార్కొటిక్స్‌ బ్యూరో హైదరాబాద్‌ ఎస్పీ) వ్యవహరిస్తుండగా, ప్రభుత్వం సీఎం ముఖ్య భద్రతాధికారిగా నియమించింది. ఏపూరుకు చెందిన గుమ్మి వెంగళ్‌రెడ్డి, కమలమ్మల చిన్న కుమారుడైన చక్రవర్తి ఉన్నత విద్యాభ్యాసం అనంతరం అమెరికాలో మెకానికల్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేశారు. లక్షల్లో వేతనం వస్తున్నా మాతృదేశంపై మమకారంతో కొన్నేళ్ళ తరువాత స్వదేశానికి తిరిగి వచ్చారు. 2012-13లో మొదటి ప్రయత్నంలోనే గ్రూప్‌-1 అధికారిగా డీఎస్పీగా ఉద్యోగం సాధించారు. శిక్షణ అనంతరం నక్సల్‌ ప్రాబల్యం ప్రాంతమైన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌కు తొలి పోస్టింగ్‌ వచ్చింది. అనంతర కాలంలో సుల్తాన్‌బజార్‌ ఏసీపీగా, పదోన్నతిపై ఎస్పీ హోదాలో ఏడాదిన్నరగా మాదక ద్రవ్యాల నియంత్రణ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. చక్రవర్తి తండ్రి వెంగళ్‌రెడ్డి కూడా 1987లో గ్రూప్‌-1 అధికారిగా సోషల్‌ వెల్ఫేర్‌ అధికారిగా నియమితులై, 2009లో మున్సిపల్‌ శాఖలో అదనపు మిషన్‌ డైరెక్టర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. ఆ తరువాత నేషనల్‌ రీసోర్స్‌ పర్సన్‌గా, ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో కన్సల్టెంట్‌గా కూడా పనిచేశారు. తండ్రి స్ఫూర్తితో గ్రూప్‌-1 అధికారిగా ఎంపికైన చక్రవర్తి అంచెలంచెలుగా ఎదిగి సీఎం ముఖ్యభద్రతాధికారిగా నియమితులవటంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉంటుండగా, అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి పలకరించి వెళుతుంటారని స్థానికులు చెబుతున్నారు.

Updated Date - 2023-12-13T00:14:19+05:30 IST