పార్కుల్లో కానరాని పచ్చదనం
ABN , First Publish Date - 2023-03-02T00:53:52+05:30 IST
ఎటుచూసినా పచ్చని చెట్లు..చూడగానే కాసేపు సేదతీరాలనిపించేలా ఉండాల్సిన పార్కులు నిర్వాహణాలోపం, విధుల్లో బాధ్యతా రాహిత్యం కారణంగా వాటిల్లో పచ్చదనం కరువయింది.
నిర్వహణ లోపంతో అధ్వానంగా భువనగిరి పార్కులు
భువనగిరి టౌన్, మార్చి1: ఎటుచూసినా పచ్చని చెట్లు..చూడగానే కాసేపు సేదతీరాలనిపించేలా ఉండాల్సిన పార్కులు నిర్వాహణాలోపం, విధుల్లో బాధ్యతా రాహిత్యం కారణంగా వాటిల్లో పచ్చదనం కరువయింది. ఫలితంగా అహ్లాదం కోసం పార్కులకు వెళుతున్నవారికి ఉక్కపోతే ఎదురవుతున్నది. ఈ తరహా దుస్థితికి భువనగిరిలోని పార్కులు అద్దం పడుతున్నాయి. అయినప్పటికీ అధికారుల్లో స్పందన కరువవ్వడం పట్టణ వాసులను చికాకు పెడుతున్నది.
ఎందుకిలా?
మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా భువనగిరి పట్టణంలోని 13 పార్కుల నిర్వహణ బాధ్యతను ఎంపిక చేసిన 13మంది సభ్యులకు సుమారు ఏడాదిన్నర క్రితం అధికారులు అప్పగించారు. పార్కు విస్తీర్ణం ఆధారంగా నెలకు కనీస గౌరవ భృతిగా రూ.7500వరకు చెల్లిస్తున్నారు. నిర్ధేశిత వేళల్లో పార్కులను తెరిచి ఉంచడం, పార్కును శుభ్రం చేయడం, మొక్కలకు నీరు పట్టడం, ట్రిమ్మింగ్, కట్టింగ్ తదితర పనులను చేయాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన పరికరాలను, వసతులు మునిసిపాలిటీ సమకూర్చాల్సి ఉంటుంది. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం విఫలమవుతున్నది. పలు కారణాలతో సంబంధిత సభ్యులు పార్కుల నిర్వహణలో శ్రద్ధ చూపకపోతుండటం, మొక్కల, గ్రాస్ ట్రిమ్మిగ్, కట్టింగ్‌పై మునిసిపల్ యంత్రాంగం అవగాహన కల్పించక పోవడంతో పార్కులన్నీ పచ్చదనాన్ని కోల్పోతున్నాయి. లక్షల రూపాయలతో పార్కులను అభివృద్ది చేసినప్పటికీ ప్రజలకు మాత్రం అహ్లాదం మాత్రం అందడంలేదు. వేసవి ప్రారంభం కావడంతో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు పార్కులకు వెళ్లాలనుకుంటున్న ఔత్సాహికులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ దుస్థితికి మహిళా సంఘాలతో పాటు మునిసిపల్ అధికారులది కూడ అంతే బాధ్యత అని పలువురు పేర్కొంటున్నారు. రూ. 35 లక్షల వ్యయంతో మునిసిపల్ కార్యాలయ ఆవరణలో గతంలో అభివృద్ధి చేసిన పార్కు నిర్వాహణ లోపంలో అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ మునిసిపల్ యంత్రాంగం పట్టనట్టు వ్యవహరిస్తున్న తీరు అందరిని విస్మయానికి గురి చేస్తున్నది. లక్షలాదిరూపాయల హరిత నిధి ఉన్నప్పటికి పార్కుల్లో హరితం కరువైందని పట్టణవాసులు పేర్కొంటున్నారు.
పార్కుల నిర్వహణను మెరుగుపరుస్తాం
పట్టణంలోని కొన్ని పార్కులు అస్తవ్యస్తంగా మారా యి. ఈ స్థితికి గల కారణాలపై విచారణ చేప ట్టాం. మహిళా సంఘాలతో సమావేశం నిర్వహిస్తాం. అవసరమైతే ఇన్‌చార్జీలను మారుస్తాం. నిరంతరం పర్యవేక్షి స్తాం. అవసరమైన సదుపాయాలు కల్పిస్తాం. ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు శ్రద్ధచూపుతాం. వేసవినాటికి మరిన్ని పార్కు లు అందుబాటులోకి వస్తాయి. అన్నింటినీ పూర్తిస్థాయిలో సుందరీకరిస్తాం.
-బి.నాగిరెడ్డి, కమిషనర్, భువనగిరి మునిసిపాలిటీ