Share News

మండల పరిషత్‌ నిధులు స్వాహా

ABN , Publish Date - Dec 18 , 2023 | 12:42 AM

కోదాడ మండల పరిషత్‌ నిధులు స్వాహా చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వెలుగులోకి వచ్చింది. మండల పరిషత్‌కు వచ్చే జనరల్‌ ఫండ్‌ను సైతం ఎంపీటీసీలకు కేటాయించకుండా, తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని స్థానిక ఎంపీపీ రూ.50లక్షలకు పైగా స్వాహా చేసినట్లు తెలిసింది.

మండల పరిషత్‌ నిధులు స్వాహా

సమాచారహక్కు చట్టంతో వెలుగులోకి..

విచారణకు ఆదేశించిన అధికారులు

కోదాడ రూరల్‌, డిసెంబరు 17: కోదాడ మండల పరిషత్‌ నిధులు స్వాహా చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వెలుగులోకి వచ్చింది. మండల పరిషత్‌కు వచ్చే జనరల్‌ ఫండ్‌ను సైతం ఎంపీటీసీలకు కేటాయించకుండా, తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని స్థానిక ఎంపీపీ రూ.50లక్షలకు పైగా స్వాహా చేసినట్లు తెలిసింది. దీనికి స్థానిక అధికారులు కూడా సహకారం అందించడంతో నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణలున్నాయి. కోదాడ మండల పరిషత్‌కు జనరల్‌ ఫండ్‌ కింద ఏటా అద్దెల రూ పంలో రూ.2లక్షలకు పైగా నిధులు వస్తున్నాయి. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఉన్న మండల పరిషత్‌ కాంప్లెక్స్‌లోనూ, కోదాడ మునిసిపాలిటీ ఎదురుగా ఉన్న పాత ఎంపీడీవో ముందు గల దుకాణాల కిరాయి ద్వారా మరిన్ని నిధులు ప్రతీనెలా మండల పరిషత్‌ కార్యాలయంలోని జనరల్‌ ఫండ్‌ ఖాతాలో జమవుతున్నాయి. దీంతో నిధులపై ఆశపడిన ఎంపీపీ ఎలాగైనా స్వాహా చేయాలన్న ఉద్దేశ్యంతో తనకు నెలకు రూ.50వేలు ఇవ్వాలని అధికారులను డిమాండ్‌చేశారు. మీరు ఏ ఖర్చులోనైనా రాసుకోండి... నాకు మాత్రం రూ.50వేలు ఇవ్వాల్సిందేనని అధికారులకు తేల్చి చెప్పారు. వారు చేసిది లేక ఆమె చెప్పినట్లు ఆమెకు సొంత కారు ఉన్నా కూడా అద్దె కారు తీసుకున్నట్లు రికార్డులో చూపి ఎంపీపీ ట్రావెలింగ్‌ అలవెన్సు కింద నెలకు రూ.10 వేల నుంచి రూ.15వేల వరకు చెల్లించినట్లు సమాచారం. దీంతోపాటు మండలంలో పలు గ్రామాల్లో బోర్ల మరమ్మతులకు, పైపుల మరమ్మతుల పేరిట నెలకు రూ.20వేల నుంచి రూ.30వేలకు పైగా రికార్డులో రాసి ఆ నిధులు స్వాహా చేసినట్లు తెలిసింది. మండలంలోని దోరకుంటకు చెందిన ఎన్‌.శ్రీనివాస్‌ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా అడగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కానీ ఏ గ్రామంలోనైనా మోటార్లు కాలిపోయినా, బోర్ల మరమ్మతులైనా, పైపులైన్ల ఏర్పాటు అన్నీ తమ గ్రామపంచాయతీల నిధులతోనే చేసుకున్నాం తప్ప, మండల పరిషత్‌ నుంచి తమకెలాంటి బిల్లులు ఇవ్వలేదని, ఆయా గ్రామాల సర్పంచ్‌లు తెలిపారు. దీంతోపాటు ఆమె మండలంలో అనేక అక్రమాలకు పాల్పడినట్లు తెలిసింది. పనులు చేయకుండానే నిధులు స్వాహా చేసినట్లు తెలిసింది. జనరల్‌ ఫండ్‌ కింద మంజూరైన నిధులను కూడా ఎంపీపీ తన అనుచరులకు కట్టబెట్టారని పలువురు ఎంపీటీసీలు ఆరోపిస్తున్నారు. మండల పరిషత్‌కు మంజూరైన నిధులను ఎంపీటీసీలకు ఇవ్వాల్సి ఉండగా, ఎంపీపీ విరుద్ధంగా తన అనుకూలమైన సర్పంచ్‌లకు కేటాయించి, వారినుంచి పెద్ద మొత్తంలో కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. నాలుగున్నరేళ్ల ఎంపీటీసీల పదవీ కాలంలో రూ.4లక్షలు తప్ప తమకెలాంటి నిధులు మంజూరు కాలేదని వారన్నారు. నిధుల స్వాహాపై కలెక్టర్‌కు శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా, విచారణకు ఆదేశించినట్లు అతడు తెలిపారు.

ఎంపీడీవో వివరణ

ఈ విషయమై మండల అభివృద్ధి అధికారి విజయశ్రీని వివరణ కోరగా, నాలుగున్నర సంవత్సరాల కాలంలో మండల పరిషత్‌కు వివిధ రూపంలో సుమారు రూ.50లక్షలకు పైగా వచ్చాయన్నారు. ఈ నిధులను నిబంధనల మేరకే ఖర్చు చేశామన్నారు. ఎంపీపీ ఆదేశానుసారం గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు నిధులు మంజూరు చేశామన్నారు. కొన్ని గ్రామాల్లో బినామీ పేర్లతో ఎంపీపీ సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేసి నిధులు స్వాహా చేసిన విషయం తమకు తెలియదన్నారు. ఎంపీపీకి కారు అలవెన్సు కింద సొంత కారు ఉన్నా కూడా ఆమెకు నిబంధనల మేరకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు ఇచ్చామన్నారు. జనరల్‌ ఫండ్‌ కింద చేపట్టిన అభివృద్ధి పనులన్నింటికీ ఎంబీ లెక్కలు ఉన్నాయన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 12:42 AM