గులాబీ దళంలో ఎన్నికల వేడి

ABN , First Publish Date - 2023-07-01T00:32:29+05:30 IST

చాప కింద నీరులా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన గులాబీ పార్టీలో ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో గాదరి కిశోర్‌కుమార్‌తో హ్యాట్రిక్‌ కొట్టించాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెం ట్‌, మంత్రి కేటీఆర్‌ బహిరంగ సభా వేదికగా ప్రకటించారు. ఉమ్మడి జిల్లా లో అభ్యర్ధిగా తొలి అధికారిక ప్రకటన కిశోర్‌దే. కాగా, ప్రకటన వెలువడిన మరుసటి రోజే సీనియర్‌ నేత మందుల సామేలు బీఆర్‌ఎ్‌సను వీడుతున్నట్టు బహిరంగంగా ప్రకటించి పార్టీలో కాక రేపారు.

గులాబీ దళంలో ఎన్నికల వేడి

ఉమ్మడి జిల్లాలో తొలి అభ్యర్ధిగా కిశోర్‌ను ప్రకటించిన మంత్రి కేటీఆర్‌

పార్టీని వీడిన సామేలు

ఈ నెల 15 వరకు వేముల వీరేశం డెడ్‌లైన్‌

అసెంబ్లీ వైపే గుత్తా అమిత్‌ చూపు

బీఆర్‌ఎ్‌సతోనే ఎన్నికలకు కామ్రేడ్స్‌, సిట్టింగుల్లో అలజడి

నల్లగొండ, సూర్యాపేటలో త్వరలో సీఎం పర్యటన

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): చాప కింద నీరులా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన గులాబీ పార్టీలో ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో గాదరి కిశోర్‌కుమార్‌తో హ్యాట్రిక్‌ కొట్టించాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెం ట్‌, మంత్రి కేటీఆర్‌ బహిరంగ సభా వేదికగా ప్రకటించారు. ఉమ్మడి జిల్లా లో అభ్యర్ధిగా తొలి అధికారిక ప్రకటన కిశోర్‌దే. కాగా, ప్రకటన వెలువడిన మరుసటి రోజే సీనియర్‌ నేత మందుల సామేలు బీఆర్‌ఎ్‌సను వీడుతున్నట్టు బహిరంగంగా ప్రకటించి పార్టీలో కాక రేపారు.ఇక కాంగ్రెస్‌ గూటి కి చేరేందుకు సిద్ధంగా ఉండాలని కింది స్థాయి నేతలకు వేముల వీరేశం సంకేతాలు పంపారు. దీంతో అలర్టయిన అధిష్ఠానం 15రోజుల పాటు వేచి చూడాలని సంకేతాలు పంపింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే పనితీరు బాగాలేదని, తాను అసెంబ్లీ కేంద్రంగానే పనిచేస్తానని గుత్తా అమిత్‌ స్పష్టం చేయడం ఆ పార్టీలో కొత్త పరిణామం. రానున్న ఎన్నికల్లో గులాబీ దళంతోనే కలిసి సాగుతామని కామ్రేడ్స్‌ కుండబద్ధలు కొట్టారు.

కామ్రేడ్స్‌తో పొత్తు కొనసాగితే ఉమ్మడి జిల్లాలో కనీసం రెండు బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానాలకు గండిపడే అవకాశం ఉంది. ఇక ఎన్నికలు సమీపిస్తుండడంతో జిల్లా కేంద్రాలైన నల్లగొండ, సూర్యాపేటలో ఈ నెలలో సీఎం కేసీఆర్‌ పర్యటనకు ఏర్పాట్లు చేసుకోవాలని అధిష్ఠానం నుంచి ఎమ్మెల్యేలకు సంకేతాలు అందాయి.

తుంగతుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ తరపున మూడో సారి గాద రి కిశోర్‌కుమార్‌ పోటీ చేస్తారని ఆయన్ను 40వేలకు పైగా మెజార్టీ తో గెలిపించి హాట్రిక్‌ కొట్టించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తిరుమలగిరి సభలో గురువారం ప్రకటించారు. యువనేత ప్రసంగంతో తుంగతుర్తి టికెట్‌పై ఇప్పటి వరకు ఆశ పెట్టుకున్న గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్‌ మందుల సామేలు శుక్రవారం బీఆర్‌ఎస్‌ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ కార్యదర్శి పదవికి రా జీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అత్యధికంగా ఉన్న తుంగతుర్తిలో అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్‌ నేత అధికార పార్టీని వీడడంతోపాటు కీలక నేతలపై ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 2014లో తనకు టికెట్‌ ఇవ్వలేదని, ఎక్కడ పోటీకి వస్తాననే ఉద్దేశంతో మంత్రి జగదీష్‌రెడ్డి స్థానికేతరులకు టికెట్‌ ఇప్పించి మోసం చేశారని ఆరోపించారు. తన హయాంలో కట్టించిన గిడ్డంగుల ప్రారంభానికి మంత్రి తనను పిలవకుండా ప్రారంభించి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల్లో తనకు టికెట్‌ ఇస్తానని మాట ఇచ్చి, పార్టీ అభ్యర్థి కిశోర్‌ అని ప్రకటించి మాదిగలకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తాను తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలో దిగుతానని ఆయన స్పష్టం చేశారు.

మాజీ ఎమ్మెల్యే వీరేశం డెడ్‌లైన్‌

సిట్టింగ్‌లకు దాదాపు టికెట్‌ ఖాయమని, ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మరోమారు అవకాశం తప్పదని బీఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయకపోతే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం శరవేగంగా పావులు కదిపారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డితో ఉన్న పరిచయం మేరకు ఆయన కాంగ్రెస్‌ నేతలకు టచ్‌లోకి వెళ్లారని విస్తృతంగా ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో వేముల వీరేశాన్ని గెలిపించుకోవాలని, అందుకు సమయం ఆసన్నమైందంటూ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నకిరేకల్‌ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో చర్చలు ప్రారంభించారు. స్థానికంగా పరిస్థితిని గమనించిన బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం రంగంలోకి దిగింది. సీఎంకు నిత్యం అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ ద్వారా వేచి చూడండంటూ ఆయనకు సంకేతాలు పంపింది. జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు వీరేశాన్ని నిలువరించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. యాదవ సామాజికవర్గానికి చెందిన ఓ మాజీ ఎంపీపీ భర్త ద్వారా వీరేశంతో చర్చించారు. మరోసారి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని, ఎమ్మెల్యే టికెట్‌ అనేది సర్వేల ఆధారంగా ఖరారవుతుందని, ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్సీ ఇప్పిస్తామని, సీఎంతో చర్చించి స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తామని, తొందరపడవద్దంటూ జిల్లాకు చెందిన కీలక నేత సందేశాన్ని పంపారు. కాగా, ఆ ఎమ్మెల్సీ పదవేదో తన పోటీదారుకే ఇవ్వాలని, తనకు మాత్రం ఎమ్మెల్యే టికెటే కావాలని వీరేశం ఆయన వద్ద తేల్చి చెప్పినట్లు సమాచారం. ఏదేమైనా ఎమ్మెల్యే టికెట్‌కు సంబంధించి ఈ నెల 15వ తేదీ నాటికి తేల్చాలని వీరేశం బీఆర్‌ఎస్‌ నేతలకు డెడ్‌లైన్‌ విధించినట్లు తెలిసింది.

నల్లగొండ, సూర్యాపేటలో పర్యటించనున్న సీఎం

ఎన్నికలు సమీపిస్తుండడంతో సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీ్‌షరావు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల పేరుతో నియోజకవర్గాల్లో భారీ సభలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ క్రమంలోనే హుజూర్‌నగర్‌, తుంగతుర్తిలో మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. కేటీఆర్‌ను తమ నియోజకవర్గాలకు రప్పించుకునేందుకు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలు తేదీలు ఖరారు చేయాలని కేటీఆర్‌పై ఒత్తిడి తీసుకురాగా, జిల్లా కేంద్రాలైన నల్లగొండ, సూర్యాపేటలో పర్యటించేందుకు సీఎం కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారని, తన పర్యటన వద్దంటూ ఆయన సున్నితంగా తిరస్కరించారు. నల్లగొండలో పార్టీ కార్యాలయంతో పాటు అభివృద్థి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాల్సి ఉంది. నల్లగొండను దత్తత తీసుకుంటున్నట్టు గత ఎన్నికల సభలో సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నెలలో సీఎం పర్యటన దాదాపు ఖరారైంది. ఇదే సమయంలో మంత్రి జగదీ్‌షరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేటలోనూ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాయి. కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం, మెడికల్‌ కళాశాల భవనం, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, జమ్మిగడ్డలోని వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌, గిరిజన మహిళా విద్యార్థుల రెసిడెన్షియల్‌ పాఠశాల, కళాశాల భవనాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఈ నెలలో మంత్రి జగదీ్‌షరెడ్డి పుట్టినరోజు నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ పర్యటిస్తారని స్థానిక నేతలు భావిస్తున్నారు.

బీఆర్‌ఎ్‌సతోనే కామ్రేడ్స్‌

వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సతోనే కలిసి సాగాలని కామ్రేడ్స్‌ నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో సీపీఎం, సీపీఐ కీలక నేతలు సమావేశమై నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ ఎక్కడా వామపక్షాలతో పొత్తు లేదనే రీతిలో మాట్లాడలేదని, మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ గెలుపులో వామపక్షాలు కీలకంగా వ్యవహరించాయని, ఈ విషయాన్ని సీఎం కేసీఆరే బహిరంగంగా ప్రకటించారని నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాడు బీజేపీని వామపక్షాలు నిలువరించకపోతే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు భిన్నం గా ఉండేవని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభకు సీపీఎం, సీపీఐ నేతలను సీఎం కేసీఆర్‌ ఆహ్వానించారనే విషయాన్ని జూలకంటి గుర్తు చేశారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ప్రతీ నియోజకవర్గంలోనూ కనీసంగా 5వేల నుంచి 10వేల వరకు ఓటు బ్యాంకు ఉమ్మడి కమ్యూనిస్టులకు ఉందని, ఏ పార్టీ అభ్యర్ధి గెలుపునైనా వామపక్షాలు శాసించగలవని కామ్రేడ్స్‌ ధీమాగా ఉన్నారు. కామ్రేడ్స్‌ తాజా నిర్ణయంతో ఆ పార్టీలకు బలమైన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీపీఎం, సీపీఐకి చెరో సీటు దక్కడం ఖాయమైంది. ఈ ఒప్పందంతో మిర్యాలగూడ, మునుగోడు, దేవరకొండ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో రెండు చోట్ల అధికార పార్టీ అభ్యర్ధులకు ఇబ్బందులు తప్పవనే చర్చ సాగుతోంది. రెండు సీట్లపై ఆశ వదులుకోవాల్సిందేనంటూ జిల్లాకు చెందిన కీలక బీఆర్‌ఎస్‌ నేత ఒకరు ప్రకటించడం గమనార్హం.

అసెంబ్లీ వైపే అమిత్‌ చూపు

అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ఏకకాలంలో జరిగితే నల్లగొండ పార్లమెంట్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా బరిలో దిగేందు కు గుత్తా అమిత్‌రెడ్డి సిద్ధమయ్యారు. జమిలి ఎన్నికలు జరిగితేనే బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్ధి గెలుపు సులువు అవుతుంది. ఐదు నెలల తర్వాత ఎంపీ ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్‌ అభ్యర్ధుల గెలుపు అనుమానమే. గత ఎన్నికల్లో ఇదే జరిగింది. దీంతో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఆయన తనయుడు అమిత్‌రెడ్డి ఓ అంచనాకు వచ్చారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ఏకకాలంలో జరిగే పరిస్థితి లేదు. దీంతో ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యేల పనితీరుపై అధిష్ఠానం చేయించిన సర్వేల్లో ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో వారి స్థానంలో అమిత్‌రెడ్డి బరిలోకి దిగడం మేలని గుత్తా కుటుంబం లెక్కలు వేసుకుంటున్నట్టు తెలిసింది. ప్రధానంగా మునుగోడు, నల్లగొండ అసెంబ్లీ స్థానాలపైనే గురిపెట్టి పనిచేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. గుత్తా అమిత్‌ను జిల్లాలో తిప్పాలని స్వయంగా సీఎం కేసీఆర్‌ ఆదేశించడంతోనే తన వారసుడిని రాజకీయ అరంగేట్రం చేయించినట్లు పార్టీ సీనియర్‌ నేత సుఖేందర్‌రెడ్డి తన ఆత్మీయుల వద్ద స్పష్టం చేశారు. గుత్తా కుటుంబం నిర్ణయంతో మునుగోడు, నల్లగొండ నియోజకవర్గాల్లో అధికార పార్టీలో ఎన్నికల ముందు వర్గపోరు ఉండనుంది.

ప్రతిపక్షాల అభ్యర్ధి ఎవరో?

మోత్కూరు: అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్య ర్ధి ఎమ్మెల్యే కిశోర్‌కుమారేనని తేలడంతో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులెవరన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే వైఎస్పార్‌టీపీ అభ్యర్ధిగా ఏపూరి సోమన్నను ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల గతంలోనే ప్రకటించారు. వైఎస్సార్‌టీపీని కాంగ్రె్‌సలో విలీనం చేయడమో, లేదా ఎన్నికల్లో కాంగ్రె్‌సతో పొత్తు ఉంటుందనే వార్తలు వెలువడుతుండటంతో, ఏపూరి సోమన్నకు టికెట్‌ వస్తుందా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నా యి. బీజేపీలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కడియం రాంచంద్రయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. వారిలో ఒకరికి టికెట్‌ ఇస్తారా? లేక కొత్తవారిని బరిలోకి దించుతారా అనే చర్చకూడా సాగుతోంది.

కాంగ్రె్‌సలో పెరుగుతున్న పోటీదారుల సంఖ్య

కాంగ్రె్‌సలో టికెట్‌కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత రెండు పర్యాయాలు పార్టీ అభ్యర్ధిగా పోటీచేసిన కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ స్వల్ప ఓట్ల తేడాతో ఓడారు. ఈ సారి పార్టీ తరఫున బరిలోకి దిగేందుకు ఆయనతోపాటు ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు నాగారిగారి ప్రీతం, రాష్ట్ర అధికార ప్రతినిధి అన్నెపర్తి జ్ఞానసుందర్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి గుడిపాటి నర్సయ్య, నాయకులు డాక్టర్‌ వడ్డెపల్లి రవి, ఇటికాల చిరంజీవి, ఈనెల 2న ఖమ్మంలో పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డితో కాంగ్రె్‌సలో చేరనున్న ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవితో పాటు మరికొందరు రేస్‌లో ఉన్నారు. దీంతో ఎన్నికల ప్రకటన వెలువడక ముందే తుంగతుర్తి నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది.

Updated Date - 2023-07-01T00:32:29+05:30 IST