మా గ్రామాలను గుడిపల్లి మండలంలో కలపవద్దు
ABN , First Publish Date - 2023-08-19T23:25:09+05:30 IST
‘పీఏపల్లి ముద్దు - గుడిపల్లి వద్దు’ అనే నినాదంతో నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలోని చిలకమర్రి గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
పెద్దఅడిశర్లపల్లి, ఆగస్టు 19 : ‘పీఏపల్లి ముద్దు - గుడిపల్లి వద్దు’ అనే నినాదంతో నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలోని చిలకమర్రి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కొత్తగా ప్రకటించిన గుడిపల్లి మండలంలో తమ గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాలను కలపవద్దని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం జడ్చర్ల- కోదాడ జాతీయ రహదారిపై స్థానిక సర్పంచ కేతావత విజయలక్ష్మీమూనా ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా సర్పంచ కేతావత విజయలక్ష్మీమూనా మాట్లాడుతూ అభివృద్ధి చెందిన పీఏపల్లి మండలంలో ఉంటే మా గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. గుడిపల్లిలో కలిపితే నూతన కార్యాలయాలు ఏర్పడాలంటే సమయం పడుతుందని, అక్కడికి వెళ్లడానికి రవాణా ఇబ్బందులు తదితర సమస్యలను ఎదుర్కొవడంతో పాటు తమ గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. తమ పంచాయతీ పరిధిలోని గ్రామాలను పీఏపల్లి మండలంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు ఇటీవల గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానం చేసి కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశామన్నారు. రాస్తారోకోలో మాజీ సర్పంచ మావిండ్ల లక్ష్మీనారాయణ, పీఏసీఎస్ మాజీ వైస్‌చైర్మన శ్రీనివా్‌సయాదవ్, యాదయ్య, లింగయ్య, యువజన కాంగ్రెస్ వార్డు సభ్యులు కొర్ర బాలకృష్ణ నాయక్, యువకులు, ప్రజలు పాల్గొన్నారు.