వైకుంఠనాథుడి దివ్య దర్శనం

ABN , First Publish Date - 2023-01-03T01:10:57+05:30 IST

భక్తజనబాంధవుడు, ఏకశిఖరవాసుడు స్వయంభూ పాంచనారసింహుడు యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడు ప్రధా నాలయ ఉత్తర ద్వారం చెంత వైకుంఠనాథుడుగా(పరమపథనాథుడిగా) భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.

వైకుంఠనాథుడి దివ్య దర్శనం
యాదగిరిగుట్ట క్షేత్రంలో భక్తజనులకు వైకుంఠ ద్వారంలో దర్శనమిస్తున్న లక్షీనరసింహస్వామి

యాదగిరిగుట్టలో వైకుంఠ ద్వార దర్శనం

జయజయధ్వానాలతో మార్మోగిన యాదాద్రి క్షేత్రం

యాదగిరిగుట్ట, జనవరి 2: భక్తజనబాంధవుడు, ఏకశిఖరవాసుడు స్వయంభూ పాంచనారసింహుడు యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడు ప్రధా నాలయ ఉత్తర ద్వారం చెంత వైకుంఠనాథుడుగా(పరమపథనాథుడిగా) భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన సూర్యోదయ శుభవేళ సోమవారం ఉదయం 6.48గంటలకు పరమపథనాథుడి దివ్య అలంకారంలో యాదాచలేశుడు లక్ష్మీనృసింహుడు ఉత్తర పంచతల రాజగోపురం వద్ద వెండి గరుడ వాహనంపై భూదేవి, శ్రీదేవి సమేతుడిగా దర్శనమిచ్చి ముక్కోటి దేవతలను, యావత్‌ భక్తజన కోటిని తరింపజేశాడు. జగత్కల్యాణ కారకుడు.. వైకుంఠనాధుడు శ్రీమహావిష్ణువు, ముక్కోటి దేవతలకు దర్శనమిచ్చే పవిత్ర శుభ ఘడియల్లో యాదగిరినాథుడి వైకుంఠ ద్వార దివ్య దర్శనాల కోసం భక్తజనులు పెద్దసంఖ్యలో బారులు తీరారు. పట్టు వస్త్రాలు, ముత్యాలు, వజ్ర వైడూర్యాలు పొదిగిన స్వర్ణాభరణాలతో అలంకరించిన అవతారమూర్తి యాదగిరివాసుడు లక్ష్మీనృసింహుడిని గరుఢవాహనంపై ప్రఽధానాలయ ఉత్తర ద్వారం చెంత అలంకారసేవ కొలువుదీరగా.. భక్తుల జయజయ ధ్వానాలు.. నారసింహ నామస్మరణలు.. వేద పండితుల పారాయణాలు.. అర్చక స్వాముల మంత్రోచ్చారణలు, మంగళవాయిధ్యాల మధ్య లక్ష్మీనరసింహుడు దివ్యతేజోరూపంతో భక్తులకు దర్శనమి చ్చారు. లక్ష్మీనృసింహుడు.. పరమభక్తాగ్రేసరులు ఆళ్వారాచార్యుల సేవకు అర్చకులు ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా నిర్వహించి ఆలయ తిరువీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. యాత్రాజనులు స్వామివారి దివ్య మంగళరూపాన్ని కనులారా వీక్షించి పులకించారు. ఈ వైదిక పర్వాలను దేవస్థాన ప్రధానార్చకులు నల్లన్‌థిఘళ్‌ లక్ష్మీనరసింహాచార్యులు, మరింగంటి మోహనాచార్యులు, అర్చక బృందం, వేదపండితులు నిర్వహించగా ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో ఎన్‌.గీతారెడ్డి పర్యవేక్షించారు.

పాతగుట్ట దేవాలయంలో ముక్కోటి పర్వాలు

యాదాద్రి దేవస్థాన అనుబంధ ఆలయం పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం ఉత్తర ద్వారం చెంత స్వామివారు పరమపథనాధుడుగా భక్తులకు దర్శనమి చ్చాడు. వేకువజామునే ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరిం చిన అర్చకస్వాములు అలంకార సేవను ఉదయం 6.48గంటలకు ఉత్తర ద్వారం వద్ద వేదమంత్రోచ్ఛరణలు.. మంగళవాయిద్యాల నడుమ అధిషింప జేశారు. పాతగుట్టలో స్వామివారిని ఉత్తర ద్వారం చెంత భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

వైభవంగా ధనుర్మాస వేడుకలు

నిత్యపూజలు, ధనుర్మాస వేడుకలు వైభవంగా జరిగాయి. వేకువజామున స్వామిని మేల్కొలిపిన ఆచార్యులు బాలాలయంలో కొలువుదీరిన గోదాదేవిని కొలుస్తూ తిరుప్పావై పాశుర పఠనాలు జరిపారు. ఆండాళ్‌ అమ్మవారు శ్రీరంగనాధుడిని భర్తగా ఆరాదిస్తూ ఆలపించిన తిరుప్పావై పాశుర పఠనం జరిపిన ఆచార్యులు శ్రీవ్రత పూజా వైశిష్టాన్ని భక్తులకు వివ రించారు. అనుబంధ రామలింగేశ్వరుడికి నిత్య పూజలు స్మార్త సంప్రదాయ పద్ధతిలో కొనసాగాయి. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.41, 18,136ల ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. అనుబంధ పాత గుట్ట ఆలయంలోనూ నిత్యకైంకర్యాలు, ధనుర్మాస పర్వాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి.

ముక్కోటి పర్వదినాన ప్రముఖుల పూజలు

మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి, దాస్యం వినయ్‌భాస్కర్‌, ఫైనాన్స్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ రామకృష్ణారావు, ప్రభుత్వ ప్లానింగ్‌ కమిటీ సభ్యుడు జి. నర్సింగరావు, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగ య్యయాదవ్‌, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, ఎమ్మెల్సీ భానుప్ర కాశ్‌రావు, వైటీఈఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, అదనపు కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి, డీసీపీ నారాయణరెడ్డి పరమపథనాథుడి అలంకారసేవను ఉత్తర ద్వారం చెంత దర్శించుకున్నారు. అనంతరం ప్రధానాలయంలోని స్వయం భువులను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

భక్తుల పాట్లు.. ఏర్పాట్లపై అసంతృప్తి

ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజు ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ప్రధానాలయం చుట్టూ నాలుగు వైపులా కృష్ణరాతితో నాలుగు పంచతల రాజగోపురాలు నిర్మించారు. దీంతో ఈ ఏడాది యా దగిరి క్షేత్రంలో ఉత్తర ముఖద్వారం చెంత వైకుంఠనాథుడి అలంకా రసేవలో భక్తులు దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.ఆలయ ఉద్ఘాటన అనంతరం ఎన్నడూ లేని విధంగా స్వామివారు వైకుంఠ ద్వారంలో దర్శనమివ్వనుండంతో రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ప్రధానాలయ ఉత్తర పంచతల రాజగోపురం చెంత స్వామివారి అలంకారసేవ, ఆళ్వారాచార్యుల సేవలను అధికారులు ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు. దేవదేవుడిని ముక్కోటి ఏకాదశి శుభ గడియల్లో దర్శించుకునేందుకు భక్తులు నానాపాట్లు పడ్డారు. ముక్కోటి వేడుకలను వీక్షించేందుకు ప్రభాతవేళ సుమారు 20నుంచి 25వేల మంది భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు. ఉత్తర ద్వారం చెంత అధికారులు చేసిన ఏర్పాట్లు అంతంతమాత్రంగానే ఉండడం, గతంలో మా దిరిగా దర్శన క్యూలైన్‌ ఏర్పాటు లేకపోవడంతో భక్తులు గుంపులు గుంపులుగా అలంకారసేవను దర్శించుకునేం దుకు ఎగబడ్డారు. అధికారులు నామమాత్రంగా ఏర్పాట్లు చేశారని, దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు వ్యయప్రయాసలు పడాల్సివచ్చిందని భక్తులు వాపోయారు. గతంలో అలంకార సేవను వేదికపై ఏర్పాటుచేసిన పీటపై ఉంచేవారని, ఈసారి కూడా అలాచేస్తే నృసింహుడి దర్శనభాగ్యం అయ్యేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆకట్టుకున్న కళాకారుల నృత్య ప్రదర్శనలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో సోమవారం ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా మేడ్చల్‌ జిల్లా రాంపల్లికి చెందిన సాంస్కృతిక విశ్వకళా మండలి ఆధ్వర్యంలో కళాకారుల నృత్య ప్రదర్శనలు భక్తు లను విశేషంగా ఆకట్టుకున్నాయి. డాక్టర్‌ ఎస్‌సీ. కృష్ణకుమారి పర్యవేక్షణలో 20మంది కళాకారులు నాట్య ప్రద ర్శనలు చేశారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కె. రాంనర్సయ్య మాట్లాడుతూ ఐదు నెలలుగా స్వామి సన్నిధిలో భక్తి భావంతో కళాకారులు నృత్యప్రదర్శనలు చేస్తున్నారని తెలిపారు. సోమవారం ఉదయం దేవస్థాన ప్రధాన కార్యాల యంలో 2023 నూతన సంవత్సరం డైరీని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి తదితరులు ఆవిష్కరించారు.

వార్షిక అధ్యయనోత్సవాలకు శ్రీకారం

లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం వార్షిక అధ్యయనోత్సవాలు సంప్రదాయరీతిలో నిర్వహించారు. యాదగిరికొండపై పంచనారసింహులు కొలు వైన ప్రధానాలయంలో ఆగమ శాస్త్రరీతిలో స్వస్తివాచనంతో మహోత్సవాలకు శ్రీకా రం చుట్టారు. పుణ్యహవాచన మంత్రజలాలతో ఆలయ పరిసరాలను శుద్ధి చేసి సంప్రదాయ రీతిలో ఉత్సవాలు ప్రారంభించారు. స్వామివారికి, నమ్మాళ్వార్లకు స్న పన తిరుమంజనాలు నిర్వహించారు. ప్రధానా లయ అష్టభుజి ప్రాకార మం డపం లోని యాగశాలలో పంచసూక్తాలు, మూల మంత్ర పఠనాలతో హవనం జరిపారు. వైష్ణవ భక్తాగ్రేసరులు నమ్మాళ్వార్‌ను, అవతారమూర్తి లక్ష్మీనరసింహులను పట్టు వస్త్రాలు, వివిధ రకాల పుష్పాలతో దివ్యమనోహరంగా అలంకరించి తిరువీధి సేవో త్సవం నిర్వహించారు. రాత్రివేళ స్వామివారిని మత్స్యావతారంలో అలంకరించి సే వించారు. పాంచరాత్రాగమ శాస్త్ర పద్ధతిలో ఆలయ ప్రాశస్త్యం కోసం ఆరురోజుల పాటు అధ్యయనోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. అధ్యయనోత్సవాల్లో భాగంగా దేవదేవుడు లక్ష్మీనరసింహులను ప్రత్యేక అలంకారాల్లో సేవిస్తారు.

వసతి గదుల సముదాయం ప్రారంభం

యాదగిరిక్షేత్రంలో కొండకింద తులసీకాటేజ్‌లో నూతనంగా నిర్మించిన 242 వసతి గదుల సముదాయాన్ని సోమవారం మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీష్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిలు సంప్రదాయరీతిలో ప్రారం భించారు. ముందుగా దేవస్థాన పురోహితులు విఘ్నేశ్వరుడికి తొలిపూజలతో సత్యనారాయణస్వామి వ్రత పూజలు నిర్వహించగా, వీరు వ్రత పూజల్లో పాల్గొని వసతి గదుల సముదాయాన్ని రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు.

Updated Date - 2023-01-03T01:11:00+05:30 IST