నిధుల కేటాయింపులో వివక్ష
ABN , First Publish Date - 2023-01-11T00:31:15+05:30 IST
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం మండలానికి మంజూరు చేసిన నిధులు ఎంపీపీ తాను ఇష్టానుసారంగా అధికార పార్టీకి చెందిన సభ్యులకు కేటాయించడంపై విపక్ష ఎంపీటీసీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.
సర్వసభ్య సమావేశంలో విపక్ష ఎంపీటీసీల నిలదీత
సభను అడ్డుకుని నిరసన
రామన్నపేట, జనవరి 10: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం మండలానికి మంజూరు చేసిన నిధులు ఎంపీపీ తాను ఇష్టానుసారంగా అధికార పార్టీకి చెందిన సభ్యులకు కేటాయించడంపై విపక్ష ఎంపీటీసీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన రామన్నపేట మండల ప్రజా పరిషత సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి అధ్యక్షత వహించారు. ప్రజలతో ఎన్నికైన తమకు వివిధ పథకాల కింద మంజూరైన నిధులు అనుకూలంగా ఉన్న అధికార పార్టీ సభ్యులకే కేటాయించడం ఎంతవరకు న్యాయమని పోడియం ఎదుట గంటన్నర పాటు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో అధికార, విపక్ష ఎంపీటీసీ సభ్యుల మధ్య విమర్శలు చోటుచేసుకోవడంతో సమావేశం గందరగోళంగా మారింది. మండలానికి 26లక్షల రూపాయలు సభ్యులకు తెలుపకుండా ఏకపక్షంగా నిధులు ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించారు. తమ సహకారంతో ఎంపీపీ అయి నేడు విశ్వాసాన్ని మరిచారని ఎంపీటీసీ సభ్యులు విమర్శించారు. ఎంపీటీసీ సభ్యులు పోడియం ఎదుట బైఠాయించగా, చేసేదేమీ లేక ఎంపీపీ సభ ఇంతటితో ముగిసిందని ప్రకటించారు. అనంతరం విపక్ష ఎంిపీటీసీ సభ్యులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేసి ఎంపీడీవో జలంధర్‌రెడ్డికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, బడుగు రమేష్, ఎర్రోళ్ల లక్ష్మమ్మ, పూస బాలామణి, మడూరి జ్యోతి, ఎండి.రేహాన, వేమవరపు సుధీర్ బాబు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే, ఎంపీపీ కక్షపూరిత చర్యలు సరైనవి కావు: సీపీఎం
రామన్నపేట మండల ఎంపీటీసీలకు నిధులు కేటాయించే విషయంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రోద్బలంతో స్థానిక ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి కక్షపూరిత చర్యలు సరైనవి కావని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మేక అశోక్ రెడ్డి అన్నారు. ఎంపీటీసీలకు మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిషత ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని, అధికార పార్టీ ఎంపీటీసీలకు నిధులు కేటాయించి ప్రతిపక్ష పార్టీల ఎంిపీటీసీలకు నిధులు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా ఎంపీటీసీ సభ్యులకు రావాల్సిన నిధులు మండల పరిషత సభ్యులందరికీ తమ గ్రామాల అభివృద్ధి కోసం ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో ిసీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జెల్లల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, ఎంపీటీసీలు బడుగు రమేష్, ఎర్రోళ్ల లక్ష్మమ్మ, సీపీఎం మండల కార్యదర్శి సభ్యులు బోయిని ఆనంద్, కూరెళ్ల నరసింహాచారి, బల్గూరి అంజయ్య, గన్నెబోయిన విజయభాస్కర్, ఎండి.రషీద్, నగేష్, కందుల హనుమంతు, బాలరాజు, మల్లారెడ్డి, జగన్మోహనరెడ్డి, అంజయ్య, ముకుంద పాల్గొన్నారు.