Share News

చెర్వుగట్టుపై భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2023-12-12T00:26:49+05:30 IST

: కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది

చెర్వుగట్టుపై భక్తుల రద్దీ
చెర్వుగట్టు గర్భాలయంలో స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో వస్తున్న భక్తులు

నార్కట్‌పల్లి, డిసెంబరు 11: కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారి నిజాభిషేకం నుంచే దర్శనానికి క్యూ కట్టారు. స్వామివారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి కొండపై కార్తీక దీపాలు వెలిగించారు. సామూహిక సత్యదేవుడి వ్రతాలు ఆచరించారు. మహామండపంలో సామూహిక లింగాభిషేకాలు నిర్వహించారు. కాగా పోలీస్‌ సిబ్బంది లేక నియంత్రణ కొరవడటంతో వాహనాలు ఇష్టారీతిన కొండపైకి చేరడంతో ఘాట్‌రోడ్‌పై ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. కొండపై ఆటోలు నిలిపే ప్రదేశం వద్ద ఉన్న మరుగుదొడ్ల బ్యాక్‌ నుంచి దుర్వాసన వెదజల్లడంతో భక్తులు అసౌకర్యానికి గురయ్యారు.

స్వామివారిని దర్శించుకున్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ దంపతులు

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ దంపతులు చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదల మేరకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. తొలుత మహామండపంలోని గణపతిని దర్శించుకున్న వారు ప్రధానాలయం వద్ద ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వారికి దేవస్థాన ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ వేదాశీర్వచనం చేయగా, స్వామి వారి ప్రసాదాలను ఈవో సిరికొండ నవీన్‌కుమార్‌ అందజేశారు. అనంతరం గుట్టపై ఉన్న ఇతర ఉపాలయాలను వారు దర్శించుకున్నారు.

Updated Date - 2023-12-12T00:26:51+05:30 IST