యాదగిరిక్షేత్రంలో భక్తుల సందడి

ABN , First Publish Date - 2023-03-25T23:42:05+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం భక్తుల పూజల సందడి నెలకొంది.

యాదగిరిక్షేత్రంలో భక్తుల సందడి
ఉత్సవమూర్తులను సువర్ణ పుష్పాలతో అర్చిస్తున్న అర్చకుడు

నిత్యాదాయం రూ.37.95లక్షలు

యాదగిరిగుట్ట, మార్చి 25: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం భక్తుల పూజల సందడి నెలకొంది. వారాంతపు సెలవు కావడంతో యాత్రాజనులు పెద్దసంఖ్యలో క్షేత్ర సందర్శనకు తరలివచ్చారు. దీంతో కొండకింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, బస్‌ప్టాండ్లు, కొండపైన ఆలయ తిరువీధులు, ఉభయ దర్శన క్యూలైన్లు, ప్రధానాలయం, ప్రసాదాల విక్రయశాల తదితర ప్రాంతాలు కోలాహలంగా కనిపించాయి. ధర్మదర్శనాలకు రెండు గంటలు, ప్రత్యేక దర్శనాలకు గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. సుమారు 20వేల మందికి పైగా భక్తులు సందర్శించినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ భక్తుల రద్దీ కొనసాగింది. పాతగుట్ట ఆలయంలో స్వయంభువులను దర్శించుకున్న భక్తులు ఆలయ ఆవరణలో పిల్లాపాపలతో సేదతీరారు. స్వా మిని కేరళ రాష్ట్రానికి చెందిన ఐజీపీ సుదర్శన్‌, ఢిల్లీకి చెందిన ఐపీఎస్‌ అధికారి ప్రశాంత్‌ దర్శించుకున్నారు. ఆలయ ప్రాకార మండపంలో వీరికి అర్చకులు ఆశీర్వచనం చేశారు. దేవస్థాన అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.37,95,011 ఆదా యం సమకూరిందని దేవస్థాన అధికారులు తెలిపారు.

స్వామికి ఘనంగా నిత్యారాధనలు

యాదాద్రీశుడికి శనివారం నిత్యారాధనలు ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. వేకువజామున సుప్రభాతం, బిందెతీర్థంతో నిత్యారాధనలు ఆరంభించిన ఆచార్యులు రాత్రి వేళ శయనోత్సవ పర్వాలతో ఆలయ ద్వారబంధనం చేశారు. గర్భగుడిలోని స్వయంభువులను, సువర్ణ ప్రతిష్టా అలంకార కవచమూర్తులను వేదమంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల నడుమ అభిషేకిం చి తులసీ దళాలతో అర్చించారు. అష్ఠభుజిప్రాకార మండపంలో హోమం, నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలు ఆగమ శాస్త్రరీతిలో కొనసాగాయి. ప్రధానాలయ ముఖమండపంలో ఉత్సవమూర్తుల చెంత సువర్ణ పుష్పార్చనలు, అష్టోత్తర పూజల్లో భక్తులు పాల్గొని మొక్కు చెల్లించుకున్నారు.

సంప్రదాయరీతిలో వసంత నవరాత్రి ఉత్సవాలు

వసంత నవరాత్రి ఉత్సవాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. శివాలయంలో కొలుదీరిన పర్వత వర్థినీ సమేత రామలింగేశ్వరస్వామిని, స్ఫటికమూర్తులను కొలిచిన పూజారులు యాగశాలలో సీతారామచంద్రస్వామిని ఆరాధిస్తూ నిత్య పూజలు నిర్వహించారు. వేదమంత్ర పఠనాలు, మూల మంత్ర జపాలు, హవన పూజలను శివాలయ అర్చకబృందం శైవాగమ పద్ధతిలో నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ మూడోసారి కూడా ముఖ్యమంత్రి కావాలని సంగారెడ్డి జిల్లా ముగ్దుంపల్లి మండలంలోని దనసరి గ్రామం నుంచి బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాదయాత్రగా యాదగిరిగుట్ట ఆలయానికి చేరుకున్నారు. సుమారు 210కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి న వారిలో కార్యకర్త నాగయ్య సుమారు 21కిలోమీటర్ల మేర పొర్లుదండాలతో వైకుంఠద్వారం వరకు వచ్చి మెట్ల మార్గం గుండా కొండపైకి చేరుకున్నాడు.

Updated Date - 2023-03-25T23:42:05+05:30 IST