యాదగిరిగుట్టలో భక్తుల సందడి

ABN , First Publish Date - 2023-06-11T00:47:20+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం యాత్రాజనుల పూజల సందడి నెలకొంది.

యాదగిరిగుట్టలో భక్తుల సందడి
అక్షరాభ్యాసం చేయిస్తున్న కలెక్టర్‌ పమేలాసత్పథి, దేవస్థాన ఈవో గీతారెడ్డి

యాదగిరిగుట్ట, జూన్‌10: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం యాత్రాజనుల పూజల సందడి నెలకొంది. వారాంతపు సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి ధర్మదర్శనాలకు నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనాలకు గంట సమయం పట్టినట్టు భక్తులు తెలిపారు. సుమారు 40వేల మందికి పైగా భక్తులు ఆర్జిత సేవల్లో పాల్గొని మొక్కు చెల్లించుకున్నట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. ప్రధానాలయ ముఖమండపంలో సువర్ణ పుష్పార్చన, ప్రాకార మండపంలో వేదాశీర్వచనంతో పాటు పలు ఆర్జిత సేవోత్సవాల్లో భక్తులు కుటుంబసమేతంగా పాల్గొని మొక్కు తీర్చుకున్నారు. కొండకింద నాలుగు దఫాలుగా కొనసాగిన సత్యనారాయణస్వామి వ్రతపూజల్లో సుమారు 376జంటలు పాల్గొన్నాయి. నిత్య పూజలు ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా నిర్వహించారు. సుప్రభాతంతో ఆరంభమైన నిత్య పూజలు రాత్రి వేళ శయనోత్సవ పర్వాలతో ముగిశాయి.ఆలయ అష్టభుజి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలను సంప్రదాయరీతిలో నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.54,98,646 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.

యాదగిరిక్షేత్రంలో ఓ మోస్తారు వర్షం

యాదగిరికొండపైన శనివారం ఓ మోస్తారు వర్షం కురిసింది. కొన్ని రోజులుగా భానుడి ప్రతాపానికి తల్లడిల్లుతున్న భక్తులు శనివారం కురిసిన వర్షానికి కాస్త ఉపశమనం పొందారు. రెండు గంటల పాటు వర్షం కురిసింది.యాత్రాజనులు వర్షంలోనే ఇష్టదైవాల దర్శనాలకు తరలివెళ్లారు.

సంప్రదాయరీతిలో సామూహిక అక్షరాభ్యాసం

యాదగిరిక్షేత్రంలో రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా శనివారం సామూహిక ఉచిత అక్షరాభ్యాస కార్యక్రమం సంప్రదాయరీతిలో కొనసాగింది. కొండకింద సత్యనారాయణస్వామి వ్రత మండపం రెండో హాల్‌లో ఉదయం 10గంటలకు దేవస్థాన పురోహుతులు, వేదపండితులు విఘ్నేశ్వరుడికి తొలి పూజలతో చదువుల తల్లి సరస్వతీ అమ్మవారిని కొలిచారు. అనంతరం విద్యార్థులతో తల్లితండ్రులు శాస్త్రోక్త పూజల నడుమ అక్షరాభ్యాసం చేయించారు. ఈ విశేష పూజల్లో పాల్గొన్న ఆలయ అనువంశిఖ ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి, కలెక్టర్‌ పమేలాసత్పథి తదితరులు చిన్నారులతో అక్షరాలు దిద్దించారు. యాదగిరీశుడిని సీఐడీ ఎస్పీ గంగారామ్‌, ఐఏఎస్‌ అధికారి విజయేంద్రజోషి దర్శించుకున్నారు. స్వయంభువులను దర్శించుకుని సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు.

Updated Date - 2023-06-11T00:47:20+05:30 IST