బడికి రండి

ABN , First Publish Date - 2023-06-03T00:16:02+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపు, బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించే లక్ష్యంతో చేపడుతున్న బడి బాట కార్యక్రమం నేటి నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రారంభంకానుంది.

బడికి రండి

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపే లక్ష్యం

ఈ నెల 17 వరకు రోజువారీ కార్యక్రమాలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,113 ప్రభుత్వ పాఠశాలలు

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపు, బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించే లక్ష్యంతో చేపడుతున్న బడి బాట కార్యక్రమం నేటి నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రారంభంకానుంది. ఈ నెల 3వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాలో 3,113 ప్రభుత్వ పాఠశాలల వారీగా సంబంధిత ఉపాధ్యాయులు బడి బాట నిర్వహించనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ, సమగ్ర శిక్ష అభియాన్‌ రూపొందించిన ప్రణాళికను ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో అమలు చేయనున్నారు.

భువనగిరి టౌన్‌

ప్రభుత్వ పాఠశాలల్లోని సదుపాయాలు, బోధనా నాణ్యతను తల్లిదండ్రులకు వివరిస్తూ పిల్లల ను చేర్పించేలా ఉపాధ్యాయులు బడిబాట నిర్వహించనున్నారు. మారుతున్న విద్యా బోధన, విద్యార్థుల భవిష్యత్‌ అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ ఇంగ్లీష్‌ మీడియంగా మార్చనున్నారు. ‘మన ఊరు-మన బడి’ కింద ప్రభుత్వ పాఠశాలల భవనాలను ఆధునికీకరిస్తూ వసతులతోపాటు బోధనకు అనుగుణంగా డిజిటల్‌ తరగతులు, కంప్యూటర్‌ శిక్షణను బడిబాటలో ప్రచారంచేయనున్నారు. అర్హులైన బోధనా సిబ్బంది, మధ్యాహ్న భోజనం, రవాణా చార్జీలు, ఉచిత యూనిఫాం, పాఠ్య పుస్తకాలు లభిస్తాయని, చదువులో వెనుకబడిన విద్యార్థుల సామర్థ్యం పెంపునకు చేపట్టే 100రోజుల ప్రణాళికను వివరించనున్నారు. ఈ విద్యా సంవత్సరంనుంచి అందుబాటులోకి రానున్న ఉదయం అల్పాహారం తదితర అంశాలను వివరిస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 3,113 ప్రభుత్వ పాఠశాలల పరిధిలో సుమారు 7000 మంది ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీ చైర్మన్లు, సభ్యులు బడిబాటలో పాల్గొననున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత విద్యాసంవత్సరం సుమారు 4.10లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో నమోదై ఉన్నారు.

వలస కార్మికుల పిల్లలు, బడి బయట ఉన్న వారే లక్ష్యం

ఈనెల 12వ తేదీ నుంచి విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో వలస కార్మికుల పిల్లలు, బడి బయట ఉన్న పిల్లలే ప్రధాన లక్ష్యంగా బడిబాట కొనసాగనుంది. ఉమ్మడి జిల్లాలోని 4,203 అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీస్కూల్‌ విద్యార్థులుగా పరిగణిస్తున్న సుమారు 10వేల మంది పిల్లలను, బడిబయట ఉన్న బడి ఈడు పిల్లలు 1,249 మందిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే లక్ష్యంగా బడి బాట సాగనుంది. ఈమేరకు గత విద్యాసంవత్సరం ముగింపు నాటికే అంగన్‌వాడీ కేంద్రాల వివరాలను సేకరించి అర్హులైన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించే లక్ష్యాన్ని అధికారులు అగన్‌వాడీ టీచర్లకు నిర్ధేశించారు. వలసకార్మికులను గుర్తించి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తూనే అవసరమైన పిల్లలను ప్రభుత్వ హాస్టళ్లలో చేర్పించనున్నారు.

బడిబాట ఇలా...

. ఈ నెల 3 నుంచి 9 వరకు ఉదయం 7 నుంచి 11 గంటల వరకు పాఠశాలల పరిధిలోని ఇంటింటికీ వెళ్లి ప్రవేశాల స్వీకరణ.

. 12న పండుగ వాతావరణం లో పాఠశాలలను పునఃప్రారంభించాలి. తొలి రోజునే ప్రతీ విద్యార్థికి రెండు జతల యూనిఫాం, పాఠ్య, నోటు పుస్తకాలు, ప్రాథమిక పాఠశా ల విద్యార్థులకు బుక్స్‌ అందజేత.

. 13న ఎఫ్‌ఎల్‌ఎన్‌, తొలిమెట్టు తదిత ర అంశాలపై పాఠశాలలవారీగా చర్చ.

. 14న సామూహిక అక్షరాభ్యాసం, బాల సభలు.

. 15న ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించి భవిత కేంద్రాల ద్వారా అందే చికిత్సలపై అవగాహన కల్పించడం.

. 16న తల్లిదండ్రుల సమావేశాలు.

. 17న బాలికల విద్య, భవిష్యత్‌పై అవగాహన కల్పించడం.

ఏర్పాట్లు పూర్తి చేశాం : ప్రశాంత్‌రెడ్డి, ఇన్‌చార్జి డీఈవో

బడి బాట నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రతీ ప్రభుత్వ పాఠశాల పరిధిలో బడిబాట సాగేలా పర్యవేక్షి స్తాం. నిర్లక్ష్యం చూపే ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తప్పవు. రోజువారీ బడి బాట వివరాలను ప్రధానోపాధ్యాయులు ఎంఈవోల ద్వారా డీఈవో కార్యాలయానికి చేర వేయాలని సూచించాం. రోజువారీ విద్యార్థుల నమోదు వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా పాఠశాల విద్యాశాఖకు అందిస్తాం. బడిబాటతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరగనుంది.

Updated Date - 2023-06-03T00:16:02+05:30 IST