మరో గంటలో పెళ్లి ఉండగా బాల్యవివాహం అడ్డగింత

ABN , First Publish Date - 2023-03-19T00:18:56+05:30 IST

మరో గంటలో పెళ్లి జరగనుండగా యాదాద్రిభువనగిరి జిల్లాలో బాల్యవివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సంస్థాననారాయణపురం మండల కేంద్రానికి చెందిన బాలికకు చౌటుప్పల్‌ మండలం చిన్నకొండూరు గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి నిర్ణయించారు.

మరో గంటలో పెళ్లి ఉండగా బాల్యవివాహం అడ్డగింత

సంస్థాననారాయణపురం, మార్చి 18: మరో గంటలో పెళ్లి జరగనుండగా యాదాద్రిభువనగిరి జిల్లాలో బాల్యవివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సంస్థాననారాయణపురం మండల కేంద్రానికి చెందిన బాలికకు చౌటుప్పల్‌ మండలం చిన్నకొండూరు గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి నిర్ణయించారు. శనివారం ఉదయం 10.30గంటలకు స్థానిక రాఘవేంద్ర ఫంక్షనహాల్‌లో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే పెళ్లికుమార్తె మైనర్‌ అన్న సమాచారాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ఉదయం 9గంటల ప్రాంతంలో చైల్డ్‌ హెల్ప్‌లైన 1098 నెంబరుకు ఫోన చేసి చెప్పారు. చైల్డ్‌ హెల్ప్‌లైన నుంచి మండల కేంద్రంలోని పోలీసులతో పాటు షీ టీం, బాలల సంక్షేమసమితి, ఐసీడీఎస్‌, పోలీసులకు సమాచారం రావటంతో స్థానిక పోలీసులు, మిగతా శాఖల అధికారులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికి ఇంకా పెళ్లి కుమార్తె ఫంక్షనహాల్‌కు రాకపోవడంతో ఇంటికి వెళ్లారు. పెళ్లికుమార్తె వయస్సు ధ్రువీకరణ వివరాలను కుటుంబసభ్యుల నుంచి ఆరాతీశారు. ఆధార్‌ కార్డుతో పాటు పాఠశాల రికార్డుల్లోనూ బాలికకు 17ఏళ్ల రెండు నెలలుగా గుర్తించారు. దీంతో మైనర్‌కు పెళ్లి చేయడం చట్టరీత్యా నేరమని, వివాహాన్ని నిలిపివేయాలని బాలిక తల్లిదండ్రులకు సూచించారు. పెళ్లికి తాము అంతా సిద్ధం చేసుకున్నామని,కొద్దిగంటల్లో పెళ్లి అనగా నిలిపివేయడం సరికాదని, పెళ్లికి అవకాశం ఇవ్వాలని అధికారులను వేడుకున్నారు. అధికారులు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో పాటు బాలికను, కుటుంబసభ్యులను భువనగిరికి తరలించి బాలల పరిరక్షణ కమిటీకి అప్పగించారు. వారు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. అనంతరం బాలికను భువనగిరిలోని సఖి కేంద్రానికి తరలించారు.

Updated Date - 2023-03-19T00:18:56+05:30 IST