సంక్షేమ పథకాలతోనే ఉజ్వల భవిష్యత్‌

ABN , First Publish Date - 2023-06-03T00:14:15+05:30 IST

ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలే ప్రజల ఉజ్వల భవిష్యత్‌కు పునాది అని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన వేడుకల్లో జెండా ఆవిష్కరణ అనంతరం జిల్లాలో సాధించిన ప్రగతి నివేదికను వివరించారు.

సంక్షేమ పథకాలతోనే ఉజ్వల భవిష్యత్‌
వేడుకల్లో మాట్లాడుతున్న విప్‌ సునీత

సబ్బండ వర్గాల అభ్యున్నతికి బలమైన అడుగులు

సంక్షేమ పథకాలు.. సత్ఫలితాల ప్రణాళికలు

ప్రభుత్వ విప్‌,ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి

అట్టహాసంగా రాష్ట్ర అవతరణ వేడుకలు ఆరంభం

ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలే ప్రజల ఉజ్వల భవిష్యత్‌కు పునాది అని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన వేడుకల్లో జెండా ఆవిష్కరణ అనంతరం జిల్లాలో సాధించిన ప్రగతి నివేదికను వివరించారు. తొలుత ప్రజాప్రతినిధులు, జిల్లా న్యాయమూర్తులు, అధికారులు, స్వాతంత్ర సమరయోధులు, ఉద్యమకారులు, మలిదశ పోరాటంలో అసువులు బాసిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలతోపాటు రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ, దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

భువనగిరి టౌన్‌

రాష్ట్రంలోని సబ్బండ వర్గాల అభ్యున్నతికి బలమైన అడుగులు వేసి దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలుపుకున్నామని ప్రభుత్వ విప్‌ సునీత అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంకోసం తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రం సాధించిన ప్రగతిని చూసి ప్రపంచమే ప్రశంసల జల్లు కురిపిస్తోందన్నారు. ప్రజలు ఉజ్వల భవిష్యత్‌కు సత్ఫలితాలు ఇచ్చే ప్రణాళికల రూపకల్పన కేసీఆర్‌కే సాధ్యమన్నారు. దశాబ్దకాలంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించి సాధించిన అభివృద్ధి తెలంగాణ గర్వకారణంగా నిలిచిందన్నారు. పలు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధు లు, ప్రజాప్రతినిధులు తెలంగాణలోని పరిపాలన వ్యవస్థను, మెరుగైన ఆర్థిక స్థితిగతులను అధ్యయనంచేసి సంతృప్తిని వ్యక్తంచేశారని, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఆయా రాష్ట్రాల్లో అమలు చేయడానికి సమయాత్తమవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రణాళికబద్దమైన విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ, ప్రజల దీవెనలతో అన్నిరంగాల్లో రాష్ట్రం ముందు వరుసలో నిలిచిందన్నారు.

రాష్ట్రంలో వ్యవసాయం పండుగ

వ్యవసాయ రంగంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో దండగ అన్న వ్యవసాయమే రైతుల పాలిట పండుగలా మారిందని ప్రభుత్వ విప్‌ సునీత అన్నారు. ఈ యాసంగిలో 3,10,065 ఎకరాల్లో పంట సాగు కాగా రైతుబంధు ద్వారా 2,33,461 మందికి రూ.2,508.15 కోట్లు రైతుల ఖాతాల్లో, రైతు బీమా కింద 2,961 మంది రైతు కుంటుంబాలకు రూ.141.45కోట్లు నామినీ ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇవేకాక జిల్లాలో 92 క్లస్టర్లలో రైతు వేదికలు ఏర్పాటుచేసి ప్రతీ మంగళ, శుక్రవారాల్లో రైతుశిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ. 10.31 కోట్లు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ ద్వారా రూ.1.83కోట్లు గ్రామపంచాయతీలకు విడుదల చేశామన్నారు. గతేడాది పన్నుల రూపంలో రూ.15.10కోట్లు (95శాతం) వసూలు చేయగా, పల్లె ప్రగతిలో భాగంగా 421 పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేసి 418 వైకుంఠధామాలు, 650 పల్లెప్రకృతి వనాలు పూర్తి చేశామన్నారు. జాతీయ అవార్డు కింద తొమ్మిది విభాగాల్లో జిల్లాకు 24అవార్డులు రావడం ఆనందకరమన్నారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఆరు డంపింగ్‌ యార్డులు, 3,080 మంది వీధి వ్యాపారులకోసం డిజిటల్‌ పేమెంట్‌ ద్వారా రుణాలు విడుదల చేశామన్నారు. గ్రీన్‌ బడ్జెట్‌లో భాగంగా రూ.4.63కోట్లు మంజూరు కాగా, అందులో రూ.2.93కోట్లు వినియోగించుకున్నట్లు, ఆరు ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లు రూ.21.20కోట్లతో నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా 155 ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేసి 98 పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామన్నారు. మన-ఊరు, మన-బడిలో భాగంగా 251 పాఠశాలల్లో రూ.9.54కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. నూతనంగా ఏర్పడిన మోటకొండూర్‌, అడ్డగూడూరు మండలాల్లో రూ.50.54లక్షలతో పాఠశాల భవనాలు నిర్మించినట్లు తెలిపారు. యాదగిరిగుట్ట, చౌటుప్పల్‌ ఆరోగ్య కేంద్రాల్లో రూ. 46.09 కోట్లతో వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి ఆరోగ్య శాఖ మంత్రి హరీ్‌షరావు శంకుస్థాపన చేశారన్నారు.

రూ.155.69 కోట్లతో నృసింహ సాగర్‌ పనులు

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ-15 పనులు 69శాతం, ప్యాకేజీ-16 పనులు 63శాతం పూర్తి అయ్యాయని, ప్రధాన కాల్వ పనులు పురోగతిలో ఉన్నాయని సునీత అన్నారు. నృసింహసాగర్‌ ప్రాజెక్ట్‌ పేరుతో 11.39టీఎంసీల సామర్థ్యంతో నిర్మితమవుతున్న ఈ పనులకు రూ. 155.69కోట్లు వెచ్చించినట్లు వివరించారు. జిల్లాకు 3,464 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు మంజూరు కాగా, 1,158 ఇళ్లు పూర్తి కాగా, మిగిలినవి పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. గత వానాకాలం 2,83,133 మెట్రిక్‌ టన్నుల ధాన్యం, ఈ యాసంగిలో 2.50లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఇప్పటి వరకు 3,91,755 గొర్రెల (75శాతం) కొనుగోలుకు రూ. 233కోట్లతో గొల్ల, కురుమలకు సబ్సిడీ లభించిందన్నారు. సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామమైన తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో 75 కుటుంబాలకు రూ.7.50కోట్లతో ఆర్థికాభివృద్ధికి దోహదపడే యూనిట్లు, దళితబంధు పథకంలో భాగంగా 338 కుటుంబాలకు రూ.33.80కోట్ల మేర వివిధ యూనిట్లు మంజూరు చేశామన్నారు. దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి పథకంలో భాగంగా ఇప్పటికి 163ఎకరాలు పంపిణీ చేశామన్నారు. 2022 మార్చి 28న సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన యాదగిరిగుట్ట ఆలయం రూ.1,300 కోట్లతో నిర్మించినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్‌లో ప్రత్యేకంగా ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్లను నెలకొల్పినట్లు వివరించారు. అసాంఘిక కార్యకలాపాలు, నేరాల అదుపునకు జిల్లా పోలీసు యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటుదన్నారు. వేడుకల్లో జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్‌ పమేలాసత్పథి, డీసీపీ రాజే్‌షచంద్ర, అదనపు కలెక్టర్లు డి.శ్రీనివా్‌సరెడ్డి, దీపక్‌తివారీ, ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ జడల అమరేందర్‌, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొల్పుల అమరేందర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య, ఎంపీపీ నరాల నిర్మల, జడ్పీటీసీ బీరుమల్లయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎడ్ల రాజేందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:14:15+05:30 IST