భోన్గిర్‌ కాదు భువనగిరి

ABN , First Publish Date - 2023-01-01T22:55:21+05:30 IST

భువనగిరి.. వేల సంవత్సరాల చారిత్రక నేపథ్యంతో ముడిపడి ఉన్న పట్టణం పేరు. భువనగిరి పేరు వింటేనే సముద్ర మట్టానికి 600 అడుగుల ఎత్తులో ఉన్న ఏకశిలా పర్వతం, అద్భుతశైలిలో ఉన్న కోటగోడ నిర్మాణం, పలు రాజవంశాల పాలనతోపాటు తెలంగాణ ఉద్యమ నేపథ్యం నేటి ఆధునిక యుగంలో ప్రపంచస్థాయి పర్వతారోహకులను తీర్చిదిద్దుతున్న ఘటనలు కళ్లెదుట ఆవిశ్కృతమవుతాయి.

భోన్గిర్‌ కాదు భువనగిరి
భువనగిరిలో ఏర్పాటు చేసిన లవ్‌ భోన్గిర్‌ సెల్ఫీ పాయింట్‌

సెల్ఫీపాయింట్‌ వద్ద ‘లవ్‌ భోన్గిర్‌’గా ఏర్పాటు

అక్షరదోషాలను సవరించాలంటున్న పట్టణ ప్రజలు

భువనగిరి టౌన్‌, జనవరి 1: భువనగిరి.. వేల సంవత్సరాల చారిత్రక నేపథ్యంతో ముడిపడి ఉన్న పట్టణం పేరు. భువనగిరి పేరు వింటేనే సముద్ర మట్టానికి 600 అడుగుల ఎత్తులో ఉన్న ఏకశిలా పర్వతం, అద్భుతశైలిలో ఉన్న కోటగోడ నిర్మాణం, పలు రాజవంశాల పాలనతోపాటు తెలంగాణ ఉద్యమ నేపథ్యం నేటి ఆధునిక యుగంలో ప్రపంచస్థాయి పర్వతారోహకులను తీర్చిదిద్దుతున్న ఘటనలు కళ్లెదుట ఆవిశ్కృతమవుతాయి. తెలుగుతనం ఉట్టిపడేలా ఉన్న భువనగిరిని నాటి పాలకుల ఉచ్ఛరణ లోపం కారణంగా ‘భోన్గిర్‌’గా పిలవడం ప్రారంభమైంది. ఈమేరకు ఆంగ్లం, ఉర్దూ భాషలలో అలాగే రాయడం కూడా అప్పట్లో పరిపాటిగా మారింది. అయితే ఉచ్ఛరణతో నిమిత్తం లేకుండా నాటినుంచి నేటి వరకు అందరూ తెలుగులో, హిందీలో భువనగిరిగా రాస్తుండడం విశేషం. అయితే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన కొన్ని శాఖలు ఇప్పటికీ హిందీ, ఇంగ్లీష్‌, ఉర్దూలోనూ భువనగిరిగా మరికొన్ని శాఖలు మాత్రం ఇంగ్లీష్‌, ఉర్దూ భాషలలో బోన్గిరిగా పేర్కొంటున్నాయి. ఈతేడాను సవరిస్తూ అన్ని భాషలలో భువనగిరిగా రాస్తే బాగుంటుందనే భావన అందరిలో ఉంది.

ఆశలు నిరాశలుగానే..

జిల్లాల పునర్విభజనతో ఏర్పడిన యాదాద్రి భువనగిరి జిల్లా సమయంలోనైనా అన్నిభాషలలోనూ భువనగిరిగా రాయడం ప్రారంభమవుతుందనే ఆశలు నిరాశగానే మిగిలాయి. ఈ నేపథ్యంలో పెద్ద చెరువు కట్టను మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తూ ఏర్పాటు చేస్తున్న సెల్ఫీపాయింట్‌లో ఆంగ్లంలో ‘లవ్‌ బోన్గిర్‌’గా పేర్కొనడం పట్ల పట్టణవాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికార కార్యకలాపాలు ఎలా సాగుతున్నప్పటికీ కనీసం సెల్ఫీ పాయింట్‌లోనైనా ఆంగ్లంలో స్పష్టంగా భువనగిరిగా పేర్కొనాలని మునిసిపల్‌ యంత్రాంగాన్ని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

భువనగిరి పేరు ఇలా...

దక్కన్‌ పీఠభూమిలో మైసూర్‌ నందికొండ తర్వాత పేర్కొనదగిన ఎత్తయిన కొండ భువనగిరి ఏకశిలా పర్వతం. క్రీ.శ 4 నుంచి 6 శతాబ్దాలకాలంలో భువనగిరి కోటను విష్ణుకుండినుల రాజులు నిర్మించినట్లు క్రీ.శ. 567కు చెందిన శాసనాల ద్వారా తెలుస్తోంది. పట్టణానికి ఆగ్నేయ దిశగా 12వ శతాబ్ధం ఆరంభంలో కాకతీయ రెండో రాజు బేతరాజు కట్టించిన భువనేశ్వరాలయంతో లేదా, ఇక్కడి నుంచి పాలించిన త్రిభువనమల్ల బిరుదాంకితుడు 6వ విక్రమాదిత్య చాళుక్యరాజుతోపాటు పలు చారిత్రకసంఘటనలతో ఈ ప్రాంతం పేరు భువనగిరిగా స్థిరపడిందని చరిత్రకారులు పేర్కొంటారు. అలాగే యాదవ దంపతులైన భువనయ్య, గిరమ్మలు గిరి చుట్టూ అల్లుకున్న తీగ మొదలును చూపించినందుకు ఆ నాటి రాజు ఆ దంపతుల పేర్లతో ఈ ప్రాంతానికి భువనగిరిగా నామకరణం చేసారని మరో కఽథనం ప్రాచుర్యంలో ఉంది. ఏదేమైనా పలు రాజవంశాల పాలనకు, ఆధునిక సంఘటనలకు చారిత్రక సాక్ష్యంగా ఉన్న భువనగిరి పేరునే సెల్ఫీపాయింట్‌లోనూ పేర్కొనాలని ప్రజలు కోరుతున్నారు.

భువనగిరి ప్రత్యేకతను కాపాడాలి : కాచరాజు జయప్రకాశ్‌రావు

సెల్ఫీసాయింట్‌ ఏర్పాటులో భువనగిరి పట్టణ ప్రత్యేకతను కాపాడాలి. సెల్ఫీపాయింట్‌లో లవ్‌ భువనగిరిగా తెలుగులో ఏర్పాటు చేస్తే బాగుండేది. కాని ఇంగ్లీ్‌షలో ఏర్పాటుచేసినప్పటికి ఆ భాషలోనే భువనగిరిగా స్పష్టంగా పేర్కొంటే బాగుంటుంది. ఈ దిశగా పురపాలకులు, అధికారులు ఆలోచించాలి. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి.

పునరాలోచన చేస్తాం: ఎనబోయిన ఆంజనేయులు, మునిసిపాలిటీ చైర్మన్‌

గెజిట్‌ ఆధారంగా లవ్‌ భువనగిరి సెల్ఫీపాయింట్‌లో పేర్కొన్న అక్షరాలపై పునరాలోచన చేస్తాం. ప్రజల మనోభావాలను గౌరవించేందుకు ప్రయత్నిస్తాం. మార్పుపై మునిసిపల్‌ కౌన్సిల్‌తో చర్చిస్తాం. భాషతో నిమిత్తం లేకుండా భువనగిరి పేరుతో ఉన్న చారిత్రక నేపథ్యాన్ని గౌరవించేందుకు చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2023-01-01T22:55:22+05:30 IST